న్యాచురల్‌ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'హాయ్‌ నాన్న'. డెబ్యూ డైరెక్టర్‌ శౌర్యువ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నాని సరసన 'సీతారామం' ఫేం మృణాళ్‌ ఠాకూర్ హీరోయిన్‌ గా నటిస్తోంది. బేబి కైరా ఖన్నా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్‌ వీడియో, టైటిల్ గ్లింప్స్ అండ్ ఫస్ట్‌ లుక్‌ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అయిన మేకర్స్.. తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ తో వచ్చారు. 


''హాయ్, మ్యూజికల్ హీట్‌ని పెంచే సమయం ఆసన్నమైంది. హాయ్ నాన్న మ్యూజికల్ గాలా ప్రారంభం కానుంది. మీరు సిద్ధంగా ఉన్నారా?'' అని చిత్ర బృందం మంగళవారం సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ''ఈ ఆల్బమ్ మీ పాదాల నుండి మిమ్మల్ని తాకుతుంది. ప్రస్తుతానికి ఒక పాటతో ప్రారంభిద్దాం. చూస్తూనే ఉండండి'' అంటూ హీరో నాని ట్వీట్ చేసారు. ఈ సందర్భంగా సాంగ్ కు సంబంధించిన స్మాల్ గ్లింప్స్ ను షేర్ చేసారు. 


ఇందులో సముద్రపు అలల సవ్వడి మధ్య నాని, మృణాళ్‌ ఠాకూర్ ఒకరినొకరు చూసుకుంటూ, కళ్ళతోనే సైగలు చేసుకుంటూ ప్రేమించుకుంటూ కనిపించారు. ఇద్దరూ చాలా అందంగా కనిపించారు. ఈ వీడియోని బట్టి చూస్తే 'హాయ్ నాన్న' నుంచి ఓ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది. కాకపోతే మేకర్స్ ఫస్ట్ సింగిల్ ని ఎప్పుడు విడుదల చేస్తారనేది వెల్లడించలేదు. మరి త్వరలోనే ఈ వివరాలు వెల్లడిస్తారేమో చూడాలి. 






'హాయ్‌ నాన్న' చిత్రానికి హేషమ్ అబ్దుల్‌ వహబ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. మలయాళంలో 'హృదయం' వంటి చార్ట్ బస్టర్ తో మ్యూజికల్ సెన్సేషన్ గా మారిపోయిన హేషమ్.. ఇటీవల తెలుగులో 'ఖుషి' వంటి బ్యూటిఫుల్ ఆల్బమ్ అందించారు. ఇప్పుడు నాని సినిమాకి కూడా అద్భుతమైన సాంగ్స్ కంపోజ్ చేసినట్లుగా ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. టీ- సిరీస్ సంస్థ ఈ మూవీ మ్యూజికల్ రైట్స్ సొంతం చేసుకుంది. 


నాని కెరీర్ లో మైలురాయి చిత్రం..
'దసరా' వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత స్టార్‌ నాని నటిస్తోన్న 'హాయ్‌ నాన్న' సినిమాపై అందరిలో మంచి అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ ఇది నేచురల్ స్టార్ కెరీర్ లో మైలురాయి 30వ సినిమా. సక్సెస్ జోష్ లో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల తేదీని కూడా ప్రకటించేసాడు. క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.


'హాయ్‌ నాన్న' అనేది తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందే ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. వైరా ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (CVM), విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రవీణ్‌ ఆంటోనీ ఎడిటర్‌ కాగా.. జోతిష్‌ శంకర్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా వర్క్‌ చేస్తున్నారు. 'జెర్సీ', 'శ్యామ్‌ సింగరాయ్‌' సినిమాల తర్వాత కెమెరామెన్‌ సను జాన్‌ వర్గీస్‌ మూడోసారి నానితో  కలిసి పని చేస్తున్నారు. 


Also Read: ఓవర్సీస్‌లో పోలిశెట్టి క్రేజ్ మామూలుగా లేదుగా!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial