Yogi Babu Birthday Special: కోలీవుడ్‌లో ఒకప్పుడు కమెడియన్ అంటే వడివేలు. ఆ తర్వాత ఆయన స్థానాన్ని ఎవరూ తీసుకోలేకపోయారు. ఇంతకాలం తర్వాత వడివేలు టైప్‌లోనే మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఒక నటుడు. తను మరెవరో కాదు.. యోగి బాబు. ఆయన టాలెంట్ కేవలం కోలీవుడ్ వరకే పరిమితం కాలేదు. బాలీవుడ్‌లో కూడా పలువురు స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్‌గా నటించి నార్త్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. జులై 22న యోగి బాబు పుట్టినరోజు సందర్భంగా తన ఫ్యాన్స్ అంతా తనకు విషెస్ చెప్తున్నారు. అంతే కాకుండా తన గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.


ఆఫ్ స్క్రీన్ ఎంట్రీ..


షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’తో మొదటిసారి నార్త్ ప్రేక్షకులను పలకరించాడు యోగి బాబు. దళపతి విజయ్, ధనుష్ లాంటి స్టార్లతో కూడా కలిసి పనిచేశాడు. అసలు ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో యోగి బాబు ప్రయాణం బుల్లితెరపై నుండే ప్రారంభమయ్యింది. ‘లొల్లూ సభ’ అనే టీవీ సిరీస్‌కు తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అంతే కాకుండా రెండేళ్ల పాటు ఆ సిరీస్‌కు రైటర్‌గా కూడా పనిచేశాడు. అలా బుల్లితెరపై ‘లొల్లూ సభ’ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో వెండితెరపై నుండి తనకు అవకాశాలు రావడం మొదలయ్యింది. 2009లో సుబ్రహ్మణ్యం శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యోగి’ చిత్రంతో మొదటిసారి వెండితెరపై నటుడిగా వెలిగాడు.


షారుఖ్‌తో రెండు సినిమాలు..


‘యోగి’తో యోగి బాబుకు సినిమాల్లో మంచి బ్రేక్ వచ్చింది. ఇక ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో ఒక చిన్న పాత్ర చేసిన యోగి బాబు.. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’లోనూ స్థానం సంపాదించుకున్నాడు. ‘జవాన్’ను తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించాడు. అట్లీ దర్శకత్వం వహించిన దాదాపు ప్రతీ సినిమాలో యోగి బాబు ఉంటాడు. అలాగే ‘జవాన్’లో కూడా ఉన్నాడు. ఈ సినిమాలో తను చేసిన పాత్రకు స్టేజ్‌పైనే షారుఖ్ ఖాన్‌తో ప్రశంసలు అందుకున్నాడు. ఇక సినిమాల్లో పలు స్టార్ హీరోలతో యోగి బాబుకు మంచి సాన్నిహిత్యం ఉంది. అంతే కాకుండా ఎమ్ఎస్ ధోనీతో కూడా తనకు మంచి స్నేహం ఉందని ఇప్పటికే పలుమార్లు బయటపడింది.


ధోనీతో క్లోజ్..


ధోనీ ఎంటర్‌టైన్మెంట్ అనే పేరుతో ఎమ్ఎస్ ధోనీ ఒక ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించాడు. అందులో మొదటి సినిమాగా ‘ఎల్‌జీఎమ్’ అనే తమిళ చిత్రాన్ని కూడా నిర్మించాడు. అందులో యోగి బాబు కూడా నటించాడు. అయితే ‘ఎల్‌జీఎమ్’ ప్రమోషనల్ ఈవెంట్స్ సమయంలో యోగి బాబు లేకుండా తమిళ సినిమా ఉండదని వ్యాఖ్యలు చేశారు ధోనీ. అంతే కాకుండా తన ఐపీఎల్ టీమ్ అయిన సీఎస్‌కేలో యోగికి చోటు వచ్చేలా చేస్తానని సరదాగా మాట్లాడారు. అలా తను స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రతీ హీరోతో, తనతో వర్క్ చేసిన ప్రతీ వ్యక్తితో యోగి బాబుకు మంచి ర్యాపో ఉంటుంది. ప్రస్తుతం తను ‘ఛట్కీ సాంబార్’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ వరల్డ్‌లోకి అడుగుపెట్టనున్నాడు.


Also Read: ప్రభాస్ జోడీగా పాకిస్తానీ బ్యూటీ - హను రాఘవపూడి గట్టిగా ప్లాన్ చేసిన్నట్లున్నాడే?