శ్రీదేవి (Sridevi)... భాషలకు అతీతంగా అభిమానులు సొంతం చేసుకున్న నటి. ఏ లోకంలో ఉన్నప్పటికీ... భూలోకంలో ప్రజలు ఎప్పటికీ ఆమె అభినయాన్ని తలుచుకుంటూ ఉంటారు. తరాలు ఎన్ని మారినా... తారలు ఎంత మంది వచ్చినా... తరగని, చెరగని రూపం శ్రీదేవి సొంతం!


శ్రీదేవి జయంతి (Sridevi Birth Anniversary) నేడు. తెలుగులో అతిలోక సుందరి నటించిన చిత్రాల గురించి కొత్తగా చెప్పేది ఏముంది? బాలనటి నుంచి బహుభాషా కథానాయికగా ఎదిగిన శ్రీదేవి ప్రయాణం ప్రేక్షకులు అందరికీ తెలుసు. అయితే... మీకు ఈ విషయం తెలుసా? హిందీలో శ్రీదేవిని స్టార్ చేసింది సౌతిండియా సినిమాలే.
 
అవును... బాలీవుడ్‌లోనూ ఆమె విజయాల వెనుక ఉన్నది సౌతిండియా కథలే - ఇది నిజం. హిందీలో శ్రీదేవికి పేరు తీసుకొచ్చిన, విజయాలు అందించిన బాలీవుడ్ సినిమాలు కొన్ని సౌత్ సిన్మాలకు రీమేక్స్! శ్రీదేవి హిందీ సినిమా కెరీర్‌ను, సౌత్ ఇండియన్ సినిమాలను వేరు చేసి చూడలేం! అతిలోక సుందరి జయంతి సందర్భంగా ఆ రీమేక్స్ ఏవో చూడండి!


ఇక్కడ 'వసంత కోకిల'... హిందీలో 'సద్మా'
కమల్ హాసన్ - శ్రీదేవి సినిమాల్లో 'వసంత కోకిల' చిత్రానిది ప్రత్యేక స్థానం. వయసు పెరిగినా, మనసు పెరగని అమ్మాయిగా... క్లిష్టమైన పాత్రలో శ్రీదేవి నటన ప్రేక్షకుల మనసు దోచుకుంది. 'వసంత కోకిల'ను హిందీలోనూ కమల్, శ్రీదేవి జంటగా బాలు మహేంద్ర రీమేక్ చేశారు. ఆ సినిమా 'సద్మా'. ఉత్తరాదిలోనూ శ్రీదేవికి పేరు తీసుకు వచ్చింది. హిందీలో అతిలోక సుందరి కథానాయికగా పరిచయమైన 'సొల్వా సవాన్' కూడా తమిళ సినిమా '16 వయదినిలే'కు రీమేక్. తమిళంలో కమల్, రజనీకాంత్ నటిస్తే... హిందీలో అమోల్ పాలేకర్, కులభూషణ్ నటించారు.
   
తెలుగులో 'ఊరికి మొనగాడు' - హిందీలో 'హిమ్మ‌త్‌వాలా'
డ్యాన్సర్‌గా శ్రీదేవికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా 'హిమ్మ‌త్‌వాలా'. కమర్షియల్ కథానాయికగానూ ఆమెకు హిందీలో పునాది వేసిన చిత్రమిది. అయితే, స్ట్రయిట్ హిందీ సినిమా కాదిది. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన 'ఊరికి ఒక్కడు'కు హిందీ రీమేక్. హిందీలో జితేంద్ర హీరోగా నటించారు. జయప్రద పాత్రను హిందీలో శ్రీదేవి చేశారు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. శ్రీదేవికి హిందీలో హీరోయిన్‌గా రెండో చిత్రమిది.


హిందీలో 'తోఫా'... ఒరిజినల్ మన 'దేవత'
ఉత్తరాదిలో ఇప్పటికీ 'తోఫా తోఫా తోఫా... లాయా లాయా లాయా' సాంగ్ వినిపిస్తూ ఉంటుంది. అది 'తోఫా' సినిమాలోనిది. ఆ పాటలో జితేంద్ర, జయప్రద సందడి చేశారు. ఆ పాట వినిపిస్తే హిందీ ప్రేక్షకులకు 'తోఫా' సినిమా గుర్తొస్తుంది. అందులో జయప్రదతో పాటు శ్రీదేవి కూడా నటించారు. ముక్కోణపు ప్రేమకథగా రూపొందిన 'తోఫా' ఉత్తరాదిలో శ్రీదేవికి నటిగా పేరు తెచ్చింది. ఈ సినిమా తెలుగులో శోభన్ బాబు సరసన శ్రీదేవి, జయప్రద నటించిన 'దేవత'కు హిందీ రీమేక్. అదీ అసలు విషయం! తెలుగులో సినిమా తీసిన రాఘవేంద్రరావు హిందీ సినిమాకూ దర్శకత్వం వహించారు. 


'అడవి సింహాలు' చిత్రాన్ని హిందీలో 'జానీ దోస్త్'గా రీమేక్ చేశారు. తెలుగులో కృష్ణ, కృష్ణంరాజు హీరోలుగా నటిస్తే... హిందీలో ధర్మేంద్ర, జితేంద్ర నటించారు. రెండిటిలో శ్రీదేవి కథానాయికగా నటించారు. 'జస్టిస్ చౌదరి'ని హిందీలో అదే పేరుతో రీమేక్ చేయగా... తెలుగులో చేసిన పాత్రను హిందీలోనూ చేశారు శ్రీదేవి. ఈ రెండూ చిత్రాలకు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. 'సప్తపది' హిందీ రీమేక్ 'జాగ్ ఉఠా ఇన్సాన్'లో శ్రీదేవి నటించారు. హిందీలో 'సర్దార్ పాపారాయుడు' రీమేక్ కూడా చేశారు. ఇలా చెబుతూ వెళితే హిందీలో శ్రీదేవి చేసిన తెలుగు రీమేక్స్ ఇంకొన్ని ఉన్నాయి.  


అమితాబ్ సరసన ఛాన్స్ ఇచ్చిన కన్నడ రీమేక్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సరసన శ్రీదేవి నటించిన తొలి సినిమా 'ఇంక్విలాబ్'. ఇదొక కన్నడ రీమేక్. అమితాబ్ పోలీస్ రోల్ చేశారు. యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా ఆయన ఇరగదీస్తే... శ్రీదేవి కూడా అద్భుతంగా నటించారని పేరు వచ్చింది.


ఆఖరికి 'ఆఖరీ రాస్తా' కూడా రీమేకే!
శ్రీదేవి, జయప్రద కథానాయికలుగా నటించిన మరో హిందీ సినిమా 'ఆఖరీ రాస్తా'. బిగ్ బి అమితాబ్ బచ్చన్ డ్యూయల్ రోల్ చేశారు. కామెడీ, రొమాన్స్, పెర్ఫార్మన్స్... మూడు బ్యాలన్స్ చేస్తూ శ్రీదేవి బాగా చేశారని పేరొచ్చింది. శ్రీదేవి కమర్షియల్ పెర్ఫార్మన్స్ గురించి చెప్పాల్సి వస్తే... హిందీ విమర్శకులు ప్రస్తావించే సినిమాల్లో ఈ సినిమా తప్పకుండా ఉంటుంది. భాగ్యరాజా దర్శకత్వం వహించిన 'ఆఖరీ రాస్తా' ఆయన కథ అందించిన తమిళ సినిమా 'ఓరు ఖైదియన్ డైరీ'కి రీమేక్. తమిళంలో కమల్ హాసన్ చేస్తే... హిందీలో అమితాబ్ బచ్చన్ నటించారు. హిందీ సినిమాను తాతినేని రామారావు సమర్పణలో తెలుగు నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించారు.


Also Read : శ్రీదేవి పెట్టిన ఆ కండిషన్ వల్లే ‘కొండవీటి దొంగ’ ఛాన్స్ మిస్? ‘బాహుబలి’కి మళ్లీ అదే రిపీట్!


హిందీ చలన చిత్ర పరిశ్రమకు శ్రీదేవి బాలనటిగా పరిచయమైన సినిమా 'రాణి మేరా నామ్'. అదీ తెలుగు సినిమా 'రౌడీ రాణీ'కి రీమేకే! తెలుగులో తీసిన దర్శకుడు కెఎస్ఆర్ దాస్ హిందీలోనూ దర్శకత్వం వహించారు. దక్షిణాది చలన చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకులు, నిర్మాతలు హిందీలో సినిమాలు చేస్తే... కథానాయికగా ఫస్ట్ ఛాయస్ అతిలోక సుందరి శ్రీదేవి పేరు వినిపించేది. వినిపించడమే కాదు... హిందీలో శ్రీదేవి చేసిన సౌత్ రీమేక్స్ చూస్తే, వాటి వెనుక దక్షిణాది దర్శక, నిర్మాతల పేర్లు కనిపిస్తాయి. 


హిందీలో కథానాయికగా అగ్ర స్థాయికి వచ్చి 'మిస్టర్ ఇండియా', 'నాగిన్', 'లమ్హే' చిత్రాలు చేసే వరకూ శ్రీదేవికి దక్షిణాది పరిశ్రమ అవకాశాలు ఇచ్చింది. ఆమెతో హిందీలో చిత్రాలు చేసింది.


Also Read : 'కలర్ ఫోటో' ఎందుకంత స్పెషల్? నేషనల్ అవార్డు కంటెంట్ క్రియేటర్లకు ఎటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది?