సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషనల్ తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. 'హైలీ ఇన్‌ఫ్లేమబుల్' అనేది దీనికి ట్యాగ్‌ లైన్. 'అతడు' 'ఖలేజా' సినిమాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరో అప్డేట్ ఫ్యాన్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తుండగా.. మేకర్స్ తాజాగా అదిరిపోయే పోస్టర్ ను అందించారు. అలానే త్వరలోనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.


ఈరోజు దసరా పండుగను పురష్కరించుకొని, 'గుంటూరు కారం' టీం ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సరికొత్త పోస్టర్ ను ఆవిష్కరించారు. ఇందులో మహేశ్ బాబు అల్ట్రా మాస్ అవతార్‌లో అదరగొట్టాడు. కారు డిక్కీలో కూర్చొని స్టైల్ గా బీడీ వెలిగిస్తూ కనిపించాడు. అతని ముందు ఓ కత్తి ఉండటం, ఒక రౌడీ కొందపడిపోయి ఉండటాన్ని గమనిస్తే ఇదొక హై ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్ లోని మాసివ్ స్టిల్ అని అర్థమవుతోంది. 


మహేశ్ బాబు చాలా ఏళ్ళ తర్వాత 'గుంటూరు కారం' సినిమాలో పొగ తాగుతూ కనిపించబోతున్నారు. అందుకే ఫస్ట్ లుక్ దగ్గర నుంచీ ఇప్పటి వరకూ గుంటూరు కారం ఘాటు కనిపించేలా పోస్టర్స్ డిజైన్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ లో గళ్ళ లుంగీ ధరించి, నోట్లో బీడీ పెట్టుకొని మాస్ లుక్ లో ఆకట్టుకున్నాడు మహేశ్. అలానే టైటిల్ గ్లిమ్స్ లో నోట్లో నుంచి బీడీ తీస్తూ.. 'ఏందట్టా జూస్తున్నావ్.. బీడీ త్రీడీలో కనిపిస్తోందా?' అంటూ మాస్ డైలాగ్ తో మెప్పించారు. పుట్టినరోజు సందర్భంగా వదిలిన పోస్టర్ లో తలపాగా చుట్టుకొని స్టైలిష్ మాస్ అవతార్‌లో కనిపించాడు. ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్టుగా మరోసారి బీడీతో దర్శనమిచ్చారు. 


Also Read: హ్యాట్రిక్ మిలియన్ డాలర్స్ సినిమాలున్న సీనియర్ హీరోగా బాలయ్య!


ఈ సందర్భంగా 'గుంటూరు కారం' చిత్ర బృందం ట్వీట్ చేస్తూ.. ''అల్ట్రా మాస్ అవతార్‌లో మా హైలీ ఇన్‌ఫ్లేమబుల్ రీనింగ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుని ప్రెజెంట్ చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్, త్వరలో విడుదల కానుంది. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు'' అని పేర్కొన్నారు. మహేష్ బాబు సైతం ఈ స్పెషల్ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దసరా శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.






'గుంటూరు కారం' చిత్రంలో మహేష్ బాబు సరసన కుర్ర భామ శ్రీలీల, గార్జియస్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మహేశ్ ఫుల్ ఎనర్జిటిక్ రోల్ లో కనిపిస్తారని, చాలా రోజుల తర్వాత ఒక కొత్త క్యారక్టరైజేషన్ లో చూస్తారని నిర్మాతలు చెబుతున్నారు. ఇదొక మాస్ యాక్షన్ మూవీ అని, త్రివిక్రమ్ సినిమాలో ఏమేమి అంశాలు ఉండాలని ఆశిస్తారో అవన్నీ ఉంటాయనని, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పెద్ద పండుగలా ఉంటుందని అంటున్నారు. 


హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్ పై నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలు రెడీ చేసారని టాక్. నవంబర్ లో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి.. డిసెంబర్ లో ఒకటి, జనవరిలో మరొక పాటను విడుడల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్న ఈ సినిమాకి, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. రామ్ లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. 


ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుపుకుంటున్న 'గుంటూరు కారం' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


Also Read: కీరవాణి కొడుకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా? సీనియర్ నటుడి మనుమరాలితో మ్యారేజ్ ఫిక్స్ అయిందా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial