టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో హీరో శ్రీకాంత్ ఒకరు. ఒకప్పుడు ప్రేమ కథల సినిమాలకు పెట్టింది పేరు శ్రీకాంత్. ఆయనకు ఫిమేల్ ఫ్యాన్స్ కూడా ఎక్కువే. 1991 లో ‘పీపుల్స్ ఎన్కౌంటర్’ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు శ్రీకాంత్. తరువాత వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అలా సుధీర్ఘంగా 32 ఏళ్ల పాటు సాగిన ఆయన సినీ ప్రయాణంలో దాదాపు 100 కు పైగా సినిమాల్లో నటించారు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటీవలే ఆయన మార్చి 23 న పుట్టిన రోజువేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ ఛానల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సినిమా కెరీర్, వ్యక్తిగత జీవిత విశేషాల గురించి పంచుకున్నారు. 


ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. నటుడిగా తన కెరీర్ లో 32 ఏళ్లు పూర్తి చేసుకోవడం తనకే ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ తాను అవకాశాల కోసం ఎదురు చూడలేదని అన్నారు. దేవుడి దయ వల్ల తాను ఎక్కువ కాలం కష్టపడకుండానే సినిమా అవకాశం వచ్చిందని, ఇక అప్పటి నుంచి విరామం లేకుండా నటిస్తున్నానని అన్నారు. తనకు ముందు నుంచీ సినిమాల మీద ఇంట్రస్ట్ ఉండేదని, అది తన తండ్రి గమనించారని అన్నారు. అయితే సినిమాల మీద ఇంట్రస్ట్ తో పది తర్వాత ఇంట్లో చెప్పకుండా చెన్నై పారిపోయాను, అక్కడ నాలుగు రోజులు చాలా కష్టాలు అనుభవించా. సినిమాలకు ఇది సమయం కాదని తెలసి, తర్వాత ఇంటి వచ్చానని అన్నారు. కొన్నేళ్ల తర్వాత సినిమాలలో అవకాశాల కోసం రెండేళ్లు తన తండ్రిని సమయం అడిగానని అన్నారు. అలా చాలా రోజులు అవకావం కోసం ఎదురు చూశానని, తన ఖర్చులకు ఇంటి నుంచే డబ్బు పంపేవారని అన్నారు. పెద్దగా కష్టపడకుండానే సినిమా ఛాన్స్ వచ్చిందని చెప్పారు. అవకాశాల విషయంలో తనను ఎవరూ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు. బహుశా తన వ్యక్తిత్వం, క్రమశిక్షణ వల్ల అయిండొచ్చని పేర్కొన్నారు. ఇవన్నీ తాను టాలీవుడ్ లో తన సీనియర్ నటుల నుంచే అలవాటు చేసుకున్నానని అన్నారు. 


ఇక సోషల్ మీడియాలో ఆయన ఫ్యామిలీపై వస్తోన్న ఫేక్ వార్తలపై కూడా శ్రీకాంత్ స్పందించారు. గతేడాది శ్రీకాంత్-ఊహ విడిపోతున్నట్టు వచ్చిన వార్తలపై ఆయన ఓ నోట్ ను కూడా విడుదల చేశారు. మళ్లీ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఎవరికి నచ్చినట్టు వాళ్లు వార్తలు రాస్తున్నారని, తమ బాధను ఎవరూ అర్థం చేసుకోరని అన్నారు. దానిపై తాను క్లారిటీ కూడా ఇచ్చానని, తర్వాత కూడా ఎక్కడకు వెళ్లినా ఇద్దరం కలిసే వెళ్తున్నామని చమత్కరించారు. ఊహకు సినిమా ఫంక్షన్స్, పార్టీలు అంటే ఇష్టం ఉండదని, బ్రతిమలాడి తీసుకెళ్ళాల్సి వస్తుందన్నారు. అంతకముందు తాను చనిపోయినట్టు కూడా వార్తలు వేశారని, కానీ తాను అలాంటివి పట్టించుకోనని అన్నారు. అయితే అలాంటి వార్తలు ఇంట్లో పెద్ద వాళ్లు చూస్తే తట్టుకోలేరని, ఇవన్నీ రాసేవారు ఆలోచించరని అన్నారు. అలాంటి వారి మీద ఏం యాక్షన్ తీసుకున్నా ఉపయోగం ఉండదని, వాళ్లంతట వాళ్లే మారాలని వ్యాఖ్యానించారు. రీసెంట్ గా సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్ కూడా చనిపోయినట్లు రాశారని, అది బాగా వైరల్ అవ్వడంతో తాను బతికే ఉన్నానని స్వయంగా ఆయనే ప్రకటించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇక శ్రీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఏదైనా రెడీ అంటున్నారు. ‘అఖండ’ సినిమాలో విలన్ గా చేసి మెప్పించారు. ప్రస్తుతం ‘ఆర్ సి15’, ‘ఎన్టీఆర్ 30’ లో కూడా నటిస్తున్నారు శ్రీకాంత్.


Also Read :  హిందూపూర్ వెళ్ళడానికి ముందు - అమ్మాయి నిష్కతో తారక రత్న, చివరి వీడియో ఇదేనా?