Kota Srinivasa Rao Famous Dialogues: కోట శ్రీనివాసరావు అంటేనే నటనలో ఓ లెజెండ్. 750కి పైగా సినిమాల్లో ఆయన చేసిన రోల్స్ తెలుగు ఆడియన్స్ మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి. విలన్‌గా, కామెడీ విలన్‌గా, కమెడియన్‌గా, ఓ మధ్య తరగతి ఫాదర్‌గా ఆయన యాక్టింగ్, డైలాగ్స్ వెండితెరకే వన్నె తెచ్చింది. ఆయన సినిమాల్లో ఫేమస్ డైలాగ్స్ ఇప్పటికీ ట్రెండింగే. వాటిని ఓసారి చూస్తే...

నమస్తే తమ్మీ...

కోట శ్రీనివాసరావు కెరీర్‌లోనే 'ప్రతిఘటన' మూవీ ఓ మైలురాయి. తెలంగాణ యాసతో మినిస్టర్ కాశయ్యగా ఆయన అదరగొట్టారు. మూవీ కోసం పట్టుబట్టి మరీ తెలంగాణ యాస నేర్చుకుని ఆ డైలాగ్స్‌తో ఫేమస్ అయ్యారు. మూవీలో విలన్ కాళీ (చరణ్ రాజ్)కి సపో‌ర్ట్‌గా ఉండే ఓ అవినీతి మంత్రిగా... 'నమస్తే తమ్మీ'... 'కాళీ... గిది పొగుడుతాందా తిడతాందా..' ఆయన చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ ఓ స్పెషల్. 'ప్రతిఘటన' సూపర్ హిట్ కావడంతో కోట కెరీర్ మలుపు తిరిగింది.

గదైతే నేను ఖండిస్తున్న...

జగపతి బాబు హీరోగా ఆర్జీవీ తెరకెక్కించిన క్రైమ్ డ్రామా 'గాయం' సినిమాలో గురు నారాయణ్ పాత్రలో కోట శ్రీనివాసరావు యాక్టింగ్ ఎవర్ గ్రీన్. జర్నలిస్టుగా రేవతి అడిగిన ప్రశ్నకు సమాధానాలిస్తూ... 'గదైతే నేను ఖండిస్తున్న' అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగ్. ఈ డైలాగ్‌తో ఇప్పటికీ పలు మీమ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి.

భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు...

'భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు... భర్తగ మారకు బ్యాచిలరు' అనే సాంగ్‌తో పెళ్లి వద్దంటూ హిత బోధ చేసే కామెడీ రోల్‌లో 'మనీ' సినిమాలో ఆకట్టుకున్నారు కోట. ఆర్జీవీ తీసిన ఈ మూవీలో బట్లర్ ఇంగ్లీష్‌తో ఆడియన్స్‌ను మనసారా నవ్వించారు. దీనికి సీక్వెల్ 'మనీ మనీ'లోనూ వచ్చీరాని ఇంగ్లీష్‌తో కామెడీ పండించారు.

'గణేష్' మూవీతో అసలైన విలనిజం

వెంకటేష్ హీరోగా వచ్చిన 'గణేష్' మూవీలో అవినీతి మంత్రి 'సాంబశివుడు'గా ఆయన విలనిజం, డైలాగ్స్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 'సాంబశివుడురా నా పేరు...', 'తంబీ... ఇస్టేటుగా పాయింట్‌కు వస్తున్న. నీ ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టే. మరి నాకైతే ఛార్మినార్ కున్నంత హిస్టరున్నది.' అంటూ హీరోకు వార్నింగ్ ఇచ్చే సీన్ నుంచి క్లైమాక్స్‌లో కోట నటన అద్భుతం అనే చెప్పాలి.

Also Read: కమెడియన్... విలన్... ఫాదర్... అల్లరి గ్రాండ్ ఫాదర్ - రోల్ ఏదైనా కేరాఫ్ అడ్రస్ కోటా శ్రీనివాసరావు

కమెడియన్... పిసినారి తనం... ఎమోషన్

కోట కెరీర్‌లోనే ది బెస్ట్ మూవీ 'అహ నా పెళ్లంట'. ఇప్పటికీ ఈ మూవీ అందరికీ స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుంది. 'లక్ష్మీపతి'గా అత్యంత పిసినారి పాత్రలో ఆయన నటన చెప్పే డైలాగ్స్ ఎవర్ గ్రీన్. 'ఒరే అరగుండు...', 'డబ్బు ఖర్చు... సబ్బు ఖర్చు... నీళ్ల ఖర్చు...' అనే డైలాగ్స్ ఆడియన్స్‌కు గుర్తుండిపోతాయి. కోడిని వేలాడదీసి ఒట్టన్నం తినడం, న్యూస్ పేపర్లను బట్టలుగా చుట్టుకోవడం... పిసినారితనానికి విశ్వరూపం చూపించడం ఆయనకే సాధ్యం.

'ఆమె', 'ఆ నలుగురు' సినిమాల్లోనూ కోట పిసినారిగా కనిపించారు. ముఖ్యంగా 'ఆ నలుగురు' సినిమాలో వడ్డీ వ్యాపారిగా ఆయన చెప్పే ఎమోషనల్ డైలాగ్ గుర్తుండిపోతుంది. 'నువ్వు మోసం చేయడం చేతకాని అసమర్థుడివి. మంచితనాన్నే నమ్ముకున్న పిచ్చోడివి.' అంటూ రాజేంద్రప్రసాద్‌ను ఉద్దేశించి చెప్పే డైలాగ్స్ కన్నీళ్లు పెట్టిస్తాయి. క్లైమాక్స్‌లోనూ తన నటనతో ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేశారు కోట.

'మామగారు'లో పనీ పాట లేకుండా జల్సాలు చేసే 'పోతురాజు' పాత్రలో కామెడీ విలన్‌గా అదరగొట్టారు కోటా. ముత్యాల సుబ్బయ్య తీసిన ఈ సినిమాలో బాబూ మోహన్, కోట కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. దాదాపు 50కి పైగా సినిమాల్లో వీరిద్దరి కాంబో సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే, 'నగర పౌరుల శాంతి భద్రతలే నాకు ముఖ్యం...' అంటూ 'యమలీల' సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్ నవ్వులు పూయించింది.

'హలో బ్రదర్' సినిమాలో కామెడీ పోలీస్‌గా 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' సినిమాలో అల్లరి తాతగా, రాఖీ, బృందావనం, 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాలో రోల్స్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 'గబ్బర్ సింగ్'లో తాగుబోతు తండ్రిగా 'మందుబాబులం మేం మందుబాబులం...' అంటూ పాడే పాట మాస్ ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసింది.

ఇతర భాషల్లోనూ...

ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ, మలయాళం సినిమాల్లోనూ కోట తనదైన నటనతో మెప్పించారు. 'సామి'తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అక్కడ 30 సినిమాలు చేశారు. బాలీవుడ్ 'సర్కార్' సినిమాలో సెల్వర్ మణిగా తన నటనతో ఆకట్టుకున్నారు. కన్నడలో 'రక్త కన్నీరు', 'నమ్మ బసవ', 'లవ్' మూవీస్ చేశారు.