సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ 'గుంటూరు కారం' (Guntur Kaaram Movie) చిత్ర బృందం ఓ పోస్టర్ విడుదల చేసింది. లుంగీ కట్టి, కళ్ళజోడు పెట్టి... బీడీ కాలుస్తున్న స్టిల్ మాసీగా ఉందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


వాళ్ళిద్దర్నీ మార్చలేదు!
'గుంటూరు కారం' చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు? ఎస్. తమన్! 'అరవింద సమేత వీర రాఘవ' నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) చిత్రాలకు తమన్ పని చేయడం మొదలు పెట్టారు. 'అల వైకుంఠపురములో' సినిమాకూ ఆయన సంగీతం అందించారు. ఆ కాంబినేషన్ 'గుంటూరు కారం' చిత్రానికీ కంటిన్యూ అయ్యింది.


త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ చేసిన 'భీమ్లా నాయక్', 'బ్రో'తో పాటు ఆయన అండదండలు ఉన్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన చిత్రాలకూ సంగీతం అందించే ఛాన్స్ తమన్ (Thaman)కు వచ్చాయి. గురూజీకి రుణపడి ఉంటానని కూడా ఈ మధ్య తమన్ వ్యాఖ్యానించారు. అయితే... కొన్ని రోజుల నుంచి 'గుంటూరు కారం' నుంచి ఆయనను తప్పించారని, తమన్ బదులు మరొక సంగీత దర్శకుడిని తీసుకుంటారని ఫిల్మ్ నగర్ వార్తల్లో బలమైన వ్యాఖ్యలు వినపడుతున్నాయి. వాటిని తమన్ ఖండించారు. 


ఒకానొక దశలో 'గుంటూరు కారం' సినిమాకు తమన్ కేవలం నేపథ్య సంగీతం మాత్రమే అందిస్తారని, పాటలకు బాణీలు అందించే బాధ్యత మలయాళ సంగీత దర్శకుడు, విజయ్ దేవరకొండ 'ఖుషి' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహాబ్ చేతిలో పెడుతున్నారని వినిపించింది. 'గుంటూరు కారం' మహేష్ బాబు బర్త్ డే పోస్టర్ చూస్తే... తమన్ పేరు మాత్రమే ఉంది. దాంతో ఆయనను తప్పించలేదని ఓ క్లారిటీ వచ్చింది. 


సినిమాటోగ్రాఫర్ కూడా మారలేదు!
'గుంటూరు కారం' సినిమా మొదలైనప్పుడు... అందులో మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే. కారణాలు ఏమైనా సరే... ఇప్పుడు సినిమాలో ఆవిడ లేరు. శ్రీ లీల మెయిన్ హీరోయిన్ కాగా... మీనాక్షీ చౌదరిని రెండో కథానాయికగా తీసుకున్నారు. అంతకు ముందు ఫైట్ మాస్టర్లను మార్చారు. అప్పటి నుంచి 'గుంటూరు కారం' విషయంలో త్రివిక్రమ్ ఎంపిక చేసిన కొందరి పని తీరుపై మహేష్ బాబు అసంతృప్తితో ఉన్నారని గుసగుసలు, పుకార్లు వినిపించడం మొదలైంది.


Also Read : రికార్డుల వేటకు రజనీ 'జైలర్' రెడీ - ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంత రావచ్చంటే...


'గుంటూరు కారం' సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ సైతం ఇకపై పని చేసే అవకాశం లేదని, ఆయన స్థానంలో రవి కె. చంద్రన్ వస్తారని వినిపించింది. అయితే... బర్త్ డే సందర్భంగా ఆ విషయంలో కూడా 'గుంటూరు కారం' చిత్ర బృందం పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికీ పోస్టర్ మీద పీఎస్ వినోద్ పేరు ఉంది. తమన్, పీఎస్ వినోద్... ఇద్దర్నీ మార్చలేదని క్లారిటీ వచ్చింది. 


విడుదల ఒక్క రోజు ముందుకు...
కొత్తగా మారింది ఏమైనా ఉందంటే... అది 'గుంటూరు కారం' విడుదల తేదీ! తొలుత ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నట్లు తెలిపారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఒక్క రోజు ముందుకు వచ్చారు. జనవరి 12న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 


Also Read : 'సలార్' నటీనటులకు హోంబలే ఆ కండిషన్ పెట్టిందా? - ఆ ఒక్కటీ లీక్ కాకూడదని!




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial