Pawan Varahi Yatra Review :  జనసేన అధినేత పవన్ కల్యాణ్ జూన్ 14వ తేదీ 30వ తేదీ వరకూ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల కోసం మొదటి యాత్ర ఇదే. ఈ యాత్ర ఇలా వరుసగా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. ఈ వారాహి యాత్రపై జనసేన ఎన్నో ఆశలు పెట్టుకుంది. దీనికి కారణం నాలుగేళ్లుగా పవన్ ..ఇంత సుదీర్ఘంగా ఎప్పుడూ ప్రజల్లో తిరగలేదు. ఇప్పుడే మొదటి సారి బయటకు వచ్చారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్న సమయంలో ఆయన పర్యటనతో ప్రజంలతా పవన్ ను ప్రత్యామ్నాయ శక్తిగా భావిస్తారని ఆశిస్తున్నారు. మరి పవన్ అనుకున్న విధంగా వారాహి యాత్రలో ఆ టెంపో కొనసాగించగలిగారా ?


భారీ జన స్పందన మధ్య సాగిన వారాహి యాత్ర 


పవన్ కల్యాణ్ ఎక్కడ ఎప్పుడు వెళ్లినా జన స్పందనకు మాత్రం కొదవ ఉండదు. ఆయన పవర్ స్టార్. ప్రత్యేకంగా జన సమీకరణ చేయాల్సిన అవసరం జనసేన నేతలకు ఉండదు. అందుకే అన్నవరం నుంచి ప్రారంభించి భీమవరం వరకూ జన జాతర కనిపించింది. అన్ని చోట్లా ప్రత్యేకంగా కొన్ని వర్గాలతో సమావేశం అయ్యారు.వారి సమస్యలు విన్నారు. అన్నీ నోట్ చేసుకున్నారు. అదే సమయంలో చేరికల్ని ప్రోత్సహించారు. ఎలా  చూసినా వారాహి యాత్ర జన సందోహం విషయంలో అద్భుతంగా విజయవంతం అయిందని అనుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు.  


వైఎస్ఆర్‌సీపీకి ఎలా కౌంటర్ ఇవ్వాలో అలానే స్పందించారా ?


అన్యాయానికి గురైన వాడు ఊగిపోతూనే మాట్లాడతాడని భీమవరంలో పవన్ కల్యాణ్ సీఎం జగన్ కు కౌంటర్ ఇచ్చారు. పవన్ ప్రసంగాలు గతంలో కన్నా చాలా షార్ప్ గా ఉన్నాయి. నేరుగా వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. వారి తీరును ప్రజల ముందు పెట్టారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు పవన్ కల్యాణ్ ను కంట్రోల్ చేయడానికి ఎక్కువగా వ్యక్తిగత విమర్శలను నమ్ముకుంటారు. అయితే పవన్ వారిని ఏ మాత్రం లెక్క చేయకుండా వారి భాషలోనే కౌంటర్ ఇచ్చారు. ఘాటు తగ్గించలేదు. భీమవరంలో అయితే ఆయన భాషకు వైఎస్ఆర్సీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకు వచ్చి పవన్ రాజకీయాలకు పనికి రారని ప్రకటించారు. కానీ పవన్ అలా స్పందించడానికి.. ఆయనను ఇతర నేతలంతా వ్యక్తిగతంగా దూషించడమే కారణం కాదా అన్న ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. 


ఓ స్ట్రాటజీ ప్రకారమే పవన్ వారాహి యాత్ర !


పవన్ కల్యాణ్ ఓ స్ట్రాటజీ ప్రకారమే వారాహియాత్ర సాగేలా చూసుకున్నారు. ప్రధానంగా తనకు మద్దతుగా ఉంటుందనుకున్న సామాజికవర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయన విస్తృతంగా శ్రమించారు. వ్యూహాత్మకంగా ప్రసంగాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు మద్దతుగా ఉంటుందని భావిస్తున్న వర్గం.. పూర్తి స్థాయిలో ఓట్లు వస్తే.. పవన్ రాజకీయంగా బలపడతారు. ఈ అంశంపై ఆయన రాజకీయంగ వ్యూహాత్మకంగా వ్యవహరించారని..  అంతా తన వైపు ఉండాలని ఆయన ప్రతి చోటా విజ్ఞప్తి చేశారని అంటున్నారు. 


అధికార పార్టీ కంగారే పవన్ యాత్ర సక్సెస్ అయిందనడానికి సాక్ష్యమా ?


పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడటానికి వైఎస్ఆర్‌సీపీ ఎప్పుడూ రెడీగానే ఉంది. ఆయనపై వైఎస్ఆర్‌సీపీ కాపు నేతలు విరుచుకుపడ్డారు. ముద్రగడ వంటి వారు కూడా తెరపైకి వచ్చారు. చివరికీ సీఎం జగన్ బడి పిల్లల మీటింగ్ లో కూడా పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ స్పందన చూస్తే ఖచ్చితంగా వారాహి యాత్ర అనుకున్నదాని కంటే ఎక్కువ సక్సెస్ అయిందని జనసేన నేతలు విశ్లేషించుకుంటున్నారు.