TSRTC 200 New Buses : ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచేందుకు తెలంగాణ (Telangana) ఆర్టీసీ (Rtc) కసరత్తు చేస్తోంది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ప్రభుత్వం, త్వరలోనే కొత్త బస్సుల (New Buses)ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి 2వందల బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. 50 బస్సులను ఈ నెలాఖరులోపు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎండీ సజ్జనార్ (Md Sajjanar) వెల్లడించారు.


మరో ఆరు నెలల్లో దాదాపు 2వేల బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు సజ్జనార్‌.  512 పల్లె వెలుగు, 400 ఎక్స్‌ప్రెస్‌లు,  92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు వస్తాయన్నారు. హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.  ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికే కొత్త బస్సులు తెస్తున్నట్లు ఆయన తెలిపారు. బస్ భవన్ ప్రాంగణంలో లహరి స్లీపర్, రాజధాని ఏసీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను సజ్జనార్‌ పరిశీలించారు. ఈ బస్సుల్లో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలపై ఆరా తీశారు. 


తెలంగాణలో 'మహాలక్ష్మి' పథకం (Mahalaxmi Scheme) పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో (RTC Buses) ఉచిత ప్రయాణం (Free Service) అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో ఫ్రీ సర్వీస్ అమలవుతోంది. ఈ క్రమంలో అన్ని బస్సుల్లోనూ రద్దీ పెరిగింది. ఉద్యోగినులు, గృహిణులు, విద్యార్థినులు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ సౌకర్యం తమకు ఎంతో మేలు చేస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ పథకం వల్ల తమకు సీట్లు లేకుండా పోతున్నాయని పురుషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రయాణికుడు ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వెలిబుచ్చాడు. 'సీఎం రేవంత్ రెడ్డి గారూ డబ్బులు పెట్టి మేము నిలబడాలా.?' అని ప్రశ్నించాడు. బస్సుల్లో మొత్తం ఉచితంగా ప్రయాణించే మహిళలే ఉన్నారని, డబ్బులు చెల్లించి మరీ తాము నిల్చోవాల్సి వస్తోందని మండిపడ్డాడు. ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని కోరాడు.


ప్రయాణికుడి ఆవేదన ఇదీ


'సీఎం రేవంత్ రెడ్డి గారూ.. హైదరాబాద్ నుంచి వస్తున్నా. డబ్బులు పెట్టి టికెట్ తీసుకున్నాం. అలాగే నిలబడి ప్రయాణించాలంటే మా వల్ల కావడం లేదు. మహిళల కోసం ప్రత్యేక బస్సులైనా కేటాయించండి. లేకుంటే పురుషులకు బస్సుల్లో ప్రత్యేక సీట్లు కేటాయించేలా చూడండి.  లేకుంటే ప్రత్యేక బస్సులైనా ఏర్పాటు చేయండి. బస్సులో పూర్తి రద్దీ ఉంది. కనీసం 70, 80 కి.మీల వరకూ అంత దూరం నిలబడి ప్రయాణించడం ఇబ్బందిగా ఉంది. ఓసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారూ.!' అంటూ ఓ వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్ అవుతోంది.


ప్రత్యేక సీట్ల కోసం డిమాండ్


కాగా, ఆర్టీసీ బస్సుల్లో పురుషుల కోసం ప్రత్యేక సీట్లు కేటాయించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని రహదారిపై నిరసన తెలిపాడు. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల బస్సులన్నీ నిండిపోతున్నాయని, పురుషులకు కనీసం వసతి కూడా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రహదారిపై వెళ్తున్న బస్సు ముందు నిలబడి ఆందోళన చేశాడు. పురుషులకు బస్సుల్లో కనీసం 15 సీట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఆయన నిరసన అందరి దృష్టిని ఆకర్షించింది.