కోలీవుడ్ యంగ్ హీరో, వరుస విజయవంతమైన సినిమాలకు మ్యూజిక్ ఇస్తున్న సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) గత కొంత కాలంగా తన పర్సనల్ లైఫ్ కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన తన భార్య సైంధవికి విడాకులు ఇవ్వడం చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. మరో హీరోయిన్ తో డేటింగ్ లో ఉండడం వల్ల, భార్యకు విడాకులు ఆయన ఇచ్చాడనే రూమర్లు గుప్పుమన్నాయి. తాజాగా జీవీ ప్రకాష్ తో పాటు రూమర్లు వినిపించిన సదరు హీరోయిన్ కూడా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
హీరోయిన్‌తో ఎలాంటి సంబంధం లేదు
జీవీ ప్రకాష్ ప్రస్తుతం 'కింగ్‌స్టన్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో దివ్య భారతితో సెకండ్ టైం రొమాన్స్ చేయబోతున్నాడు ఈ హీరో. ఇదొక భారీ బడ్జెట్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్. ఈ మూవీ మార్చి 7న థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటి నుంచే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను మొదలు పెట్టారు మేకర్స్. ప్రమోషన్లలో భాగంగా జీవీ ప్రకాష్ తన విడాకులపై వస్తున్న రూమర్లు, హీరోయిన్ దివ్య భారతితో ఉన్న రిలేషన్ గురించి ప్రస్తావించారు. వీరిద్దరూ కలిసి చేస్తున్న రెండో సినిమా 'కింగ్‌స్టన్'. కానీ ఈ రెండు సినిమాలకే ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని, జీవీ ప్రకాష్ తన భార్య, గాయని సైంధవితో విడాకులు తీసుకోవడానికి ఇదే కారణం అని పుకార్లు షికార్లు చేశాయి.
ఈ వార్తలపై తాజాగా ఇంటర్వ్యూలో స్పందించిన జీవీ ప్రకాష్ "మేము డేటింగ్ చేయడం లేదు. కేవలం మంచి స్నేహితులం మాత్రమే. నేను ఆమెను కేవలం సెట్స్ లో మాత్రమే కలిశాను. ఇక ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్న టైంలో ఇలా కలిశాం. కనీసం ఆమెను బయట ఒక్కసారి కూడా కలవలేదు. అయితే మేమిద్దరం కలిసి నటించిన బ్యాచిలర్ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అందులో మా ఇద్దరికి కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయింది. కాబట్టి, ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. నిజానికి మాకు ఒకరితో ఒకరికి అసలు ఎలాంటి సంబంధం లేదు" అంటూ క్లారిటీ ఇచ్చారు.
జీవీ ప్రకాష్ విడాకుల ప్రకటన తర్వాత, ఆ వార్త తనపై ద్వేషాన్ని రేకెత్తిస్తుందని, వారిద్దరూ విడిపోవడానికి కారణం తనే అనే నిందను భరించాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని హీరోయిన్ దివ్య భారతి అన్నారు. ఆమె మాట్లాడుతూ "నాకు ఈ వార్తలు కష్టంగా అనిపిస్తాయి. ఎందుకంటే జనాలు నన్ను టార్గెట్ చేస్తారని నేను అసలు ఎప్పుడూ ఊహించలేదు. అతని డివోర్స్ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే నేరుగా నా వైపు వేలెత్తి చూపించారు. ఆయన విడాకులకు నేనే కారణం అని చాలామంది మహిళలు నాకు మెసేజ్ లు పంపారు. కానీ రియాలిటీ ఏంటో మాకు తెలుసు కాబట్టి, మాపై మాకు కంట్రోల్ ఉంది కాబట్టి ఈ వార్తలను మేము పట్టించుకోలేదు" అని క్లారిటీ ఇచ్చింది.
'బ్యాచిలర్' ఏ ఓటీటీలో ఉందంటే ?
జీవీ ప్రకాష్, దివ్య భారతి హీరో హీరోయిన్లుగా కలిసి నటించిన ఫస్ట్ మూవీ 'బ్యాచిలర్'. ఈ సినిమాలోని 'అదియే' సాంగ్ దుమ్మురేపింది. ఇక ఈ సాంగ్ లో వీరిద్దరి రొమాన్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు సతీష్ సెల్వకుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రస్తుతం సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 'బ్యాచిలర్' మూవీలో జీవీ ప్రకాష్, దివ్య భారతి మధ్య రొమాన్స్ వర్క్ అవుట్ అయిన తర్వాత, 'కింగ్‌స్టన్' కోసం మరోసారి ఈ జోడి రిపీట్ కావడంతో ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ పుకార్లు బయలుదేరాయి.