కన్జ్యూమర్ కోర్టు పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ థియేటర్ చైన్ కు లక్ష రూపాయలు జరిమానా విధించడంతో పాటు కంప్లైంట్ చేసిన వ్యక్తికి భారీగా నష్ట పరిహారాన్ని ఇవ్వాలని ఆదేశించింది. సినిమాను ప్రదర్శించే ముందు ఎక్కువ టైం యాడ్లను ప్రదర్శించారనే కారణంతో బెంగళూరు కన్స్యూమర్ కోర్టు తాజాగా ఈ షాకింగ్ తీర్పునిచ్చింది. బెంగళూరుకు చెందిన ఫిర్యాదుదారునికి నష్టపరిహారంగా కొంత మొత్తాన్ని, అలాగే ఫైన్ గా లక్ష చెల్లించాలని, సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కరెక్ట్ టైంను పేర్కొనాలని థియేటర్ చైన్ పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ ను ఆదేశించింది. 


అసలు ఏం జరిగిందంటే? 
డిసెంబర్ 2023లో సామ్ బహదూర్ సాయంత్రం 4:05 గంటల షో కోసం తనతో పాటు తన ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్ కి వెళ్ళాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళాక సినిమాను సాయంత్రం 4:30 గంటలకు స్టార్ట్ చేశారు. అప్పటిదాకా కేవలం యాడ్స్ తోనే టైం నెట్టుకొచ్చారు. దీంతో సదరు ఫిర్యాదుదారుడికి అనుకున్న టైం కి తిరిగి వర్క్ లో చేరడం కష్టమైంది. పైగా అప్పటికే ఉన్న కమిట్మెంట్స్, షెడ్యూల్స్ కు హాజరు కాలేకపోయానని, దానివల్ల ఆర్థిక నష్టాలు వచ్చాయని అతను కంప్లైంట్ లో పేర్కొన్నాడు. దీంతో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి విలువైన సమయాన్ని వృధా చేసినందుకు, అతనికి అసౌకర్యం, మానసిక వేదన కలిగించినందుకు రూ, 20,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు అతను కంప్లైంట్ చేయడానికి అదనంగా ఖర్చు చేసిన మరో రూ. 8000 కూడా చెల్లించాలని ఆదేశించింది. ఇలాంటి పని చేసినందుకు శిక్షగా 1 లక్ష రూపాయల ఫైన్ విధించింది కోర్టు.


Read Also : 'అనగనగా ఒక రాజు' ఓటీటీ పార్ట్నర్ లాక్... నవీన్ పొలిశెట్టి కామెడీ మూవీని ఏ ఓటీటీ తీసుకుందంటే?


ప్రతి క్షణం విలువైనదే 
న్యాయస్థానం ఈ విషయం గురించి మాట్లాడుతూ "ఈ యుగంలో సమయాన్ని డబ్బుగా భావిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరి టైం చాలా విలువైనది. ఇతరుల టైం, డబ్బు నుండి ప్రయోజనం పొందే హక్కు ఎవరికీ లేదు. థియేటర్లలో ఖాళీగా కూర్చుని ప్రసారమయ్యే వాటిని చూడడం కోసం ఏకంగా 25 నుంచి 30 నిమిషాలు వేస్ట్ చేయడం అనేది సాధారణ విషయం కాదు. టైట్ షెడ్యూల్ తో అనవసరమైన ప్రకటనలు చూడడం అనేది చాలా కష్టం. అయితే ఫ్యామిలీతో కలిసి కాస్త విశ్రాంతి తీసుకోవడానికి జనాలు ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటారు. దాని అర్థం జనాలకు వేరే పని లేదని కాదు" అంటూ కోర్టు ఫైర్ అయింది. అలాగే ప్రభుత్వం ఆదేశించిన యాడ్స్ ను ప్రదర్శించాలంటే మూవీ స్టార్ట్ అయ్యే ముందు, అలాగే ఇంటర్వెల్ టైంలో 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ప్లే చేయకూడదని, గవర్నమెంట్ రూల్స్ కూడా ఇదే చెబుతున్నాయని కోర్టు ఎత్తి చూపింది. 


అయితే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి సినిమాకు ముందు చూపించిన ప్రకటనలను రికార్డ్ చేయడాన్ని పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ వారు తప్పు పట్టారు. అతను పైరసీ నిరోధక చట్టాలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. కానీ అతను సినిమాను రికార్డ్ చేయాలనేదని, సినిమా ముందు ప్రదర్శించిన కమర్షియల్ యాడ్స్ ను మాత్రమే రికార్డ్ చేశారని కోర్టు సమర్థించింది. అయితే పివిఆర్ మాత్రం ఇలా యాడ్స్ ప్రదర్శించడం వల్ల షోకు ఆలస్యంగా వచ్చే ప్రేక్షకులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని తమను తాము సమర్ధించుకోవడానికి ప్రయత్నించారు. కోర్టు మాత్రం యాడ్స్ ని ప్రసారం చేయడానికి షెడ్యూల్ చేసిన సమయాని కంటే ఎక్కువ టైం తీసుకోవడం కరెక్ట్ కాదని తెలిపింది. అంతేకాకుండా పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ 30 రోజుల్లోపు వినియోగదారుల సంక్షేమ నిధికి లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వాలని ఆదేశించింది.



Also Read: బాలీవుడ్‌లో శ్రీలీల ఫస్ట్ మూవీ - రొమాన్స్ డోస్ పెంచేసిందిగా.. ఫస్ట్ లుక్ చూశారా!