Warangal Kakatiya University Ragging Issue : యూనివర్శిటీలు, కాలేజీల్లో ర్యాంగింగ్ నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్నా కొందరు విద్యార్థులు మాత్రం మారడం లేదు. కొత్తగా చేరిన జూనియర్లను సీనియర్లు వేధించడం పరిపాటిగా మారిపోయింది. ర్యాంగింగ్ కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నప్పటికీ, సీనియర్లు పట్టించుకోవడం లేదు. జూనియర్లను ర్యాగింగ్ పేరుతో ఏడిపిస్తున్నారు. వరంగల్ (Warangal )లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో సీనియర్లు (Seniors) రెచ్చిపోయారు. నూతన పరిచయం పేరుతో జూనియర్లను వేధించారు. ర్యాగింగ్ చేసిన 81 సీనియర్లపై  హాస్టల్ వార్డెన్, కళాశాల ప్రిన్సిపల్ చర్యలు తీసుకున్నారు. 81 మందిని వారంరోజుల పాటు హాస్టల్ నుంచి బహిష్కరించారు. కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్రలో ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులందరి హాస్టల్ నుంచి సస్పెండ్ చేయడం తొలిసారి. ర్యాగింగ్ చేసిన విద్యార్థినులందరూ కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ విభాగాలకు చెందిన వారే. 


పరిచయ క్లాసుల పేరుతో  వేధింపులు


కొత్తగా చేరిన వారిని పరిచయ క్లాసుల పేరుతో  సీనియర్లు  వేధింపులకు గురి చేశారు. ఇది కాస్త పెచ్చుమీరడంతో కొందరు బాధితులకు హాస్టల్ వార్డెన్, కళాశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. పరిచయాల పేరుతో ర్యాగింగ్‌కు పాల్పడుతున్న పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల వివరాలు ఆరా తీశారు. క్యాంపస్‌లోని హాస్టల్ వార్డెన్, కళాశాల ప్రిన్సిపల్‌, ఇతర అధికారులు...ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థుల వారి వివరాలు సేకరించారు. క్యాంపస్ లోని అన్ని విభాగాల్లోని సీనియర్లు, జూనియర్లను వేధిస్తున్నట్లు తేలింది. దీంతో ర్యాగింగ్ చేసిన 81 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు యూనివర్శిటీ అధికారులు.


అంతా ఆ మూడు విభాగాల విద్యార్థినులే


వేటు పడ్డ విద్యార్థినులందరూ కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ విభాగాలకు చెందిన వారే క్యాంపస్ లోని హాస్టల్స్ కు ఇవాళ్టీ నుంచి క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. విద్యార్థులందరూ వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని హాస్టల్ వార్డెన్ సూచించారు. క్యాంపస్ లో ఎవరు ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.  ఏ యే విభాగాలు, హాస్టళ్లలో ర్యాగింగ్ చేస్తున్నారో వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. సరైన ఆధారాలు లభిస్తే వారినీ సస్పెండ్‌ చేస్తామని, ఎవర్ని వదిలిపెట్టేది లేదంటున్నారు. ఒకేసారి ఇంత పెద్దమొత్తంలో యువతులపై సస్పెన్షన్ వేటు పడటం యూనివర్శిటీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకూ ర్యాగింగ్ విషయాల్లో అబ్బాయిలు ఉండే వారు. కానీ, ఇప్పుడు ర్యాగింగ్‌కు పాల్పడిన వారిలో అమ్మాయిల పేర్లు రావడం చర్చనీయాంశంగా మారింది. 


గతేడాది ప్రీతి ఆత్మహత్య
కేయూలో విద్యార్థినులకు వసతి కల్పించడం కోసం ఐదు హాస్టల్స్ ఏర్పాటు చేశారు. పద్మాక్షి ఏ, బీ, సీ, డీ, ఈ అనే బ్లాక్ లు విద్యార్థినుల కోసం కేటాయించారు. వాటిల్లో రెగులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు సంబంధించిన దాదాపు 1,800 మంది విద్యార్థినులు హస్టల్ లో ఉంటున్నారు. గత ఏడాది  ఫిబ్రవరి నెలలో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ దుమారం రేపింది. సీనియర్ల వేధింపుల వల్ల డాక్టర్ ప్రీతి సూసైడ్ చేసుకుంది. ఆ తర్వాత వేధింపులకు పాల్పడిన నిందితుడు సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేసి చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.