RTC MD VC Sajjanar Request to Women Passengers: తెలంగాణలో (Telangana) 'మహాలక్ష్మి' (Mahalaxmi) పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు, మెట్రో బస్సుల్లో మహిళలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే, ఈ సౌకర్యం మంచిదే అయినా, పలు విమర్శలు సైతం వస్తున్నాయి. తమకు కూడా ప్రత్యేక సీట్లు కేటాయించాలని పురుషులు డిమాండ్ చేస్తున్నారు. ఫ్రీ సర్వీస్ వల్ల రద్దీ పెరిగిందని, అదనపు బస్సులు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. డబ్బులిచ్చి నిలబడి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ పురుష ప్రయాణికులు ట్విట్టర్ వేదికగా వీడియోలు పోస్ట్ చేస్తుండగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) మరో ప్రకటన చేశారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని చెప్పారు. 


మహిళా ప్రయాణికులకు సజ్జనార్ విజ్ఞప్తి


'తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీని వల్ల దూర ప్రాంత ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుంది. తక్కువ దూరం ప్రయాణించే మహిళళు పల్లె వెలుగు బస్సుల్లో వెళ్లి సిబ్బందికి సహకరించాలి. కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపాలని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. దీని వల్ల ప్రయాణ సమయం పెరుగుతుంది. ఇక నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపుతాం. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి మహిళా ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా.' అంటూ ఎండీ సజ్జనార్ ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.






రద్దీకి అనుగుణంగా బస్సులు


మరోవైపు, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచేందుకు తెలంగాణ (Telangana) ఆర్టీసీ (Rtc) కసరత్తు చేస్తోంది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ప్రభుత్వం, త్వరలోనే కొత్త బస్సుల (New Buses)ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి 2వందల బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. 50 బస్సులను ఈ నెలాఖరులోపు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎండీ సజ్జనార్ (Md Sajjanar) వెల్లడించారు. మరో 6 నెలల్లో దాదాపు 2 వేల బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 512 పల్లె వెలుగు, 400 ఎక్స్‌ప్రెస్‌లు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు వస్తాయన్నారు. హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికే కొత్త బస్సులు తెస్తున్నట్లు ఆయన తెలిపారు. బస్ భవన్ ప్రాంగణంలో శుక్రవారం లహరి స్లీపర్, రాజధాని ఏసీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను సజ్జనార్‌ పరిశీలించారు. ఈ బస్సుల్లో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలపై ఆరా తీశారు. 


Also Read: Kakatiya University: కాకతీయ యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం, హాస్టల్ నుంచి 81 మంది విద్యార్థుల బహిష్కరణ