December Second Week Movies and Series : ప్రతీవారంలాగానే ఈ శుక్రవారం కూడా థియేటర్లలో సినిమా సందడి మొదలుకానుంది. కానీ ఈసారి ఒక సినిమా మాత్రం శుక్రవారం కాకుండా గురువారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లు మాత్రమే కాదు.. ఓటీటీలు కూడా కొత్త సినిమాలతో కలకలలాడనున్నాయి. ఇక ఈవారం థియేటర్లలో, ఓటీటీలో విడుదల కానున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం..
హాయ్ నాన్న..
ముందుగా ఈవారం విడుదల కానున్న అన్ని సినిమాల్లో ఎక్కువ హైప్ క్రియేట్ చేసుకున్న సినిమా ‘హాయ్ నాన్న’. కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్‌లో నాని, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో సరిపడా హైప్‌ను క్రియేట్ చేసుకుంది. డిసెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సింగిల్ తండ్రి ప్రేమకథగా తెరకెక్కిన ‘హాయ్ నాన్న’.. ఫీల్ గుడ్ మూవీ అని టీజర్, ట్రైలర్ చూసిన ఆడియన్స్ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు.
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్..
ఎన్నో సినిమాలకు సక్సెస్‌ఫుల్ రైటర్‌గా పనిచేసిన వక్కంతం వంశీ.. ఇప్పటికే డైరెక్టర్‌గా ‘నా పేరు సూర్య’ను తెరకెక్కించాడు. అది ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ డైరెక్షన్ వైపునకు వెళ్లలేదు. కానీ ఇంతకాలం తర్వాత నితిన్ హీరోగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ అనే కామెడీ కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇందులో నితిన్‌కు జోడీగా బిజీ హీరోయిన్ శ్రీలీల నటించింది. సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.
జొరం..
రెండు తెలుగు సినిమాలతో పాటు ఈవారం ఒక హిందీ సినిమా కూడా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ లీడ్ రోల్ చేస్తున్న ‘జొరం’.. థ్రిల్లర్‌గా తెరకెక్కింది. దేవాషిష్ మఖీజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్, మఖీజా ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 8న ‘జొరం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
కంజ్యూరింగ్ కన్నప్పన్..
ఇన్ని ఫీల్ గుడ్, కమర్షియల్ సినిమాల మధ్య ఒక తమిళ హారర్ కామెడీ చిత్రం కూడా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. సెల్విన్ రాజ్ క్సేవియర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హారర్ కామెడీతో ప్రయోగానికి సిద్ధమయ్యింది. సతీష్, రెజీనాతో పాటు తదితరులు ఇందులో లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో కామెడీ పాత్రలతో ఆకట్టుకున్న సతీష్.. ఈ మూవీతో హీరోగా మారుతున్నాడు.
ఓటీటీ..
ఒక ఓటీటీ రిలీజ్ విషయానికొస్తే.. ఇప్పటికే డిసెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో ‘అహింస’ అనే తెలుగు చిత్రంతో పాటు ‘ది కిలర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’ అనే ఇంగ్లీష్ సినిమా కూడా విడుదల అయ్యింది. నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 7న ‘ది ఆర్కైస్’ అనే హిందీ చిత్రంతో పాటు డిసెంబర్ 8న ‘జిగర్‌తండా డబుల్ ఎక్స్’ అనే తమిళ చిత్రం కూడా విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు వర్షన్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మాత్రమే ఈవారం ‘వధువు’ అనే వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వనుంది. ఆహాలో ‘మా ఊరి పొలిమేర 2’, జీ5లో ‘ఖడక్ సింగ్’ చిత్రాలు స్ట్రీమింగ్‌కు సిద్దమయ్యాయి.
Also Read: 'హాయ్ నాన్న' ప్రీ రిలీజ్ బిజినెస్ - నాని రేంజ్ తగ్గిందా? 'దసరా' కంటే ఇంత తక్కువా?