అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు (Ghantasala Venkateswara Rao) జీవితం ఆధారంగా రూపొందిన సినిమా 'ఘంటసాల ది గ్రేట్' (Ghantasala The Great Movie). ఘంటసాల పాత్రలో యువ గాయకుడు కృష్ణ చైతన్య (Krishna Chaitanya Singer) నటించారు. ఘంటసాల భార్య సావిత్రి పాత్రలో మృదుల నటించారు. గాయకుడు జీవీ భాస్కర్‌ నిర్మాణ సారథ్యంలో అనుక్త్యారామ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి ఫణి నిర్మాతగా సినిమా రూపొందింది. ఈ చిత్రానికి 'ఘంటసాల పాటశాల' సంకలన కర్త సిహెచ్‌ రామారావు దర్శకత్వం వహించారు. చిత్రీకరణ పూర్తి అయ్యింది. నిజ జీవితంలో దంపతులు అయిన కృష్ణ  చైతన్య, మృదుల ఈ సినిమాలోనూ భార్యాభర్తలుగా నటించడం విశేషం. 


డిసెంబర్‌లో 'ఘంటసాల ది గ్రేట్'
Ghantasala Biopic Release In December 2023 : డిసెంబర్‌లో 'ఘంటసాల ది గ్రేట్' చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు చెప్పారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ చేతుల మీదుగా సినిమా పోస్టర్ విడుదల చేశారు. అనంతరం ఆయన సి. కల్యాణ్‌ మాట్లాడుతూ ''ఘంటసాల పేరు చెబితే మనందరి ఒళ్లు పులకరిస్తుంది. ప్రేక్షకుల నరనరాన ఆయన పేరు ఉండిపోయింది. ఘంటసాల గారి మీద అభిమానంతో, ఆయన జీవిత కథ తీసుకుని దర్శకుడు రామారావు చేసిన ప్రయత్నమిది. దీనికి నిర్మాతలు చక్కని సహకారం అందించారు. ఈ సినిమాను ప్రేక్షకులు సూపర్‌ హిట్‌ చేయాలి. ఇక, ఈ సినిమాలో  టైటిల్‌ పాత్ర పోషించిన గాయకుడు కృష్ణ చైతన్యకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నా'' అని చెప్పారు. ''ఇటీవల బయోపిక్స్ చాలా వస్తున్నాయి. ఘంటసాల బయోపిక్ ఎప్పుడో రావాల్సింది. ఆలస్యమైనా సీహెచ్ రామారావు మంచి ప్రయత్నం చేశారు. ఈ తరానికి ఘంటసాల చరిత్ర తెలియజేయడం చాలా అవసరం'' అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు కెఎల్‌ దామోదర్ ప్రసాద్‌ చెప్పారు. 


Also Read 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ : తమన్నా బోల్డ్‌గా చేశారు సరే సిరీస్‌ ఎలా ఉంది? శృంగారం గురించి కొత్తగా ఏం చెప్పారు?


ఈ సినిమాలో తాను ఓ మంచి పాత్ర పోషించానని నిర్మాతల మండలి కోశాధికారి తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. పరిశ్రమ వ్యక్తులు, ప్రేక్షకులు ఈ సినిమాకు సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఘంటసాల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో (సిలబస్ గా) ఉంచడం ప్రభుత్వాల బాధ్యత అని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్‌ చెప్పారు. 


సినిమాలో ఘంటసాల జీవితంలోని ఆటుపోట్లు!
వెండితెరపై ఘంటసాల గారి పాత్ర పోషించడం ఓ గాయకుడిగా తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని కృష్ణ చైతన్య చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''ప్రపంచానికి ఘంటసాల గారు గాయకుడిగానే తెలుసు. ఆయన ఎదుగుదలలో ఎదురైన ఆటుపోట్లు, ఆయన గురించి తెలియని ఎన్నో విషయాలు ఎన్నో మా సినిమాలో ఉన్నాయి'' అని చెప్పారు. 


Also Read : తెలుగు తెరకు 'ఫ్యామిలీ మ్యాన్' కుమార్తె - అగ్ర నిర్మాత అండతో...


చిత్ర నిర్మాణ సారథి జీవీ భాస్కర్‌ మాట్లాడుతూ ''ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా 2018లో 'ఘంటసాల ది గ్రేట్' బయోపిక్ టీజర్ విడుదల చేశాం. ఆ తర్వాత పలు కారణాల వల్ల ఘంటసాల కుటుంబంతో చిన్న లీగల్‌ సమస్య వచ్చింది. ఇప్పుడు అవన్నీ తొలగిపోయి ఆయన కుటుంబం నుంచి మాకు మంచి మద్దతు లభిస్తోంది. ఇంకా మాకు లక్ష్మీ ప్రసాద్‌, మాధవపెద్ది సురేష్‌ అందించిన సహకారం మరువలేనిది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం'' అని చెప్పారు. లీగల్ సమస్యల వల్ల సినిమా విడుదల ఆలస్యమైందని, ఇప్పుడు అటువంటివి ఏమీ లేవని చిత్ర సమర్పకులు లక్ష్మీ ప్రసాద్‌ తెలిపారు. 


కృష్ణ చైతన్యకు ఎస్పీ బాలు ప్రశంస
''దర్శకుడిగా నా తొలి చిత్రమిది. నేను అభిమానించే ఘంటసాల గారి జీవిత కథతో సినిమా తీసే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన పేరు చెబితే గుర్తొచ్చేది పాట. ఆ పాట కోసం ఆయన ఎంత కష్టపడ్డారో చాలా మందికి తెలియదు. ఆ విషయాలను సినిమాలో చూపించాం. గాయకుడి కంటే వ్యక్తిగా ఆయన ఎంతో మంచి మనిషి. ఆయన జీవితంతో ఎంత పోరాటం ఉందో... ఈ బయోపిక్ జర్నీలో నేనూ అంతే కష్టపడ్డా. ఘంటసాలగా కృష్ణ చైతన్య కరెక్టుగా సరిపోయాడని ఎస్పీ బాలు గారు చెప్పారు. అది మా తొలి విజయంగా భావిస్తున్నాం'' అని దర్శకుడు సీహెచ్ రామారావు చెప్పారు. 


కృష్ణ చైతన్య, మృదుల జంటగా నటించిన ఈ సినిమాలో సుమన్, సుబ్బరాయ శర్మ, దీక్షిత్ మాస్టర్, జెకె భారవి, అశోక్ కుమార్, మాస్టర్ అతులిత్ (చిన్న ఘంటసాల), సాయి కిరణ్, అనంత్‌, గుండు సుదర్శన్‌, జీవీ భాస్కర్‌, దీక్షితులు, జయవాణి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు : క్రాంతి, కళ : నాని, ఛాయాగ్రహణం : వేణు మురళీధర్ వి, సహ నిర్మాత : జి.వి. భాస్కర్, సంగీతం : వాసూరావు సాలూరి.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial