Four Died in Road Accident in Ananthapuram: రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో రహదారులు రక్తమోడాయి. ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో రోడ్డు ప్రమాద ఘటనల్లో 9 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. అనంతపురం (Ananthapuram) జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గార్లదిన్నె (Garladinne) మండలం కల్లూరు (Kalluru) వద్ద జాతీయ రహదారి నెం 44పై బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు గుత్తి మండలం మామిడూరుకు చెందిన చిన్నతిప్పయ్య (45), శ్రీరాములు (45), నాగార్జున (30), శ్రీనివాసులు (30)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ సహా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండగా, అతన్ని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బంధువుల ఆందోళన
మరోవైపు, మృతుల బంధువులు రహదారిపైనే ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించి పరిహారం ప్రకటించే వరకూ మృతదేహాలను తరలించేందుకు వీల్లేదని రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో హైదరాబాద్ - బెంగుళూరు హైవేపై రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గుంతకల్లు వైసీపీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి వచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు సద్దిచెప్పడంతో ఆందోళన విరమించుకున్నారు.
ప్రకాశం జిల్లాలోనూ
ప్రకాశం (Prakasam) జిల్లా పెద్దారవీడు (Peddaraveedu) మండలం దేవరాజుగట్టు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. వంతెన పైనుంచి ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మాబూ, అభినయ్ (10), రాయ వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావుగా గుర్తించారు. గాయపడిన వారిలో ఇద్దరిని మార్కాపురం, ముగ్గురిని స్థానికులు, పోలీసులు కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అయితే, మెరుగైన వైద్యం కోసం మార్కాపురం నుంచి ఇద్దరు ఒంగోలు ఆస్పత్రికి తరలిస్తుండగా డానియల్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఓ గృహ ప్రవేశ కార్యక్రమానికి గుంటూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Telangana News: ఉచిత బస్సు ప్రయాణం - మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి