సుమారు ముఫై ఏళ్ల కిందటి మాట... కొడుకు విజయ్‌ను హీరోగా నిలబెట్టాలని తపన పడుతున్న డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ భుజాలపైన మరో బాధ్యత కూడా! తనను బాగా ఆకట్టుకున్న ఓ కుర్రాడిని నటుడిగా ఇండస్ట్రీ లో నిలబెట్టాలని! ఆ కుర్రాడి యాక్టింగ్ ఎందుకో బాగా నచ్చింది ఎస్ఏ చంద్రశేఖర్‌కి! కానీ, మంచి పాత్రలు రాసినా అవెందుకో పేలటం లేదు. తన కుమారుడిని హీరోగా నిలబెట్టే హడావిడిలో ఆ కుర్రాడికి సమయం కేటాయించలేక తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పెట్టుకున్నారు. సీన్ కట్ చేస్తే... 30 ఏళ్ళు గడిచాయి. ఎస్ఏ చంద్రశేఖర్ సంకల్పం గట్టిది అనుకుంట! ఇప్పుడు ఆయన కుమారుడు విజయ్ దళపతిగా ఎవరెస్ట్ స్థాయి క్రేజ్ అందుకుంటే... నటుడు కాలేకపోయిన ఆ వ్యక్తి డైరెక్టర్‌గా మారి ఇండియన్ సినిమా గర్వించే ఎత్తుకు ఎదిగాడు. ఆయనే శంకర్ షణ్ముగం. మనందరికీ డైరెక్టర్ శంకర్. ఆగస్టు 17 ఆయన పుట్టిన రోజు.
ఊహకు అందని శంకర్ విజన్
సినిమా ఓ ఆర్ట్. సినిమా ఓ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. అప్పటి సమాజానికి అద్దం పట్టేది సినిమా అయితే కొంత మంది ఫిల్మ్ మేకర్స్ తమ విజన్ తో సిల్వర్ స్క్రీన్ స్థాయిని పెంచారు. తమ సమకాలీకుల కంటే దశాబ్దాల ముందుండే పరిజ్ఞానంతో మనిషి ఊహా శక్తిని పెంచుతూ పోయారు. శంకర్ కూడా అంతే. ఆయన మైండ్ లో ఏం రన్ అవుతుందో ఊహించటం కష్టం. బట్ ఫైనల్ గా తన ఆలోచనలను స్క్రీన్ మీద విజువలైజ్ చేసే విధానం చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. 59 ఏళ్ల వయస్సున్న శంకర్ జీవితంలో సినిమా అనుభవం ముఫ్పై ఆరేళ్లు.
నటుడు కావాలనే కలలు
తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణంలో పుట్టిన శంకర్ బాల్యమంతా అక్కడే గడిచిపోయింది. మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేసినా ధ్యాసంతా సినిమాల మీదనే. ఓ చిన్న ట్రూప్ ఏర్పాటు చేసుకుని సామాజిక సమస్యలే ఇతివృత్తాలుగా తనే కథ రాసుకుని నాటకాలు ఆడటం మొదలు పెట్టాడు యంగ్ శంకర్. అలా 1985లో అప్పటికే డైరెక్టర్ గా మంచి ఫామ్ లో ఉన్న ఎస్ఏ చంద్రశేఖర్ (హీరో విజయ్ తండ్రి ) దృష్టిలో పడ్డాడు. శంకర్ తీసుకున్న కాన్సెప్టులు, అతని నటన చంద్రశేఖర్ కు బాగా నచ్చేశాయి. తనతో మద్రాస్ తీసుకెళ్లిపోయాడు. 1986లో ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన 'వసంత రాగం', 1990లో 'సీత' సినిమాల్లో శంకర్ కు నటుడిగా అవకాశాలు ఇచ్చారు. ఆ పాత్రలకు పేరు రాలేదు. ఇక లాభం లేదనుకుని శంకర్‌ను తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు.
సహాయ దర్శకుడిగా హిందీ సినిమాతో పరిచయం!
రాజేష్ ఖన్నా ప్రొడక్షన్ లో హిందీలో ఎస్ఏ చంద్రశేఖర్ తీసిన 'జై శివ శంకర్' (1990) చిత్రానికి శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని చోట్లా మూస కమర్షియల్ కథలే కనపడుతున్నాయి శంకర్ కు. కమర్షియల్ గా సినిమా తీస్తూనే సోషల్ మెసేజ్ ఇవ్వలేమా అనే ఆలోచనల చుట్టూనే శంకర్ మైండ్ తిరుగుతోంది. ఓ రెండు మూడు కథలు అనుకున్నాడు. 'నన్బర్ గల్' సినిమా తర్వాత ఎస్ఏ చంద్రశేఖర్ దగ్గర ఆశీస్సులు తీసుకుని బయటకు వచ్చేశారు శంకర్.
తొలి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్
డైరెక్టర్ గా సొంత ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలా మలయాళం, తమిళ్ లో సినిమాలో తీసే కుంజుమన్ కేటీకి శంకర్ దగ్గరున్న కథ నచ్చేసింది. 'హీరోగా ఎవరనుకుంటున్నావ్?' అంటే కమల్ హాసన్ పేరు చెప్పాడు. పాలిటిక్స్ ఉన్న సినిమా చేయనని కమల్ చెప్పేయటంతో... రాజశేఖర్ దగ్గరకు కథ వెళ్లింది. ఆయన కూడా రిజెక్ట్ చేయటంతో యాక్షన్ హీరో అర్జున్ దగ్గరకు చేరింది. ఆయన కథ వినకుండానే నో చెప్పారట. కారణం 'జెంటిల్మన్'కు ముందు అర్జున్ తన ఓన్ డైరెక్షన్ లో 'సేవగన్' అనే సూపర్ హిట్ సినిమా తీసుకున్నారు. అప్పటి వరకు తనను పట్టించుకోని డైరెక్టర్లు సినిమా హిట్ అయ్యాక వస్తున్నారని అనుకుని కథ విననని చెప్పారట అర్జున్. అయితే శంకర్ రిక్వెస్ట్ చేయటంతో కథ విని బాగుంది చేద్దామని చెప్పారట. ఇక అంతే తర్వాత అంతా చరిత్రే. ఫస్ట్ సినిమా 'రోజా'తోనే నేషనల్ అవార్డ్ కొట్టిన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా విడుదలైన సినిమా 'జెంటిల్మన్'. ఉన్నోడు లేనోడు అనే తేడా లేకుండా చదువు అందరికీ అందాలనే మెసేజ్ ను ఇచ్చిన ఆ సినిమా తమిళనాడు వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు, మలయాళంలోకి డబ్ అవటంతో పాటు హిందీలోనూ విడుదలైంది.
సినిమా సినిమాకు స్థాయి పెంచుకున్న శంకర్
మిగిలిన భారతీయ దర్శకులతో పోలిస్తే శంకర్ కాస్త భిన్నమైన టెక్నీషియన్. 'జెంటిల్మన్' లాంటి హిట్ తర్వాత పెద్ద హీరోలు క్యూ కట్టినా... ప్రభుదేవా లాంటి కొరియోగ్రాఫర్ ని హీరోగా మార్చి 'ప్రేమికుడు' సినిమా తీసి దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు శంకర్. ఆ తర్వాత కమల్ హాసన్ హీరోగా తీసిన 'భారతీయుడు' ఎన్ని రికార్డులు సృష్టించిందో కొత్తగా చెప్పాలా!? ప్రశాంత్, ఐశ్వర్యా రాయ్ జంటగా తీసిన 'జీన్స్' సినిమా దేశంలో ఐటీ విప్లవాన్ని వాడుకున్న తొలి సినిమా. 'ప్రేమికుడు' సినిమాలోనే కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన శంకర్, జీన్స్ సినిమా కోసం చెన్నై, ముంబైలో ఉన్న ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఉపాధి కల్పించాడు. ఐటీ సేవలకే పరిమితమైన కంప్యూటర్ ఆధారిత కంపెనీలకు విజువల్ ఎఫెక్ట్స్ రంగంలోనూ మన దేశంలో ఉపాధి అవకాశాలున్నాయని పరిచయం చేసిన డైరెక్టర్ శంకర్ అంటే అతిశయోక్తి కాదేమో. శంకర్ తీసిన 'ఒకే ఒక్కడు', 'బాయ్స్', 'అపరిచితుడు', 'శివాజీ', 'రోబో', 'స్నేహితుడు', 'ఐ', 'రోబో 2', ఇప్పుడు 'భారతీయుడు 2' ఇలా ఒక్కో సినిమా గురించి రాయాలంటే ఒక పుస్తకం అవుతుంది.
భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్
ఎందుకో తెలియదు మొదటి నుంచి శంకర్‌కు భారీ బడ్జెట్ సినిమాల డైరెక్టర్ పేరు వచ్చేసింది. 'జెంటిల్మన్' సినిమాకు అప్పటి వరకూ ఓ తమిళ్ సినిమాకు పెట్టని ఖర్చు పెట్టారు. ఆ తర్వాత 'ప్రేమికుడు' లో బడ్జెట్ అనిపించినా... సీజీ వర్క్స్ చేయించడం వల్ల బాగా ఖర్చైంది. ఆ తర్వాత 'భారతీయుడు' విదేశాల్లో షూట్ చేయించారు. ఇక 'జీన్స్' సంగతి సరే సరి. అప్పటి వరకూ ఇండియన్ సినిమా చూడని గ్రాఫిక్స్ ను పాటల కోసం ఖర్చు పెట్టించారు శంకర్. కళ్లు చెదిరిపోయే గ్రాఫిక్స్ గురించి చాలా సంవత్సరాలు మాట్లాడుకుంటూనే ఉన్నారు ఫ్యాన్స్. 'ఒకే ఒక్కడు' హిట్ తర్వాత దాన్ని హిందీలో 'నాయక్' పేరుతో రీమేక్ చేశారు శంకర్. అక్కడ అది అంతగా ఆడకపోవటంతో శంకర్ అంటే కొంచెం భయం ఏర్పడింది తమిళ్ ప్రొడ్యూసర్స్ లో. అందుకే తను కమల్ హాసన్ తో ప్లాన్ చేసుకున్న 'రోబో' కథను వాయిదా వేసుకున్నారు శంకర్. సిద్ధార్థ్, జెనీలియాతో తక్కువ నిర్మాణ వ్యయంలో 'బాయ్స్' సినిమా తీసి టాలెంట్ తన గ్రాఫిక్స్ లో లేదని... తన టేకింగ్ లో ఉందని మొత్తం ఇండస్ట్రీకి చాటి చెప్పారు శంకర్. విక్రమ్‌తో 'అపరిచితుడు' లాంటి భారీ హిట్ కొట్టిన తర్వాత రజనీకాంత్ తో 'శివాజీ' తీశారు. అందుకోసం 60 కోట్లు ఖర్చు పెట్టారు. పదిహేను సంవత్సరాల క్రితం 60 కోట్లు అంటే ఇప్పుడు మార్కెట్ ప్రకారం అది మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో సమానం. అందుకే అది అప్పటికి ఇండియాలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా పేరు తెచ్చుకుంది. అంతే కాదు ఆ సినిమాకు శంకర్ అందిన రెమ్యూనరేషన్ ఏకంగా పది కోట్ల రూపాయలు. ఆ స్థాయి అందుకున్నాడు శంకర్ తన సినిమాలతో.
రోబోతో దేశం ఉలిక్కిపడింది
2010 లో తన కలల ప్రాజెక్ట్ 'రోబో' ను విడుదల చేశారు శంకర్. సూపర్ స్టార్ రజనీకాంత్, ఐశ్వర్యా రాయ్ తో తీసిన ఈ సినిమా బడ్జెట్ 132 కోట్ల రూపాయలు. అప్పటికే 'శివాజీ'తో తను క్రియేట్ చేసిన రికార్డులను తిరగరాశాడు శంకర్. 'రోబో' సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు... ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'రోబో' ఏకంగా 290 కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టింది. శంకర్ గురించి తెలియని వాళ్లంతా ముక్కున వేలేసుకునేలా చేశారు. ఆ తర్వాత ఏ ప్రాజెక్ట్ చేస్తారా అంతా ఆశ్చర్యంగా చూస్తున్న టైంలో తన మీదున్న హైప్ ను తనే తగ్గించుకునేలా కెరీర్ లో ఫస్ట్ టైం ఓ రీమేక్ ఒప్పుకున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన 'త్రీ ఇడియట్స్' హక్కులు తీసుకుని తమిళంలో 'నన్బన్' ( తెలుగులో 'స్నేహితుడు') తీశారు శంకర్. ఈ ఒక్క సినిమానే శంకర్ కెరీర్ లో అనుకున్నంత స్థాయిలో ఆడని సినిమా. ఆ తర్వాత విక్రమ్ తో కలిసి 'ఐ' సినిమాను తీశారు శంకర్. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం కుమ్మేశాయి. దాదాపుగా 250 కోట్ల రూపాయలు వసూలు చేసింది 'ఐ - మనోహరుడు'. తిరిగి తనకు ఇష్టమైన రోబో ఫ్రాంచైజీలో '2.0' పేరుతో 'రోబో' సీక్వెల్ తీసి మరోసారి దేశవ్యాప్తంగా బజ్ క్రియేట్ చేశారు. '2.0' ఏకంగా 570 కోట్ల రూపాయల బడ్జెట్ లో శంకర్ తీస్తే... ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది.
చిన్న సినిమాల పాలిట దేవుడు
శంకర్ అంటే భారీ బడ్జెట్ సినిమాలు అనే పేరున్నా... చాలా చిన్న సినిమాలను ఆయన బతికించారు. ఇది నిజం తెలుగులో విడుదలైన 'ప్రేమిస్తే', 'కళాశాల', 'హింసించే 23వ రాజు పులకేశి', 'వైశాలి', 'గది నెంబర్ 305లో దేవుడు'... తెలుగులో విడుదల 'కాని వెయిల్' అనే సినిమాలతో పాటు మరికొన్ని వాటికి శంకర్ నిర్మాత. అవన్నీ మంచి హిట్ సినిమాలుగా నిలిచి అందులో నటించిన వాళ్లందరికీ మంచి అవకాశాలు వచ్చాయి. భరత్, ఆది, తమన్, సిద్ధార్ధ్, జెనీలియా లాంటి వాళ్లు ఇండస్ట్రీలో నిలబడటానికి ఆస్కారమిచ్చింది డైరెక్టర్ శంకరే.
కమర్షియల్ సినిమాల్లో సందేశం శంకర్ సిగ్నేచర్ మార్క్
'జెంటిల్మన్'లో చదువు అందరికీ అందాలని మెసేజ్ ఇచ్చిన శంకర్... 'ప్రేమికుడు' సినిమాలో ప్రేమకు ధనిక, పేద తేడాలుండవని చెప్పాడు. 'భారతీయుడు'లో అవినీతి, లంచం, దేశభక్తి లాంటి కాన్సెప్ట్, జీన్స్ లో మూఢనమ్మకాలు, ఒకే 'ఒక్కడు'లో రాజకీయాల్లో అవినీతి గురించి మాట్లాడాడు. 'బాయ్స్' సినిమాలో కౌమార దశలో యువతరం తీసుకునే నిర్ణయాలు అవి జీవితంపై చూపించే ప్రభావం గురించి చూపించిన శంకర్... 'అపరిచితుడు'లో లంచం, సమాజంపై బాధ్యత లేకపోవటం వంటి అంశాలను స్పృశించాడు. ఈ సమాజాన్ని అవినీతి జాడ్యం వదిలేయాలని... డిజిటల్ వైపు అడుగులు వేయాలని 'శివాజీ', అధునాతన సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా మనిషిలో తనలో ఉన్న ద్వేషం, స్వార్థం లాంటివి అతి ప్రమాదకరమైనవని 'రోబో' ఫ్రాంచైజీలో రెండు సినిమాలతో నిరూపించాడు. 'స్నేహితుడు'లో యువతరంపై రుద్దబడుతున్న చదువులు, 'ఐ మనోహరుడు' సినిమాలో అందం, ప్రేమ, ద్వేషం లాంటి అంశాలపై తన అభిప్రాయాలు బలంగా చెప్పాడు. సినిమాలు ఈ సమాజాన్ని మార్చపోయినా పర్లేదు కనీసం మనం బాధ్యతగా ప్రవర్తించాలన్న ఆలోచనను తన సినిమాలు రేకెత్తిస్తే చాలు అంటారు శంకర్.
Also Read : బాలీవుడ్‌లో శ్రీదేవిని స్టార్ చేసినవి దక్షిణాది సినిమాలే - హిందీలో అతిలోక సుందరి చేసిన సౌత్ రీమేక్స్ ఇవే!
ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా RC 15ను డైరెక్ట్ చేస్తున్న శంకర్... సమాంతరంగా కమల్ హాసన్ 'భారతీయుడు 2' తీసే పనిలో ఉన్నారు. త్వరలో బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ హీరోగా 'అపరిచితుడు' రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. శంకర్ అంటే ఓ ట్రేడ్ మార్క్. ఇప్పటిలా పాన్ ఇండియా అనే పదం లేదు కానీ తన మొదటి సినిమా నుంచి అన్నీ పాన్ ఇండియా సినిమాలే అని చెప్పుకోవాలి. ప్రతీ సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్న శంకర్ నేడు భారతీయ సినీ చరిత్రలో అతిగొప్ప దర్శకుల్లో ఒకరని కచ్చితంగా చెప్పుకోవచ్చు.
- Content By Harsha