Chiranjeevi about Tourism in India: తాజాగా అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది. ఆ ప్రారంభోత్సవంలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు. అందులో మెగా ఫ్యామిలీ కూడా ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, తన భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్‌తో పాటు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అంతే కాకుండా తాజాగా హైదరాబాద్‌లో కూడా దీనికి సంబంధించి ఒక ఈవెంట్‌లో ఏర్పాటు చేశారు. గోల్కొండలో జరిగిన ఈ ఈవెంట్‌కు చిరంజీవి హాజరయ్యారు. గోల్కొండతో తనకు ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. ఇండియాలోని టూరిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన టూరిజం శాఖ మంత్రిగా ఉన్న రోజులను గుర్తుచేసుకున్నారు.


అదృష్టం అని భావిస్తున్నాను..


‘‘మామూలుగా జై శ్రీరామ్ అని బయటికి అనను. మనసులో అనుకుంటాను. ఇంట్లో పూజ గదిలో అనుకుంటాను తప్పా నిన్న అయోధ్యకు వెళ్లిన తర్వాత ఆ వైబ్రేషన్స్ ఇంకా నాలో ఉన్నాయి. అలాంటి అద్భుతమైన, చారిత్రాత్మకమైన సంఘటన ఈవెంట్‌లో పాల్గొనడం అనేది ఆ భగవంతుడు నాకు, నా కుటుంబానికి కల్పించిన అదృష్టం అని భావిస్తున్నాను’’ అంటూ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లడం తనకు ఎంత ఆనందాన్ని కలిగించిందో చెప్పుకొచ్చారు చిరంజీవి. దాంతో పాటు గోల్కొండలో జరిగిన ఈవెంట్‌కు మంత్రి కిషన్ రెడ్డి.. తనను పిలవడం కూడా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. 


గోల్కొండలో జ్ఞాపకాలు..


గోల్కొండను చూస్తుంటే గత స్మృతులు గుర్తొస్తున్నాయి అంటూ అప్పట్లో తన సినిమాల్లో అక్కడే హీరోయిన్లతో స్టెప్పులు వేయడం, విలన్లతో ఫైట్లు చేయడం వంటి విషయాలను గుర్తుచేసుకున్నారు చిరంజీవి. అంతే కాకుండా రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మగధీర’ షూటింగ్ కూడా అక్కడే జరిగిందని చెప్పుకొచ్చారు. ‘‘దానికి మించి నేను గొప్పగా చెప్పుకునేది ఏంటంటే నేను టూరిజం మినిస్టర్‌గా ఉన్నప్పుడు 2013 ఏప్రిల్‌లో గోల్కొండలో యూఎన్‌డబ్ల్యూటీఓ వారికి మూడురోజుల పాటు సదస్సు ఏర్పాటు చేశాను. అందులో ఒకరోజు రాత్రి వారికి విందు ఏర్పాటు చేశాను. దాదాపు 50 దేశాల నుండి 250 మంది విదేశీ ప్రతినిధులు వచ్చారు’’ అంటూ టూరిజం మినిస్టర్‌గా ఉన్న సందర్భంలో గోల్కొండలో జరిగిన స్పెషల్ ఈవెంట్ గురించి తెలిపారు చిరంజీవి.


ఇలాంటివి ఏ దేశంలోనూ లేవు..


‘‘ఆ ప్రతినిధులకు మన గురించి, మన సంస్కృతి గురించి, మన దేశ ప్రతిష్టత గురించి, చరిత్ర గురించి వారికి చెప్పాలనుకున్న ప్రయత్రంలో అప్పట్లో టెక్నికల్‌గా అందుబాటులో ఉన్న లైట్ అండ్ సౌండ్ సిస్టమ్‌తో ఇవన్నీ చూపించాం. వారు ఆశ్చర్యపోయారు. అది నాకు తీపి జ్ఞాపకం. ఇలాంటి దేశంలో టూరిజం ఇంకా ఎందుకు వెనకబడి ఉంది అని అన్నారు. నాకు కూడా అదే అనిపించింది. మన దేశంలో ఉన్న వేర్వేరు లొకేషన్స్, కల్చర్స్ ఏ దేశంలోనూ లేవు. మన దేశంలో మాత్రమే ఉన్నాయి’’ అంటూ హిమాలయాలు, థార్ ఎడారి, అడవులు, అడవి సంపద, అడవి జంతువులు, మూడు పక్కల సముద్రం, గుడులు.. ఇలా ఎన్నో ఉన్నాయన్నారు. ఇన్ని ఉండి కూడా ఎందుకు ఎక్కువ టూరిస్టులను ఆకర్షించలేకపోతున్నాం అంటూ ఎప్పుడూ బాధగానే అనిపిస్తుందని తెలిపారు. 


Also Read: 'చెన్నై స్టోరీ' చేతులు మారింది - సమంత ప్లేస్‌లో శృతి హాసన్