సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్టార్ హీరోల్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒకరు. సినిమాలు, డైలీ లైఫ్ స్టైల్, సామాజిక అంశాలపై ఆయన పోస్టులు చేస్తూ ఉంటారు. గత వారం (ఫిబ్రవరి 27న) ఆయన ఓ ట్వీట్ చేశారు. "హార్ట్ పంపింగ్... ఆందోళనగా ఉంది. అలాగే, హోప్ కూడా ఉంది" అని అమితాబ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఆయన అభిమానుల్లో ఆందోళనకు కారణం అయ్యింది. క్షణాల్లో ట్వీట్ వైరల్ అయ్యింది. అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ పోస్టులు చేశారు. చాలా మంది 'గెట్ వెల్ సూన్' అంటూ రిప్లైలు ఇచ్చారు. అయితే... ఆ ట్వీట్ గురించి అమితాబ్ బచ్చన్ క్లారిటీ ఇచ్చారు.

 

బహుశా... అభిమానుల రిప్లైలు, ట్వీట్స్ అమితాబ్ బచ్చన్ చూశారేమో? 'హార్ట్ పంపింగ్' ట్వీట్ గురించి బ్లాగ్‌లో వివరణ ఇచ్చారు. అయితే... బ్లాగ్ చదివే అలవాటు లేని చాలా మంది ఆయన ఆరోగ్యం ఎలా ఉందోనని ఆందోళన చెందుతున్నారు.

 



అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం బావుంది. ఆయన చేసిన హార్ట్ పంపింగ్ ట్వీట్ ఆరోగ్య పరిస్థితి గురించి కాదు. మద్ ఐలాండ్‌లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని జల్సాలోని ఇంటికి చేరుకోవడానికి మూడు గంటలు పట్టిందని అమితాబ్ పేర్కొన్నారు. ఆ సమయంలో చేసిన ట్వీట్ అది. "డైలాగులు నేర్చుకోవాలనే ఒత్తిడి, సరిగా నటిస్తున్నానా? లేదా? అనే భయం... ఈ పరీక్షలు పర్వాలేదు. కానీ, మద్ ఐలాండ్ నుంచి వెనక్కి రావడం సహనానికి పరీక్ష" అని అమితాబ్ బ్లాగ్‌లో రాశారు. వయసు రీత్యా అమితాబ్ బచ్చన్‌కు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అయితే... ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.