‘యానిమల్’ మూవీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 1న విడుదలైంది. ‘యానిమల్’ను ఇప్పటికీ థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు వెళ్తున్నారు. ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. అయితే, నాన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో.. తల్లి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదనే చెప్పవచ్చు. కానీ, ప్రేక్షకులు మాత్రం ఆ పాత్రలో నటించిన నటి గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
రణబీర్‌కంటే ఒక సంవత్సరం పెద్ద..
‘యానిమల్’ చిత్రంలో హీరోగా రణబీర్ కపూర్‌కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. కథలో తన తండ్రి పాత్ర చేసిన అనిల్ కపూర్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఈ మూవీలో రణబీర్ తల్లిగా, అనిల్ కపూర్ భార్యగా కనిపించిన నటి పేరు చారూ శంకర్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చారు.. ‘యానిమల్’ గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ‘‘నిజం చెప్పాలంటే నాకు, రణబీర్‌కు వయసులో ఒక సంవత్సరం మాత్రమే తేడా ఉంది. అందుకే ఒక నటిగా ఆలోచించి ఇలాంటి పాత్రను ఎందుకు వదులుకోవాలి అని అనుకున్నాను’’ అని తెలిపింది. రణబీర్‌కంటే తాను ఒక ఏడాది మాత్రమే పెద్ద అని షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.
కథలో కీలకమైన పాత్ర
‘‘నాకు యానిమల్ క్యాస్ట్ అంతా ముందే తెలుసు. సినిమా గురించి తెలుసు. సందీప్ కథ చెప్పినప్పుడే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది, డిఫరెంట్‌గా ఉంది అనుకున్నాను. కథ చెప్పినప్పటి నుంచే.. నువ్వు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నాను. నీ చుట్టూనే కథ తిరుగుతుంటుంది కాబట్టి నీ పాత్ర త్వరగా ప్రేక్షకులపై ప్రభావం చూపించేలా ఉండాలి అనుకుంటున్నాను అన్నాడు’’ అని సందీప్ రెడ్డి వంగా గురించి చెప్పుకొచ్చింది చారూ శంకర్. ‘యానిమల్’ సినిమాలతో తాను కూడా పెద్ద వయసు తేడా లేని హీరోల తల్లులుగా నటిస్తున్న నటీమణుల జాబితాలో యాడ్ అయిపోయింది. ఒక్కొక్కసారి స్టార్ హీరోలకు తల్లి పాత్ర చేస్తున్న నటీమణులు.. వారికంటే చిన్న వయసు ఉన్నవారు కూడా అయ్యింటారు. బాలీవుడ్‌లో అలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి.
మీరు యంగ్‌గా ఉన్నారంటూనే.. ఆ పాత్ర ఇచ్చారు
దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో జరిగిన మొదటి మీటింగ్ గురించి మరిన్ని విశేషాలు షేర్ చేసుకుంది చారూ శంకర్. ‘‘నాకు ఇంకా గుర్తుంది. నేను అప్పుడు జీన్స్, కుర్తా వేసుకున్నాను. మేము అనుకున్న సమయానికంటే ముందే వెళ్లి చిల్ అవుతూ ఉన్నాము. సందీప్ వచ్చి మమ్మల్ని గమనించకుండా తన ఆఫీస్ లోపలికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తన అసిస్టెంట్‌ను పిలిచి ఎవరు వాళ్లు అని మా గురించి అడిగాడు. తనే చారూ శంకర్. మీరు కలవాలని చెప్పారు కదా అని అసిస్టెంట్ అన్నాడు. అప్పుడే నన్ను లోపలికి పిలిపించాడు సందీప్. నేను లోపలికి వెళ్లగానే వచ్చినందుకు థ్యాంక్స్. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ మీరు మరీ యంగ్‌గా ఉన్నారు అని అన్నాడు. ఆ తర్వాతే నాకు స్టోరీ చెప్పాడు’’ అంటూ తమ ఫస్ట్ మీటింగ్‌ను గుర్తుచేసుకుంది చారూ శంకర్. రణబీర్ ప్రస్తుత వయస్సు 41 ఏళ్లు. చారూ శంకర్ ఏజ్ 42 ఏళ్లు.
Also Read: ఓ మై గాడ్, షారుఖ్ ఒక్క రోజు సంపాదన అన్ని కోట్లా? కింగ్ ఖాన్ ఆస్తులు చూస్తే కళ్లు తిరుగుతాయ్!