Shruti Haasan' Chennai Story: గతేడాది హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్.. ప్రస్తుతం అడివి శేష్‌తో కలిసి 'డెకాయిట్' అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. ఈ క్రమంలో అమ్మడు తాజాగా ఓ హాలీవుడ్ ఆఫర్ అందుకుంది. ఇండో-యుకె కో-ప్రొడక్షన్‌లో రూపొందే ఓ ఇంగ్లీష్ మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. కాకపోతే అది మరో అగ్ర కథానాయిక సమంత నటించాల్సిన ప్రాజెక్ట్‌ కావడం, ఇప్పుడు శృతి చెంతకు చేరడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.


బాఫ్తా(BAFTA) అవార్డ్ విన్నర్ ఫిలిప్ జాన్ దర్శకత్వంలో శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలో 'చెన్నై స్టోరీ' అనే అంతర్జాతీయ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఎన్‌.మురారి రచించిన ఫేమస్ నవల ‘ది అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఇదొక క్రాస్-కల్చరల్ రోమ్-కామ్ అని తెలుస్తోంది. ఇందులో 'బ్లైండ్ బై ది లైట్' ' లిఫ్ట్' ఫేమ్ వివేక్ కల్రాతో కలిసి నటించనుంది శృతి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలను బుధవారం సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 


కొన్ని నెలల క్రితం ఫిలిప్‌ జాన్‌ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కి ఎనౌన్స్ మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి 'ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' అనే టైటిల్ పెట్టినట్లు ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పటివరకూ ఆ సినిమా పట్టాలెక్కలేదు.. దాని గురించి అసలు ఊసే లేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి శృతి హాసన్ ప్రధాన పాత్రలో 'చెన్నై స్టోరీ' సినిమా చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


నిజానికి ఫిలిప్‌ జాన్‌ తో వర్క్ చేయడానికి సమంత చాలా ఇంట్రెస్ట్ చూపించింది. ఆ నవలను చదివి ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది తన కెరీర్ ను మలుపు తిప్పుతుందని భావించింది. అయితే ఇంతలోనే ఆమె మయోసైటిస్ బారిన పడడం, మెరుగైనచికిత్స తీసుకొని దాన్నుంచి పూర్తిగా కోలుకోడానికి గ్యాప్ తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే సామ్ ఆ సినిమా నుంచి తప్పుకోవడంతో, అందులో ఇప్పుడు శృతి హాసన్ భాగమయ్యారు.






'చెన్నై స్టోరీ' సినిమాలో శృతిహాసన్ చెన్నై కేంద్రంగా పనిచేసే ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో కనిపించనుంది. బ్రిటన్ కు చెందిన కెవిన్ హార్ట్, జాన్ రెనో, శామ్ వర్తింగ్టన్ లాంటి ఆర్టిస్టులు ఈ చిత్రంలో నటించనున్నారు. బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ - UK గ్లోబల్ స్క్రీన్ ఫండ్ మద్దతుతో ఇండో-యుకె కో ప్రొడక్షన్ లో ఈ సినిమా రూపొందనుంది. 'ఓ బేబీ' నిర్మాత సునీత తాటికి చెందిన గురు ఫిల్మ్స్‌ సంస్థ నిర్మాణంలో భాగం పంచుకుంటోంది. నిమ్మి హరస్గామా రచనా సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్.. చెన్నై, కార్డఫ్ నగరాల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఇకపోతే 'చెన్నై స్టోరీ' సినిమా గురించి శృతి హాసన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ, దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపింది. చెన్నైకి చెందిన తనకు, ఆ సిటీ ప్రత్యేకతను చూపించే స్టోరీలో భాగమయ్యే అవకాశం దక్కడం సంతోషంగా ఉందని పేర్కొంది. 2024 సంవత్సరానికి ఇది అందమైన ప్రారంభంగా భావిస్తున్నట్లు రాసుకొచ్చింది.  






Also Read: 'పుష్ప 2' To 'సలార్ 2'.. టాలీవుడ్ బాక్సాఫీస్ ని ఢీకొట్టబోయే క్రేజీ సీక్వెల్స్ ఇవే!