Dunki Fails To Touch Adipurush: ఈసారి క్రిస్మస్ పండుగ వేళ రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. నార్త్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘డంకీ’ ఈ నెల 21న విడుదల కాగా, సౌత్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన ‘సలార్‘ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ బాక్సాఫీస్ లో దగ్గర ‘డంకీ’తో పోల్చితే ‘సలార్‘ పెద్దగా రాణించలేదని చాలా మంది ట్రేడ్ వర్గాలు భావించాయి. ‘పఠాన్‘, ‘జవాన్‘ బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత వస్తున్న ‘డంకీ’ కూడా రికార్డుల మోత మోగించడం ఖాయం అని అభిప్రాయపడ్డాయి. కానీ, తొలి రోజు అంచనాలు పూర్తిగా తలకిందులు అయ్యాయి.


‘ఆదిపురుష్‘ను అందుకోలేకపోయిన ‘డంకీ’


షారుఖ్ మూవీ ‘సలార్‘తో పోటీ విషయాన్ని పక్కన పెడితే, కనీసం ప్రభాస్ డిజాస్టర్ మూవీ ‘ఆదిపురుష్‘ను సైతం టచ్ చేయలేకపోయింది. ట్రైలర్ తోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ప్రభాస్ ‘ఆదిపురుష్‘ మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 130 కోట్లు వసూళ్లు చేసింది. హిందీ నుంచే దాదాపు రూ. 45 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఇప్పుడు ‘డంకీ’ హిందీ రీజియన్ లో కేవలం రూ. 38 కోట్లు వసూలు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.58 కోట్లు మాత్రమే వచ్చాయి.


భారీ అంచనాలతో ‘డంకీ’ విడుదలైనా..


షారుఖ్ గత రెండు చిత్రాలు అద్భుత విజయాలు అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ‘డంకీ’పై సాధారణంగానే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాదు, ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు భాగస్వామ్యం అయ్యారు. తాప్సీ పన్ను, బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిలింస్ సమర్పణలో రాజ్‌కుమార్ హిరానీ, గౌరీ ఖాన్ ఈచిత్రాన్ని నిర్మించారు. అయినప్పటికీ ‘సలార్‘ దెబ్బతో వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి.


‘సలార్‘కు తొలి రోజు వసూళ్ల వర్షం          


మరోవైపు, ‘సలార్‘ తొలి రోజు గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదలయ్యే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు కొనసాగించింది. ఓవర్సీస్‌ తో పాటు దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజు ₹48.94 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసింది. 16,593 షోలకు 22 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఓవర్సీస్‌ లో 2 మిలియన్ డాలర్లు అంటే, భారత కరెన్సీలో రూ.16 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది.  


Also Read: వేణు స్వామి ఎక్కడ? - ప్రభాస్ కెరీర్ కష్టం అన్నాడే, హిట్ రాదని చెప్పాడే!