Makeup Man Chandra About Nagarjuna: మేకప్ మ్యాన్ చంద్ర. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన గురించి తెలియని వారు ఉండరు. టాలీవుడ్ కింగ్ నాగార్జునకు పర్సనల్ మేకప్ మ్యాన్ గా దశాబ్దాల తరబడి పని చేశారు. అక్కినేని ఫ్యామిలీలో ఒకరిద్దరు మినహా మిగతా వారందరికీ మేకప్ వేశారు. ఆయన చేత మేకప్ చేయించుకున్న నటీనటులు ఉన్నత స్థానాలకు చేరుకుంటారనే పేరుంది. అందుకే తమ తొలి సినిమాకు చంద్రతో మేకప్ వేయించుకునేవారు.


నాగార్జునతో దశాబ్దాల అనుబంధం


తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్ర, నాగార్జునతో, ఆయన కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు. నాగార్జున ఫ్యామిలీ తనను మేకప్ మ్యాన్ గా కాకుండా కుటుంబ సభ్యుడిగా చూసుకునే వారని చెప్పుకొచ్చారు. ‘అన్నమయ్య’ సినిమాలో మినహా ఏ సినిమాలోనూ ఆయన విగ్ వాడలేదని వెల్లడించారు. “’అన్నమయ్య’ సినిమాలో నాగార్జునకు రెండుసార్లు మాత్రమే విగ్ వాడారు. ఆయన జుట్టుకు తెల్లరంగు మాత్రమే వేశాం. ఆ సినిమాలో సెకండాఫ్ లో మాత్రమే విగ్గు వాడారు. మిడిల్ ఏజ్ వ్యక్తిగా చూపించే సమయంలో విగ్గు వాడాల్సి వచ్చింది. అదే విగ్గును మళ్లీ క్లైమాక్స్ లో వాడారు.


నాగార్జున ఇప్పుడు కూడా విగ్ పెట్టరు. ఆయన జుట్టు బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా వరకు ఆయన సినిమాల్లో విగ్ ఉండదు. కేవలం హెయిర్ ఎక్సెన్షన్ మాత్రమే చేసే వాళ్లం. ‘అల్లరి అల్లుడు’ సినిమా కోసం భుజాల వరకు జుట్టు పెంచుకున్నారు. ‘శివ’ సినిమా మొదలుకొని ‘షిరిడి సాయిబాబా’ సినిమా వరకు నాగార్జునతో మేకప్ ఆర్టిస్టుగా నా ప్రయాణం కొనసాగింది. ఆయన నన్ను మేకప్ మ్యాన్ గా చూసే వారు కాదు. ఆయన ఫ్యామిలీ కూడా నన్ను బాగా చూసుకునేది. ఇంకా చెప్పాలంటే కుటుంబంలో మనిషిలా చూసుకునే వారు. వీడు పని వాడు. జీతం ఇస్తున్నాం. అట్ల ఏనాడు అనుకోలేదు. ఆయనతో ఉన్నంత కాలం నాకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. వాళ్ల కుటుంబంలోని దాదాపు అందరికీ నేను మేకప్ చేశాను. నాగ చైతన్య, అఖిల్‌ను నేను బడా మాలిక్, చోటా మాలిక్ అంటాను. నేను మేకప్ వేస్తే ఆయా నటీనటులకు మంచి భవిష్యత్ ఉంటుందని భావిస్తారు” అని చెప్పుకొచ్చారు.


నాగార్జున గారికి ఎందుకు దూరం అయ్యానంటే?


తనను ఎంతో బాగా చూసుకున్న నాగార్జున గారికి ఒకే ఒక్క కారణంతో దూరం కావాల్సి వచ్చిందని చంద్ర చెప్పారు. “మా అమ్మకు ఏజ్ ఎక్కువై మతిస్థిమితం ఉండేది కాదు. ఆమె నా దగ్గరే ఉండేది. ఇక్కడ ఈమెను చూసుకోవాలి. అక్కడ నాగార్జున గారికి మేకప్ మ్యాన్ గా పని చేయాలి. రెండు మేనేజ్ చేయలేక కష్టం అయ్యింది. ‘షిరిడి సాయిబాబా’ సినిమా కోసం వేరే ప్రాంతానికి వెళ్లాం. రాత్రి 10 గంటలకు ఫోన్ వచ్చింది. అమ్మకు సీరియస్ గా ఉంది అని చెప్పారు. నాగార్జున గారు రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయనకు చెప్పకుండానే కారు వేసుకుని వచ్చేశాను. తెల్లారి తను కోప్పడ్డారు. చెప్పకుండా వెళ్లిపోయాడు. రాత్రి పూట ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్స్‌బులిటీ? అన్నారు. ఈ ఘటన తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఆయన దగ్గరికి వెళ్లడం మానేశాను. అయినా, ఇప్పుడు కూడా నన్ను బాగానే పలకరిస్తారు” అని చెప్పారు.


Read Also: అతడు నా జీవితాన్ని నాశనం చేశాడు, చనిపోతున్నా.. ఇదే చివరి వీడియో: ‘హనుమాన్‌ జంక్షన్‌’ నటి విజయ లక్ష్మి