Kota Srinivasa Rao Typical Actor On Silver Screen: కమెడియన్... విలన్... ఫాదర్... గ్రాండ్ ఫాదర్... పొలిటికల్ లీడర్... ఇలా రోల్ ఏదైనా ఆ పాత్రలో ఒదిగిపోయి జీవం పోశారు కోట శ్రీనివాసరావు. దశాబ్దాలుగా తన నటనతో తెలుగు ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేశారు. ఆయన మరణం సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించి ప్రతీ మూవీలోనూ తనకంటూ ఓ స్పెషల్ సిగ్నేచర్ క్రియేట్ చేశారు.
బ్యాంక్ జాబ్ వదిలేసి...
హైదరాబాద్‌లో స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ తన ఫ్యామిలీని చూసుకునేవారు కోట శ్రీనివాసరావు. 1978లో 'ప్రాణం ఖరీదు' సినిమాలో ఓ చిన్న వేషంతో ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణం ఎన్నో వందల సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఆ తర్వాత 1983లో జంధ్యాల 'అమరజీవి' సినిమాలో నటించారు. సీరియస్ విలన్ నుంచి కామెడీ విలన్, అల్లరి పోలీస్, ఫాదర్ ఇలా ఎన్నో పాత్రల్లో అందరికీ ఫేవరెట్ నటుడయ్యారు. అప్పటి జనరేషన్ నుంచి ఇప్పటి జనరేషన్ వరకూ అందరినీ మెప్పించారు. ఎస్వీఆర్, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ శకం ముగిసిన తర్వాత ఆ లోటును భర్తీ చేశారు.
డబ్బు ఖర్చు... సబ్బు ఖర్చు... నీళ్ల ఖర్చు
కమెడియన్‌గానూ నటనతో తనదైన ముద్ర వేశారు కోట శ్రీనివాసరావు. 'అహనా పెళ్లంట' సినిమాలో పరమ పిసినారి పాత్ర 'లక్ష్మీపతి'గా ఆయన నటన ఎప్పటికీ మరిచిపోలేం. కోడిని వేలాడదీసి ఒట్టన్నం తినడం, ఖర్చు ఎక్కువ అవుతుందని న్యూస్ పేపర్లు చుట్టుకోవడం, ఇంటికి వచ్చిన అతిథులను తెలివిగా పంపించడం ఇలా పిసినారి రోల్‍లో కోటా యాక్టింగ్ అందరినీ కడుపుబ్బా నవ్వించింది. ఇదే పిసినారి పాత్రను ఆయన 'ఆమె', 'ఆ నలుగురు' సినిమాల్లోనూ పోషించారు.
Also Read: Kota Srinivasa Rao: బ్రేకింగ్ న్యూస్... ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఇకలేరు... తెల్లవారుజామున మృతి
'ప్రతిఘటన'తో స్టార్
1985లో రిలీజ్ అయిన 'ప్రతిఘటన' సినిమాతో కోట స్టార్‌గా మారారు. విజయశాంతి, చరణ్ రాజ్‌లతో పాటు కోటా శ్రీనివాసరావు కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. సినిమాలో 'నమస్తే తమ్మీ' అంటూ తెలంగాణ యాసతో మినిస్టర్ కాశయ్య పాత్రలో ఒదిగిపోయారు. విలన్‌కు అండగా నిలిచే అవినీతి మంత్రిగా ఆయన పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది.
సాంబశివుడురా నా పేరు...
'సాంబశివుడురా నా పేరు' అంటూ క్రూరమైన విలన్‌గా గణేష్ సినిమాలో కోట శ్రీనివాసరావు రోల్‌లో అందరికీ వణుకు పుట్టించారు. అవినీతి ఆరోగ్య మంత్రిగా ఆయన ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. గుండుతో కళ్లకు లెన్స్ పెట్టుకుని విలన్‌లా సిల్వర్ స్క్రీన్‌పై ఆ రోల్‌కు 100 శాతం న్యాయం చేశారు కోటా. సినిమాలో హీరో ఇంటికొచ్చి... వార్నింగ్ ఇవ్వడం దగ్గర నుంచి కిడ్నీ, మెడిసిన్ మాఫియాను నడిపించడం... క్లైమాక్స్ సీన్‌లో ఆయన నటన నభూతో నభవిష్యతి.
గదైతే నేను ఖండిస్తున్న... ఇప్పటికీ ట్రెండింగ్
వీటితో పాటే ఆర్జీవీ 'గాయం' సినిమాలో 'గదైతే నేను ఖండిస్తున్న' అంటూ గురునారాయణ్ పాత్రలో ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగే. ఈ రోల్ ఆయన కెరీర్‌లోనే మరిచిపోలేనిది. 'హలో బ్రదర్' సినిమాలో కామెడీ పోలీస్ 'తాడి మట్టయ్య'గా నవ్వులు పూయించారు. అలాగే 'మనీ మనీ' సినిమాలో బట్లర్ ఇంగ్లీష్‌తో ఆకట్టుకున్నారు.
కోట కెరీర్‌లోనే 'మామగారు' ఓ స్పెషల్ మూవీ. బాబూ మోహన్‌తో ఆయన పండించిన కామెడీ తెలుగు ఆడియన్స్ ఎప్పటికీ మరిచిపోరు. 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' సినిమాలో అల్లరి తాతగా, 'బొమ్మరిల్లు', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' మూవీలో ఓ మధ్య తరగతి తండ్రిగా ఎమోషన్‌తో కన్నీళ్లు పెట్టించారు. 'గబ్బర్ సింగ్'లో ఓ తాగుబోతు తండ్రిగానూ తన నటనతో మెప్పించారు. ఇతర భాషల్లోనూ పలు పాత్రల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.