R Narayana Murthy : పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'యూనివర్సిటీ' చిత్రం జూన్ 9న రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కాగా వచ్చే నెలలో ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్వాహకులు కసరత్తులు చేస్తున్నారు.


మూవీ రిలీజ్ డేట్ రివీల్ చేసిన సందర్భంగా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. 10వ తరగతిలో పేపరు లీకేజీలు, గ్రూపు 1-2 లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరులీకేజీలు.. ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి ? లంబకోణాలు నేర్పిన వాళ్ళే కుంభకోణాలు చేస్తూ ఉంటుంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు విలవిల కొట్టుకుంటూ ఊపిరాడక గింజుకుంటుంటే ఈ విద్యావ్యవస్థ, ఈ ఉద్యోగవ్యవస్థ నిర్వీర్యం కావాలా? కాకూడదు. మనది నిరుద్యోగ భారతం కాదు. ఉద్యోగ భారతం కావాలి అని చాటి చెప్పే చిత్రమే ఈ యూనివర్సిటీ. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ 9న రిలీజ్ అవుతోంది అని నారాయణ మూర్తి స్పష్టం చేశారు.


యూనివర్సిటీ సినిమాకు సంబంధించిన ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ట్రైలర్ లో పీపుల్ స్టార్ నారాయణ మూర్తి చెప్పిన డైలాగ్స్ కు మరింత స్పందన వచ్చింది. సామాజిక అంశాలపై పలు సినిమాలు తీసిన నారాయణ మూర్తి.. ఇప్పుడు యూనివర్సిటీ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.


నందమూరి తారకరామారావుకు భారతరత్న ఎందుకు ఇవ్వలేదని ఇటీవల నారాయణ మూర్తి ప్రశ్నించారు. ఆయన జాతీయ‌స్థాయిలో నేష‌న‌ల్ ఫ్రంట్ ద్వారా జాతీయ స్ఫూర్తినిచ్చారని చెప్పారు. అలాంటి ఆయనకు భారతరత్న ఇవ్వకపోవడం దుర్మార్గం, కుట్ర అని ఆరోపించారు. మే 20న జరిగిన శ‌త జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన్న ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి.. ఎన్టీఆర్‌కు భార‌తర‌త్న ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. 


"ఇందిరాగాంధీకి త‌మిళ‌నాడు అవ‌స‌రం ఉండటంతో ఎమ్జేఆర్‌ కి భార‌తర‌త్న‌ను ప్ర‌క‌టించింది. కానీ ఆయ‌న ఆ అవార్డును స్వీక‌రించ‌లేదు. ఎమ్జేఆర్ కంటే ఎన్టీఆర్ ఎందులో త‌క్కువ‌. నారా చంద్ర‌బాబునాయుడు దేశ రాజకీయాల‌ను శాసించారు. 2014 నుంచి 2018 వ‌ర‌కు ఎన్టీఏ భాగ‌స్వామిగా ఉన్నప్పుడు ఆయ‌న ఎన్నిసార్లు చెప్పినా కేంద్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు" అని నారాయణ మూర్తి చెప్పారు.


Also Read నిఖిల్‌తో రామ్ చరణ్ సినిమా - ఇక విప్లవం మొదలు


ఈ ప్ర‌పంచంలో ఎంద‌రో గొప్ప న‌టీన‌టులున్నారు. ఎందుకంటే... అన్ని వేషాల‌ను మెప్పించి ఒప్పించేలా చేయ‌టం ఎన్టీఆర్‌ గారికే చెల్లిందని, అందుక‌నే ఆయ‌న్ని విశ్వ‌విఖ్యాత న‌గ‌సార్వ‌భౌమ అని అంటారని ఆర్ నారాయణ మూర్తి చెప్పారు. ఆయ‌న ఏకంగా ఇందిరా గాంధీతో ఢీ అంటే ఢీ అన్నారని, తాను తెలుగుజాతి బిడ్డ‌ను అని రుజువు చేశారన్నారు. కేంద్ర‌మేంది? దాని పెత్త‌న‌మేంది? అని ఎదురు తిరిగిన మ‌హనీయుడు ఎన్టీఆర్‌గారు అని ఆయన కొనియాడారు. ఉమ్మ‌డి మ‌ద్రాసు రాష్ట్రంలో ఉండ‌టం కార‌ణంగా మ‌న తెలుగు వాళ్ల‌ని మ‌ద్రాసీల‌ని అనేవాళ్లు.. కానీ రామారావుగారు వ‌చ్చిన త‌ర్వాత నేను తెలుగువాడిన‌ని ప్ర‌పంచానికి చాటారని నారాయణ మూర్తి తెలిపారు.


Read Also : 100 Years of NTR: 'లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం' - ఎన్టీఆర్ సినిమాల్లో మహిళాభ్యుదయం