పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన రొమాంటిక్ మూవీ ‘తొలిప్రేమ’. అతడి సినీ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం విడుదలైన 25 సంవత్సరాలు అయ్యింది. 25వ వార్షికోత్సవం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు కరుణాకరన్ కీలక విషయాలు చెప్పారు. అమితాబ్ బచ్చన్ ఈ సినిమా చూసి ఎలా ఫీలయ్యారో వివరించారు.
‘తొలిప్రేమ’ చూస్తూ కోపంతో ఊగిపోయిన బిగ్ బీ
‘తొలిప్రేమ’ సినిమా విడుదలై తెలుగులో సంచలన విజయాన్ని అందుకుంది. ఆ సమయంలో అమితాబ్ బచ్చన్ ఈ సినిమాను తన ఇంట్లో చూశారట. తన భార్య జయా బచ్చన్ తో కలిసి ఈ సినిమాను చూశారట. మూవీ క్లైమాక్స్ చూసి ఆయనకు విపరీతమైన టెన్షన్ తో పాటు చిరాకు పడ్డారని చెప్పారు దర్శకుడు కరుణాకరన్. “ ‘తొలిప్రేమ’ క్లైమాక్స్ ప్రేక్షకులలో విపరీతమైన టెన్షన్‌ను కలిగిస్తుంది. ఎందుకంటే, హీరో చివరి వరకు తన ప్రేమను చెప్పడు. క్లైమాక్స్ చూస్తున్నప్పుడు, హీరో ఎంతకీ హీరోయిన్‌కు తన లవ్ గురించి చెప్పకపోవడం పట్ల అమితాబ్ కూడా బాగా విసుగు చెందారు. చివరకు ఆ టెన్షన్ తట్టుకోలేకపోయారు. ఆయనకు విసుగుతో పాటు కోపం కూడా వచ్చింది. వెంటనే తన కారు కీస్ టీవీ స్క్రీన్‌పై విసిరారు” అని చెప్పుకొచ్చారు. ఇక ఆయనతో కలిసి సినిమా చూస్తున్న జయా బచ్చన్ మాత్రం హీరోయిన్ తిరిగి వచ్చినప్పుడు చాలా ఆనందం వ్యక్తం చేశారని వివరించారు. అంతేకాదు, ఎండింగ్ సీన్ చూసి చప్పట్లు కొడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో అమితాబ్, దర్శకుడు కరుణాకరణ్ కు చెప్పారట. తాజాగా ఈ విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు.
‘తొలిప్రేమ’ చిత్రం గురించి..
పవన్ కల్యాణ్, కీర్తిరెడ్డి ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటించారు. కరుణాకర్ దర్శకత్వం వహించగా, దేవా సంగీతం అందించారు. ఈ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యాక, తమిళంలో ‘ఆనందమజై’ అనే పేరుతో డబ్ చేయబడింది. కన్నడలో ‘ప్రీత్సు తప్పెనిల్లా’ (2000), హిందీలో ‘ముజే కుచ్ కెహనా హై’ (2001)గా రీమేక్ చేయబడింది. మొదటి చూపులోనే అనుతో ప్రేమలో పడిన బాలు, అతని ప్రేమ విషయాన్ని తనకు చెప్పేందుకు చేసే ప్రయత్నాలను బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించారు కరుణాకరన్. హీరోయిన్ హృదయాన్ని గెలుచుకోవడానికి హీరో ఎదుర్కొనే కష్టాలను అద్భుతంగా చూపించారు.
వరుస సినిమాలతో అమితాబ్, పవన్ ఫుల్ బిజీ
అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ప్రభాస్, కమల్ హాసన్ తో కలిసి పాన్-ఇండియన్ చిత్రం ‘ప్రాజెక్ట్ K’లో పని చేస్తున్నారు. నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్ గా చేస్తోంది. ఇక పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి చేసిన ‘బ్రో’ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 28 విడుదల కానుంది. అటు దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో కలిస యాక్షన్-అడ్వెంచర్ డ్రామా ‘హరి హర వీర మల్లు’లో కనిపించనున్నారు. హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోనూ నటిస్తున్నారు. దర్శకుడు సుజీత్ తో కలిసి ‘OG’ మూవీ చేస్తున్నారు.
Read Also: ‘బిగ్ బాస్’ షో నుంచి వెళ్లిపోతున్నా- సల్మాన్ సంచలన ప్రకటన, అంత కోపం ఎందుకొచ్చింది?