తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆయన అందించిన సేవలు అనేకం. తెలుగు జాతి ఖ్యాతిని పెంచిన ఆయన కేవలం నటుడిగానే కాదు రాజకీయ నాయకుడిగాను ఎన్నో సంచలనాలను సృష్టించారు. అలాంటి మహనీయుడి శతజయంతి ఉత్సవాలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఆయన శతజయంతి సందర్భంగా ఆయన సినీ సినీ జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లో ఎన్టీఆర్ గారితో సినిమాలు చేయాలంటే హీరోయిన్లు ఎగబడేవారట. ఆయనతో కనీసం ఒక్క సినిమాలో అయినా నటిస్తే చాలంటూ అనుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అయితే వారిలో ఎన్టీఆర్ గారితో ఎక్కువ సినిమాలు చేసిన అలనాటి హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా అప్పట్లో వాణిశ్రీ, సావిత్రి, జయప్రద, శ్రీదేవి వంటి హీరోయిన్లు సీనియర్ ఎన్టీఆర్ గారితో వరుస సినిమాలు చేశారు. ఇక వీరిలో ఎన్టీఆర్ - వాణిశ్రీ, ఎన్టీఆర్ - సావిత్రి ల కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఈ రెండు కాంబినేషన్స్ కి ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉండేది. వీరి కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే అది కచ్చితంగా సూపర్ హిట్టే.
ఎన్టీఆర్ - వాణిశ్రీ
వాణిశ్రీ - అన్నగారి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా 'నిండు హృదయాలు'. 1969లో ఈ సినిమా విడుదలైంది. కే విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమాలో వాణిశ్రీ - అన్నగారి జోడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో వీరి కాంబినేషన్లో సుమారు 30కి పైగా సినిమాలు వచ్చాయి. వాటిల్లో 'ఎదురీత', 'నిండు మనసులు', 'కోడలు దిద్దిన కాపురం', 'జీవిత చక్రం', 'అదృష్ట జాతకుడు', 'దేశోద్ధారకుడు', 'రాముని మించిన రాముడు', 'ఎదురులేని మనిషి', 'మాయామశ్చింద్ర', 'ఆరాధన', 'సింహబలుడు', 'సాహసవంతుడు' వంటి తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకొని వాణిశ్రీ - ఎన్టీఆర్ గారి కాంబినేషన్ కి ప్రేక్షకుల్లో ఎంతో మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. అంతేకాదు ఓకే హీరోయిన్ తో సుమారు 30కి పైగా సినిమాలు చేసిన ఏకైక హీరో అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ గారే కావడం విశేషం. ఇప్పటివరకు ఏ నటుడు కూడా ఒకే హీరోయిన్తో అన్ని సినిమాలు చేయలేదు. ఆ ఘనత కేవలం అన్నగారికి మాత్రమే దక్కింది.
సావిత్రి -ఎన్టీఆర్
ఇక వాణిశ్రీ తర్వాత అలనాటి మరో అగ్రనాటి మహానటి సావిత్రి గారితో అన్నగారు ఎక్కువ సినిమాలు చేశారు. ఎన్టీఆర్ - సావిత్రి సినిమా అంటే చాలు షూటింగ్ మొదలైనప్పటి నుంచి సినిమాపై ఓరేంజ్ లో అంచనాలు ఉండేవి. బయ్యర్లు కూడా అడ్వాన్సులు ముందుగానే ఇచ్చేవారు. అంతేకాదు ప్రేక్షకులు సైతం ఇంటిల్లిపాది వచ్చి వీరి కాంబినేషన్ సినిమాలను చూసి ఎంజాయ్ చేసేవారు. అంతలా ఈ ఇద్దరు సినిమాలకు అప్పట్లో క్రేజ్ ఉండేది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా 'పెళ్లి చేసి చూడు'. 1952 లో విడుదలైన ఈ సినిమాని ఎల్వి ప్రసాద్ డైరెక్ట్ చేశారు. ఇక ఆ తర్వాత సావిత్రి - ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో సుమారు 15 కి పైగా సినిమాలు వచ్చాయి. వాటిలో 'మిస్సమ్మ', 'కన్యాశుల్కం' 'ఇంటిగుట్టు', 'కుటుంబ గౌరవం', 'దేవత', 'గుండమ్మ కథ', 'నర్తనశాల', 'పాండవ వనవాసం', 'ఆత్మబంధువు' తదితర సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి.
జయప్రద - ఎన్టీఆర్
వీరి కాంబినేషన్లో కూడా చాలానే సినిమాలు వచ్చాయి. వాటిలో 'అడవి రాముడు', చాణక్య చంద్రగుప్త’, ‘యమగోల’, ‘రామకృష్ణులు’, ‘రాజపుత్ర రహస్యం’, ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’, ‘ఛాలెంజ్ రాముడు’, ‘సూపర్‌మేన్’, ‘సర్కస్ రాముడు’ వంటి సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి.
శ్రీదేవి - ఎన్టీఆర్
ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్‌ను కూడా ప్రేక్షకులు బాగా ఆధరించారు. ‘బడిపంతులు’ సినిమాలో మనవరాలిగా నటించిన శ్రీదేవి.. ఆ తర్వాత ఆయన పక్కనే హీరోయిన్‌గా నటించి ఆశ్చర్యపరిచింది. దీనిపై మొదట్లో విమర్శలు కూడా వచ్చాయి. అయితే, ఎన్టీఆర్ పక్కన నటించేందుకు శ్రీదేవిని ఎంపిక చేసినప్పుడు.. రాఘవేంద్రరావు సందేహించారట. ఆ విషయాన్ని ఎన్టీఆర్ వద్ద ప్రస్తావిస్తే.. ‘‘ఆమెకు ఎన్నేళ్లు?’’ అని ప్రశ్నించారట. ఇందుకు రాఘవేంద్రరావు.. ఆమెకు 16 ఏళ్లు అని సమాధానం చెప్పారట. దీంతో ఎన్టీఆర్ నవ్వుతూ.. ‘‘నాకు కూడా పదహారేళ్ల కదా. నటించాడనికి ఏజ్ ఎందుకు? వయస్సు ఒక నెంబర్ మాత్రమే’’ అని అన్నారట. అలా శ్రీదేవి.. ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేయడమే కాదు. ఆ తర్వాత పదుల సంఖ్యలో ఆయనతో సినిమాలు చేసింది.