Manjummel Boys ‘Kanmani Anbodu’ Song: మలయాళంతో పాటు తమిళంలోనూ ‘మంజుమ్మెల్ బాయ్స్’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.  చిదంబరం ఎస్ పొడువల్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఫిబ్రవరి 22న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులతో ప్రదర్శింపబడుతోంది. కేవలం రూ.5 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పటికే రూ.110 కోట్లకు పైగా వసూళు చేసింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతోంది.


తమిళంలో సక్సెస్ కు ‘కణ్మణి అన్బోడు’ పాటే కారణమా?


అటు ‘మంజుమ్మెల్ బాయ్స్’ తమిళ నాట అద్భుత విజయాన్ని అందుకుంది. తమిళనాడులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళీ చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. అయితే, తమిళ తంబీలు ఈ సినిమాకు అద్భుత విజయాన్ని కట్టబెట్టడం వెనుక ఓ కారణం ఉందంటున్నారు సినీ అభిమానులు. ఈ చిత్రంలో ‘కణ్మణి అన్బోడు’ అనే పాటను పెట్టడమే అంటున్నారు. ఇప్పటికే ఈ సాంగ్ ‘ప్రేమమ్’ సినిమాలోనూ వాడారు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాలు సక్సెస్ కావడం వెను ‘కణ్మణి అన్బోడు’ పాట ఉందంటున్నారు.


కమల్ హాసన్‘గుణ’లోని ఐకానిక్ పాట 'కణ్మణి అన్బోడు'


విశ్వ నటుడు కమల్ హాసన్ టైమ్‌ లెస్ క్లాసిక్ ‘గుణ’లోని ఐకానిక్ పాట 'కణ్మణి అన్బోడు' (తెలుగులో ప్రియతమా నీవచట కుశలమా). తమిళ సినీ సంగీత ప్రియులు ఇప్పటికీ ఈ పాటను ఎంతో గౌరవంగా భావిస్తారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన ఈ పాటకు వాలి సాహిత్యం అందించారు. కమల్ హాసన్, ఎస్ జానకి కలిసి ఈ పాటను పాడారు. సినీ సంగీత ప్రియులకు ఎంతో ఇష్టమైన ఈ పాట చిదంబరం దర్శకత్వం వహించిన ‘మంజుమ్మెల్ బాయ్స్’, ఆల్ఫోన్స్ పుత్రేన్ తెరకెక్కించిన ‘ప్రేమమ్’లోనూ ఉపయోగించారు. ఈ గొప్ప పాట కారణంగానే ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయంటున్నారు సినీ అభిమానులు.


‘మంజుమ్మెల్ బాయ్స్’ కథ ఏంటంటే?


‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమా వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కింది. 2006లో తమిళనాడు కొడైకెనాల్​ ‘గుణ’ గుహల్లో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. కొంత మంది స్నేహితులు టూర్ కోసం వెళ్లగా, అందులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లోయలో పడిపోతాడు. ఆ స్నేహితుడిని కాపాడేందుకు మిత్రులు చేసిన ప్రయత్నాన్ని దర్శకుడు సినిమాగా తెరకెక్కించారు. రెస్క్యూ సిబ్బంది సైతం కాపాడలేమని చెప్పినా, తమ స్నేహితులు అతడిని ఎలా కాపాడుకున్నారో ఇందులో అత్యద్భుతంగా చూపించారు. ఈ సినిమాలోని ప్రతిసీన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సినిమా చూస్తున్నట్లుగా కాకుండా, ప్రేక్షకులు లీనం అయ్యేలా రూపొందించారు. శోభున్ షాహిర్​, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, అభిరామ్, అరుణ్, దీపక్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి మంచి స్పందన లభిస్తోంది. థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.  


Read Also: నాగార్జున జుట్టు నిజమైనదా? విగ్గా? - ఆయన మేకప్ ఆర్టిస్ట్ చంద్ర ఏం చెప్పారంటే?