యంగ్ హీరో నవీన్‌ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతం వారం థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ బరిలో 'జవాన్' ఉండటం.. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా పెరఫార్మ్ చేస్తుందో అనే సందేహాలు కలిగాయి. అయితే రిలీజ్ కు ముందు పెద్దగా బజ్ లేనప్పటికీ, తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లు రాబట్టగలిగింది. ఈ క్రమంలో యూఎస్ లో 1 మిలియన్ డాలర్ (భారత కరెన్సీలో రూ.8.30 కోట్లు) కలెక్షన్స్ సాధించి, బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తోంది. 


ఫస్ట్ వీకెండ్ ముగిసే నాటికి యుఎస్‌లో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా 1.2 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ‘జవాన్’ ప్రభంజనాన్ని తట్టుకుని మరీ బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ లో కలెక్షన్స్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఓవర్ సీస్ లో నవీన్ పోలిశెట్టి క్రేజ్ ను తెలియజేస్తోంది. నవీన్ హీరోగా నటించిన తొలి చిత్రం 'ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ' తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, USలోనూ మంచి వసూళ్లను రాబట్టింది.. మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. అలానే కోవిడ్ టైంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'జాతిరత్నాలు' మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇప్పుడు యువ హీరో మరోసారి యుఎస్‌లో సత్తా చాటాడు. 


నిజానికి హీరోయిన్ అనుష్క శెట్టి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు. నవీన్ ఒక్కడే ప్రచారం మొత్తాన్ని తన భుజాన వేసుకొని సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలను సందర్శిస్తూ కాలేజ్ టూర్స్ నిర్వహించాడు. రెస్ట్ తీసుకోకుండా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చాడు. యూఎస్ వెళ్లి ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్ షోలు చూడటమే కాదు, యునైటెడ్ స్టేట్స్ లో కూడా తన మూవీని దూకుడుగా ప్రచారం చేశాడు. ఇవన్నీ కూడా ఈ సినిమా సక్సెస్‌కు దోహదపడ్డాయి.


ఏదైతేనేం 'ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ' 'జాతిరత్నాలు' ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న నవీన్ పోలిశెట్టి.. USAలో బ్యాక్ టూ బ్యాక్ మూడు 1 మిలియన్ $ మూవీస్ ఉన్న హీరోగా నిలిచాడు. ఈ జనరేషన్ హీరోలలో ఈ ఘనత సాధించిన ఏకైక నటుడు నవీన్ అనే అనుకోవాలి. అతని స్క్రిప్ట్ సెలక్షన్, పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్, పెర్ఫార్మన్స్ లతో పాటుగా.. డిఫెరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో తన సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లే విధానం ఈ విజయాలకు కారణమయ్యాయని చెప్పాలి.


నవీన్ పోలిశెట్టి ఇప్పటి వరకూ హీరోగా నటించిన మూడు సినిమాలు కూడా వేటికవే ప్రత్యేకమైన జోనర్స్ లో తెరకెక్కాయి. 'ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ' డిటెక్టివ్ కామెడీ థ్రిల్లర్ కాగా, 'జాతిరత్నాలు' ఒక హిలేరియస్ ఫన్ ఎంటర్టైనర్. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ప్రతీ సినిమాలోనూ తన బలమైన కామెడీని చూపిస్తూనే, ఏదొక సరికొత్త ఎలిమెంట్ ను జోడిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే హిట్లు కొడుతున్నాడు. 


తెలుగు రాష్ట్రాల్లో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ జోరు మరికొన్ని రోజులు ఉండేలా కనిపిస్తోంది. వీకెండ్ తర్వాత ‘జవాన్’ తెలుగు వెర్షన్ హవా కాస్త తగ్గడంతో నవీన్, అనుష్కల సినిమానే ఆడియన్స్ కు  ఫస్ట్ ఛాయిస్ అవుతోంది. దీనికి తోడు ఈ వారం రావాల్సిన ‘స్కంద’ ‘చంద్రముఖి-2’ చిత్రాలు వాయిదా పడటంతో వినాయక చవితి సీజన్ కూడా కలిసొచ్చేలా ఉంది. మరి రానున్న రోజుల్లో ఈ మూవీ ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.


Also Read: తండ్రితో లిప్ లాక్ - 33 ఏళ్ల తర్వాత స్పందించిన ఆలియా భట్ అక్క!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial