'ప్రాణం ఖరీదు' సినిమాతో కోట శ్రీనివాస రావు తెలుగు తెరపై అడుగు పెట్టారు. అది ఆయన మొదటి సినిమా. మెగాస్టార్ చిరంజీవికి సైతం అదే మొదటి సినిమా. మరి, కోట శ్రీనివాస రావు చివరి సినిమా ఏదో తెలుసా? చిరంజీవి తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన 'హరిహర వీరమల్లు'. అవును... కోట చివరి సినిమా వీరమల్లు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది.
క్రిష్ దర్శకత్వంలో వీరమల్లు చేసిన కోట
How Many Days Kota Srinivasa Rao Shoot For Veeramallu: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' ప్రారంభమైన సంగతి ప్రేక్షకులు అందరికీ తెలుసు. కోట శ్రీనివాస రావును సినిమాలోకి తీసుకున్నది ఆయనే.
క్రిష్ దర్శకత్వం వహించిన 'కృష్ణం వందే జగద్గురుమ్' గుర్తు ఉందా? అందులో కోట శ్రీనివాస రావు పాత్ర హైలైట్ అయ్యింది. 'అది కల... నిద్దరలో కనేది. ఇది కళ... నిద్దర లేపేది' అని ఆయన చెప్పిన డైలాగులు మరువగలమా? అటువంటి గొప్ప నటుడిని ఒక చిన్న పాత్రకు తీసుకున్నారు క్రిష్. వీరమల్లు కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో కోట శ్రీనివాస రావు ఒక్క రోజు మాత్రమే షూటింగ్ చేశారు.
Also Read: కొడుకుతో కలిసి ఒకే ఒక్క సినిమా చేసిన కోట శ్రీనివాస రావు... అది ఏమిటో తెలుసా?
క్రిష్ జాగర్లమూడి నుంచి 'హరిహర వీరమల్లు' దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన జ్యోతి కృష్ణ సినిమాను పూర్తి చేశారు. క్రిష్ కథలో కోర్ పాయింట్ తీసుకుని, ఆయన సెట్ చేసిన బేస్ మీద సినిమా తీశారు. జ్యోతి కృష్ణ వచ్చిన తర్వాత సినిమా స్వరూపం మారింది. హీరో పవన్ కళ్యాణ్ ప్రశంసలు సైతం అందుకున్నారు. అయితే, ఈ సినిమా కోసం కోట షూటింగ్ చేసింది ఒక్కటే రోజు. మరి, ఆయన సన్నివేశం సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమా (ఫైనల్ కట్)లో ఉందా? లేదా? అనేది ఈ నెల 24న తెలుస్తుంది. జూలై 24న 'హరిహర వీరమల్లు' థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ సినిమాల్లో కోట స్పెషల్!
Pawan Kalyan - Kota Srinivasa Rao Movies Telugu: పవన్ కళ్యాణ్, కోట శ్రీనివాస రావు మధ్య మంచి అనుబంధం ఉంది. పవన్ హీరోగా పరిచయమైన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'లో కోట నటించారు. 'గోకులంలో సీత'లో హీరో తండ్రి పాత్ర చేశారు. 'బద్రి', 'కెమెరామెన్ గంగతో రాంబాబు', 'అత్తారింటికి దారేది' సినిమాలు చేశారు.
'గబ్బర్ సింగ్'లో హీరోయిన్ శృతి హాసన్ తండ్రి పాత్రలో తాగుబోతుగా నటించారు కోట శ్రీనివాస రావు. అంతే కాదు... ఆ సినిమాలో 'మందు బాబులం మేము మందు బాబులం' పాట కూడా పాడారు. చిరుతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కోట శ్రీనివాస రావు చివరి సినిమా చిరు తమ్ముడు పవన్ 'వీరమల్లు' కావడం యాదృశ్చికమే అని చెప్పాలి.
Also Read: తంబీ నమస్తేనే... గదైతే నేను ఖండిస్తన్నా - కోటా శ్రీనివాసరావు ఈ డైలాగ్స్ మర్చిపోగలమా!