Hero Upendra: కన్నడ సీనియర్ హీరో ఉపేంద్ర స్టైలే వేరని ప్రేక్షకులు అంటుంటారు. అందుకే తన సినిమాల స్క్రిప్ట్ సెలక్షన్ అయినా, రాజకీయాల్లో తన ఇంపాక్ట్ అయినా ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ అవుతుంది. ముందుగా ఉపేంద్ర.. ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యి, ఆ తర్వాత తనకు అది సెట్ అవ్వడం లేదని తనే సొంతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. అదే ‘ప్రజాకీయ’. తాజాగా రాజకీయాలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు ఉపేంద్ర. అంతే కాకుండా ఏపీలో పవన్ కళ్యాణ్ గెలుపుపై కూడా ఆయన స్పందించారు. పాలిటిక్స్ అంటే ఎలా ఉండాలో తన స్టైల్‌లో వివరించారు.
ఆయన సూపర్ స్టార్..
ఏపీలో జరిగిన ఎన్నికల గురించి ముందుగా తాను మాట్లాడనని అన్నారు ఉపేంద్ర. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గెలుపుపై స్పందించమని అడగగా.. ‘‘నేను పవన్ కళ్యాణ్‌కు ఒక ఫ్యాన్ లాంటివాడినే. తన ఎనర్జీ, డెడికేషన్ నాకు చాలా ఇష్టం. ప్రజలకు ఏదో చేయాలని ఆలోచిస్తుంటారు. ఆయన సూపర్ స్టార్ కదా అయినా కూడా ఇంకా ప్రజలకు ఏదో చేయాలని అనుకోవడం మంచి విషయం’’ అని తెలిపారు ఉపేంద్ర. ఇక ఏపీలో ఆ పార్టీకి ప్రజల సపోర్ట్ దొరకడం వల్లే అలా గెలిచారని అన్నారు. రాజకీయాలంటే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మాత్రమే ఉందని, అందుకే తాను ఎవరి గురించి మాట్లాడనని స్టేట్‌మెంట్ ఇచ్చారు ఉపేంద్ర. ముందుగా ఓటు వేసే ప్రజల దగ్గరే తప్పు ఉన్నప్పుడు రాజకీయ నాయకులను ఎందుకు విమర్శించాలని ప్రశ్నించారు.
అవినీతిలేని సమాజం కష్టం..
‘‘ఏపీలో కూడా నాకు అన్ని పార్టీల నుంచి రమ్మని ఆఫర్ వచ్చింది. అప్పుడు కూడా అక్కడికి వెళ్లి నేనేం చేస్తాను? నావల్ల అవుతుందా? అని చాలా ఆలోచించాను’’ అని బయటపెట్టారు ఉపేంద్ర. రాజకీయాలంటే తన దృష్టిలో ఏంటని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ‘‘రాజకీయాలంటే బిజినెస్‌లాగా అయిపోయింది. డబ్బులు ఖర్చుపెట్టాలి. పెట్టుబడి పెట్టి గెలవాలి. అంత డబ్బు పెట్టి గెలిచిన తర్వాత అవినీతి లేని సమాజాన్ని తయారు చేయడం కష్టం. చాలామంది రాజకీయాల్లోకి రావాలి, గెలవాలి అనుకుంటారు. కానీ ఆ గెలిచే క్రమంలో చాలామందిని రాజకీయ సిస్టమ్ అనేది కంట్రోల్ చేసేస్తుంది. ముందు మీరు ఏం చేద్దామనుకొని వచ్చినా తర్వాత మాత్రం ఆ సిస్టమ్‌లో ఒక భాగమయిపోయి ఆడాల్సి వస్తుంది’’ అని తెలిపారు.
జీతం కోసం మాత్రమే..
‘‘ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ జీతం కోసం మాత్రమే పనిచేయాలి. మ్యానిఫెస్టో అంటే ఏది పడితే అది చెప్పకూడదు. దానిని కోర్టులో రిజిస్టర్ చేయాలి. అది చేయలేకపోతే ప్రజల చేతుల్లోకి ఏదైనా చేసే హక్కు రావాలి’’ అంటూ రాజకీయాల్లో రావాల్సిన మార్పుల గురించి మాట్లాడారు ఉపేంద్ర. పార్టీని చూసి, వ్యక్తిని చూసి ఓటు వేయడం కాకుండా విషయం చూసి ఓటు వేయమని ప్రజలకు సలహా ఇచ్చారు. తను పొలిటికల్ పార్టీ స్థాపించినా కూడా ఇలాంటి రాజకీయాలు చేయనని అన్నారు. అందుకే తను ఎక్కడా పోటీచేయలేదని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు వారి పని సరిగా చేయకపోతే ప్రశ్నించాలని తెలిపారు ఉపేంద్ర.
Also Read: ఆ ఒక్క సీన్ 5 నెలలు తీశాం - ‘నువ్వు నాకు నచ్చావ్’ డైనింగ్ టేబుల్ సీన్‌పై దర్శకుడి కామెంట్స్