మాహిష్మతీ... ఊపిరి పీల్చుకో!
నా కొడుకు వచ్చాడు! 'బాహుబలి' తిరిగొచ్చాడు!
- 'బాహుబలి'లో దేవసేన చెప్పిన డైలాగ్ గుర్తుందా?
ఇప్పుడు 'బాహుబలి'లో డైలాగ్ ప్రస్తావన ఎందుకు అంటే... 'కలర్ ఫోటో'కు జాతీయ పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారం వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాలనిపిస్తోంది.
కంటెంట్ క్రియేటర్లూ... ఊపిరి పీల్చుకోండి!
'కలర్ ఫోటో'కి అవార్డు వచ్చింది! జాతీయ స్థాయిలో సత్తా చాటింది!
జాతీయ పురస్కారాల్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ 'కలర్ ఫోటో' (Colour Photo)తో బోణీ కొట్టలేదు. గతంలో పలు చిత్రాలకు అవార్డులు వచ్చాయి. 'కలర్ ఫోటో' తర్వాత కూడా తప్పకుండా అవార్డులు వస్తాయి. మరి, 'కలర్ ఫోటో' ప్రత్యేకత ఏంటి? ఈ సినిమా ఎందుకు అంత స్పెషల్? అంటే... కంటెంట్ నుంచి కాస్ట్ అండ్ క్రూ వరకు ఒక్కసారి చూడాలి.
యూట్యూబ్ టు నేషనల్ అవార్డ్స్
'కలర్ ఫోటో'లో హీరో ఎవరు? సుహాస్! ఈ సినిమాకు ముందు ఏ సినిమాలో హీరోగా నటించారు? అని ప్రశ్నించుకుంటే... ఏమీ కనిపించవు. కానీ, చాలా సినిమాల్లో హీరో స్నేహితుడిగా కనిపించారు. అంతకు ముందు యూట్యూబ్‌లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశారు. 'కలర్ ఫోటో' దర్శకుడు ఎవరు? సందీప్ రాజ్! ఈ సినిమాకు ముందు ఆయన ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు? అంటే... ఏమీ కనిపించవు. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ కొన్ని తీశారు.
హీరోగా సుహాస్‌కు, దర్శకుడిగా సందీప్ రాజ్‌కు 'కలర్ ఫోటో' ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. ఈ సినిమాకు ప్రశంసలు, పురస్కారాలు వచ్చాయి! అంతకు మించి చాలా మంది కంటెంట్ క్రియేటర్లకు ఊపిరి ఇచ్చింది. ఎందుకంటే... షార్ట్ ఫిలిమ్స్ తీయడంలో చిన్నతనం లేదని, అవకాశం వస్తే ఫీచర్ ఫిలిమ్స్‌తో సత్తా చాటవచ్చని కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అవార్డులకు మించిన గొప్ప ఘనత అది.
ఆఫ్ట్రాల్ షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే నా కొడుకులు కాదు - సుహాస్
'ఆఫ్ట్రాల్ షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే నా కొడుకులు' అంటూ స్నేహితుడు, దర్శకుడు సందీప్ రాజ్‌ను ఆత్మీయంగా కౌగిలించుకుంటున్న వీడియో సుహాస్ పోస్ట్ చేశారు. అందులో కించిత్ గర్వం తొణికిసలాడింది. ఆ గర్వం ఉండటంలో తప్పు కూడా లేదేమో! ఎందుకంటే... సినిమా చేసే ముందు ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉండి ఉంటారు? ఇప్పుడు వాళ్ళందరికీ జాతీయ పురస్కారంతో సమాధానం చెప్పినట్టు అయ్యింది. ఇప్పుడు సుహాస్, సందీప్ రాజ్ ఆఫ్ట్రాల్ షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే వాళ్ళు కాదు, నేషనల్ అవార్డ్ ఫిల్మ్ తీసినోళ్ళు!
అందులోనూ 'కలర్ ఫోటో' ట్రెండ్ సెట్టర్!
తమిళంలో, మలయాళంలో కంటెంట్ ఉన్న చిత్రాలు వచ్చినప్పుడు 'తెలుగులో ఇటువంటి చిత్రాలు ఎందుకు రావు?' అని కొంత మంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పిన సినిమా కూడా 'కలర్ ఫోటో'. కమర్షియల్ కొలతలు మార్చిన సినిమా కూడా!
'కలర్ ఫోటో'లో కథానాయకుడు అందగాడు కాదు, ఆరడుగుల ఆజానుబాహుడు అసలే కాదు! సుహాస్ నల్లగా ఉన్నాడు... అయితేనేం? అతడి రంగును ప్రేక్షకులు చూడలేదు. అతడిలో నటన చూశారు. ప్రశంసించారు. రంగు లేదంటే ఎత్తు తక్కువ అని ఆత్మనూన్యత భావం కల యువతీ యువకులకు ఆత్మవిశ్వాసం ఇచ్చిన చిత్రమిది.
రూపురేఖలు, వర్ణ వివక్ష వంటి పలు అంశాలను సున్నితంగా ప్రస్తావించిన చిత్రం 'కలర్ ఫోటో'. 'హృదయ కాలేయం' ఫేమ్ సాయి రాజేష్ కథ అందించినా... సందీప్ రాజ్ అర్థవంతమైన సంభాషణలు కథలో మరింత ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లాయి. ఒక్క డైలాగ్‌ను ప్రస్తావించలేం... చాలా సన్నివేశాల్లో స్పేస్ తీసుకుని మరీ సమాజంలో పలు అంశాలను సూటిగా ప్రశ్నించారు. 'కలర్ ఫోటో' విజయంలో కథానాయిక చాందిని చౌదరి, విలన్ రోల్ చేసిన సునీల్, సంగీత దర్శకుడు కాల భైరవ పాత్రనూ విస్మరించలేం. ప్రతి ఒక్కరూ సినిమాకు ప్రాణం పెట్టి పని చేశారు.
కమర్షియల్ లెక్కల పరంగా హీరో మరణిస్తే సినిమా విజయం సాధించదని కొందరు భావిస్తుంటారు. అది తప్పని రుజువు చేసిన సినిమాల్లో 'కలర్ ఫోటో' కూడా ఒకటిగా నిలుస్తుంది. ఇలా పలు అంశాల్లో ఈ సినిమా ట్రెండ్ సెట్ చేసింది.
Also Read : మహేష్ బాబుతో విజయ్ సేతుపతి - ఆగస్టు నుంచి
అన్నట్టు... జాతీయ పురస్కారాలకు సినిమాలను ఎంపిక చేసే జ్యూరీ సభ్యులతో పాటు ప్రేక్షకులు, విమర్శకులను మెప్పించిన 'కలర్ ఫోటో' ఎక్కడ విడుదలైంది? 'ఆహా' ఓటీటీలో! థియేటర్లలో మాత్రమే కాదు... డైరెక్టుగా ఓటీటీలో విడుదలైనా సినిమాలో కంటెంట్ ఉంటే అద్భుతాలు క్రియేట్ చేస్తుందని చెప్పడానికి 'కలర్ ఫోటో' ఒక ఉదాహరణ. ఓటీటీలో విడుదలైన 'ఆకాశమే నీ హద్దురా'కూ అవార్డులు లభించాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం, నటుడు, నటి పురస్కారాలతో ఆ సినిమా సత్తా చాటింది.
Also Read : స్టార్ హీరో ఇంట విషాదం, యాక్షన్ కింగ్ అర్జున్ తల్లి మృతి