Celebrities Condolences To Kota Srinivasa Rao Death: కోట శ్రీనివాసరావు మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటని... వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారని అన్నారు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
నటుడిగా ప్రత్యేక స్థానం
పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణం సినీ రంగానికి తీరని లోటని... దశాబ్దాలుగా ఆయన తన నటనతో తెలుగు ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేశారని నటుడు బాలకృష్ణ అన్నారు. కోట మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు కోట. ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.' అని అన్నారు.
రోల్ ఏదైనా ఆయనే చేయగలరు
లెజండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు ఇక లేరనే వార్త తనను ఎంతో కలిసివేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కోట మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేశారు. ''ప్రాణం ఖరీదు' సినిమాతో ఆయన నేనూ ఒకేసారి సినిమా కెరీర్ ప్రారంభించాం. ఆ తర్వాత ఎన్నో వందల సినిమాల్లో నటించి తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. రోల్ ఏదైనా ఆయన మాత్రమే చేయగలరన్న గొప్పగా నటించారు. ఇటీవల ఆయన కుటుంబంలో జరిగిన విషాదం ఆయన్ని మరింత కుంగదీసింది. ఆయన లేని లోటు చిత్ర పరిశ్రమ, సినీ ప్రేమికులకు ఎన్నటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.' అని అన్నారు.
కోట డైలాగ్స్ కట్టి పడేస్తాయి
తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటనకు కోట కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారని... ఆయన మరణవార్త విని తీవ్ర ఆవేదనకు లోనైనట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. 'నా ఫస్ట్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాలో కోట కమెడియన్‌గా అలరించారు. తెలుగు తెరపై ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. ఆయన డైలాగ్ చెప్పే విధానం ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.' అని అన్నారు.
కోట ప్రతిభ, ఉనికి మరపురానివని సీనియర్ నటుడు మోహన్ బాబు అన్నారు. 'ఆయన మరణంతో మాటలు రావడం లేదు. కోట కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు. కోట శ్రీనివాసరావు మరణం తనను చాలా బాధించిందని నటుడు విష్ణు మంచు తెలిపారు. రోల్ ఏదైనా ఆయన తన నటనతో ప్రాణం పోశారని... ఆయనతో కలిసి పని చేసే అదృష్టం తనకు దక్కిందని అన్నారు. ఆయన కళ ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ కోట కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కోట శ్రీనివాసరావు ఇక లేరని విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని సీనియర్ నటుడు బ్రహ్మానందం అన్నారు. 'నటన ఉన్నంత కాలం ఆయన ఉంటారు. దాదాపు 4 దశాబ్దాల పాటు మేం కలిసి పని చేశాం. ఓ విషయాన్నైనా నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి.' అని అన్నారు.
కోట శ్రీనివాసరావు మరణంతో సినీ పరిశ్రమ 'కోట' కూలిపోయిందని సీనియర్ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. 'సామాన్య మధ్య తరగతిలో పుట్టి సినీ శిఖరంగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎంతో స్ఫూర్తి దాయకం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.' అని తెలిపారు. కోట శ్రీనివాసరావును చూస్తూ... ఆయన్ను ఆరాధిస్తూ పెరిగానని నటుడు రవితేజ అన్నారు. ఆయన తన కుటుంబంలో వ్యక్తి లాంటి వారని... ఆయన మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ ఓ మహా నటుడిని కోల్పోయిందని నటుడు కల్యాణ్ రామ్ అన్నారు.