Andhra Pradesh Assembly Elections 2024 : కేంద్ర ఎన్నికల సంఘం (CEC)ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections)పై కసరత్తు మొదలు పెట్టింది. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం విజయవాడ (Vijayawada)లో పర్యటిస్తోంది. సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్‌కుమార్‌ వ్యాస్‌, డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఆర్‌కే గుప్తా, హిర్దేశ్‌కుమార్‌, అజయ్‌బాదో ఉన్నారు. ఏడుగురు సభ్యుల బృందం...విజయవాడ నోవాటెల్ హోటల్ లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఇవాళ కూడా సమీక్ష సమావేశం నిర్వహించింది.


పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, అవకతవకలు, లోపాలపై ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులపై  అధికారులతో ఆరా తీసింది. ఇవాళ కూడా  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సీఈవో, కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న ఓటర్ల జాబితాలు, ఓట్ల తొలగింపులు, గంపగుత్తగా ఓటర్ల నమోదు వ్యవహారాలపై ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫాం 7 దరఖాస్తులు, జీరో డోర్ నెంబర్లలో వందలాది ఓట్లు, ఓటర్ల జాబితాలో వాలంటీర్ల జోక్యం తదితర ఫిర్యాదులపై ఈసీ బృందాలు పరిశీలన చేసింది.


సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, తనిఖీ కేంద్రాలు  ఎందుకు ఏర్పాటు చేయలేదని కేంద్ర ఎన్నికల  బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో నిఘా ఏర్పాటు చేయాలని, పోలీసు, ఎక్సైజ్‌, అటవీ శాఖలు సంయుక్తంగా తనిఖీ కేంద్రాలు పెట్టాలని సూచించింది. తీరం వెంట గస్తీ పెంచాలన్న కేంద్ర ఎన్నికల  బృందం, మద్యం, డబ్బుతగ కట్టడి చేసేందుకు సరిహద్దుల్లో సమన్వయం చేసుకోవాలని ఆదేశించింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘర్షణలు, అల్లర్లు, విధ్వంసాలు, హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలపైనా ఆరా తీసింది. ఈ ఏడాది జనవరి 6 నుంచి ఇప్పటి వరకూ 90 లక్షల క్లెయిములు, అభ్యంతరాలు వచ్చాయి. వీటిలో 89 లక్షలు పరిష్కరించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడించారు. మిగతా లక్ష దరఖాస్తులను ఈ నెల 26లోగా పరిష్కరిస్తామని చెప్పారు. 


 బదిలీలు, పోస్టింగులపై మార్గదర్శకాలు జారీ
రెండు మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నతాధికారుల బదిలీలు, పోస్టింగులపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికలతో సంబంధమున్న అధికారులు సొంత జిల్లాలో ఉండకూడదని, దీర్ఘకాలంగా ఒకేచోట ఉన్నవారు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని ఆదేశాలు ఇచ్చింది. మూడేళ్లుగా ఒకే జిల్లాలో ఉన్న వారిని కొనసాగించవద్దని స్పష్టం చేసింది. 2024 జూన్ ఆఖరుకు మూడేళ్లు పూర్తయ్యేవారిని కొనసాగించొద్దని హెచ్చరించింది. బదిలీలు, పోస్టింగుల విషయంలో అలసత్వం వహించవద్దని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం  రాష్ట్రాల సీఈవోలు, సీఎస్‌లకు ఈ ఆదేశాలు జారీ చేసింది. 


జనవరి 31కి బదిలీలు పూర్తి చేయాల్సిందే
బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియను 2024 జనవరి నెలాఖరుకి పూర్తిచేసి, నివేదికను సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అదనపు డీజీపీ నుంచి ఎస్సై వరకూ పోలీసుశాఖలో బదిలీలు చేపట్టనున్నారు. అదనపు డీజీపీలు, ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఆర్‌ఐలకు ఈ బదిలీలు వర్తించనున్నాయి. ఎక్సైజ్‌ శాఖలో ఎస్సై, అంతకంటే పై స్థాయి అధికారులకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా ఉప ఎన్నికల అధికారులు, ఆర్‌వోలు, జాయింట్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, సబ్‌కలెక్టర్లు, తహసీల్దార్లు అధికారులకు ఈ బదిలీల నిబంధన వర్తించనుంది. 


వచ్చే ఏడాది ఫిబ్రవరి 20నాటికి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ఇరవై రోజుల ముందుగానే ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ కంటే... 20 రోజుల ముందే వచ్చే అవకాశం ఉందని అధికార, విపక్ష నేతలు చెబుతున్నారు. 2019 ఎన్నికల షెడ్యూల్‌ మార్చి 10వ తేదీన విడుదలైంది. ఈసారి ఫిబ్రవరి 20న విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.