Shah Rukh Khan remuneration: హిందీ చిత్ర పరిశ్రమలో సుమారు మూడు దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్నారు స్టార్ హీరో షారుఖ్ ఖాన్. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. చక్కటి కామెడీ, అంతకు మించిన యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఏడాది ఆయన నటించిన ‘పఠాన్’, ‘జవాన్’, ‘డంకీ’ చిత్రాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. వరుస పరాజయాలతో ఈ ఏడాదిలోకి అడుగు పెట్టిన ఆయనకు ‘పఠాన్’ ఓ రేంజిలో సక్సెస్ సాధించి, ఆయనను మళ్లీ హిట్ ట్రాక్ లోకి ఎక్కించింది. ‘జవాన్’ మూవీ సైతం బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోతలు మోగించింది. తాజాగా విడుదలైన ‘డంకీ’ మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.


2010లో షారుఖ్ ఖాన్ నికర ఆస్తుల విలువ రూ.1500 కోట్లు


సినిమాల విషయం కాసేపు పక్కన పెడితే సంపాదనలో షారుఖ్ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన నికర ఆస్తుల విలువ ఏకంగా రూ. 6300 కోట్లకు చేరుకుంది. బాలీవుడ్ ఇతర స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తో పోల్చితే షారుఖ్ ఆస్తులు చాలా ఎక్కువ. బిజినెస్ టైమ్స్ నివేదిక ప్రకారం, షారుఖ్ ఖాన్ 2010లో దాదాపు రూ.1500 కోట్ల నికర ఆస్తులను సంపాదించారు. ఆ ఏడాది ప్రతి 10 నిమిషాల డ్యాన్స్ ఫర్ఫార్మెన్ కు రూ.5 కోట్లు సంపాదించేవాడట.  


13 ఏళ్లలో భారీగా పెరిగిన ఆస్తులు   


13 సంవత్సరాలలో అంటే 2010 నుంచి 2023 వరకు, షారుఖ్ ఖాన్ నికర ఆస్తుల విలువ రూ. 4800 కోట్లకు పైగా పెరిగింది. 2010లో ఆయన సంపాదించిన దానికంటే 4.2 రెట్లు ఎక్కువ సంపాదన అందుకున్నారు. 10 సంవత్సరాలలో ఆయన ఆస్తులు 320% పెరుగుదలను సాధించాయి.   


34 బ్రాండ్లు, ఒక్కోదాని విలువ రూ. 7 కోట్లు


2010లో షారుఖ్ ఖాన్ రూ. 238 కోట్ల విలువైన బ్రాండ్ ఎండార్స్‌ మెంట్లను అందుకున్నారు. ఇందులో దాదాపు 34 బ్రాండ్లు ఉన్నాయి. ఒక్కోదాని విలువ రూ. 7 కోట్లు. అంతేకాదు, ఒక్కో చిత్రానికి ఆయన దాదాపు రూ. 10 నుంచి రూ. 12 కోట్లు వసూలు చేశాడు. షోలు, ఈవెంట్ల ద్వారా సంవత్సరానికి దాదాపు రూ. 7 కోట్లు సంపాదించాడు. అంతేకాదు, 2010లోనే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రూ.650 కోట్లు పెట్టుబడి పెట్టాడు. 


2023లో సినిమాల ద్వారా రూ. 400 కోట్ల సంపాదన


2023లో షారుఖ్ ఖాన్ సుమారు రూ. 400 కోట్లకు పైగా సంపాదించాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ ‘పఠాన్’ మూవీకి గాను ఆయన దాదాపు రూ. 200 కోట్లు అందుకున్నారు. అట్లీ  ‘జవాన్’ మూవీకి సైతం ఆయన దాదాపు అదే మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారు. ‘డంకీ’ చిన్న బడ్జెట్ మూవీ కావడంతో ఆదాయాన్ని బట్టి ఆయన వాటా ఉంటుంది. అంతేకాదు, ఈ ఏడాది ఎండార్స్ మెంట్స్, షోల ద్వారా కూడా ఆయన బాగానే డబ్బు సంపాదించినట్లు తెలుస్తోంది. 


2023లో షారుఖ్ ఖాన్ సంపాదన రోజుకు 10 కోట్లు


ఇక ఈ ఏడాది ఆయన రోజుకు రూ.10 కోట్లు సంపాదిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో బ్రాండ్ ఎండార్స్‌ మెంట్లు, డీల్‌లు, ఈవెంట్లు, షోలు, ప్రదర్శనలతో పాటు సినిమాలు, వ్యాపారాలు కూడా ఉన్నాయి!


Read Also: ‘సలార్‘ కాదు, కనీసం ‘ఆదిపురుష్‘ను టచ్ చేయలేకపోయిన ‘డంకీ‘, మరీ ఇంత ఘోరమా?