‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలతో మంచి ఊపు మీదున్న షారుఖ్ ఖాన్ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైపోయాడు. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన ‘డంకీ’ మూవీతో త్వరలోనే థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఇప్పటికే రెండు బ్లాక్‌బస్టర్ హిట్లతో దూసుకెళ్తున్న షారుఖ్ ‘డంకీ’తో హ్యాట్రిక్ హిట్ కొడతాడో లేదో చూడాలి. తాజాగా విడుదలైన ‘డంకీ’ ట్రైలర్ చూస్తుంటే అది సాధ్యమనే అనిపిస్తోంది.


విక్కీ కౌశల్‌తో షారుఖ్ మల్టీ స్టారర్..
‘డంకీ’లో షారుఖ్ ఖాన్.. హర్దయాల్ సింగ్ ఢిల్లోన్ అలియాస్ హార్డీ పాత్రలో కనిపించనున్నాడు. ఇక తనతో రొమాన్స్ చేసే హీరోయిన్ పాత్రలో తాప్సీ కనిపించనుంది. వీరితో పాటు విక్కీ కౌశల్ కూడా కీలక పాత్రలో నటించాడు. ‘డంకీ’ మూవీ అనౌన్స్‌మెంట్ తర్వాత అసలు ఇందులో నటీనటులు ఎవరు, కథ ఏంటి అనే విషయాలు బయటికి రానివ్వలేదు. కానీ కొన్నిరోజుల  క్రితం గ్లింప్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. విక్కీ కౌశల్‌.. ‘డంకీ’లో ఉండడం చూసి అందరూ షాక్ అయ్యారు. దీంతో తన పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని ఫిక్స్ అయిపోయారు. ట్రైలర్‌లో కూడా విక్కీ తన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేయగా.. షారుఖ్ తన ఎమోషనల్ డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు.


లండన్ కలలు..
‘డంకీ’ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. లండన్ వెళ్లాలి అని కలలు కనే హీరో లల్టూ అనే ఊరిలో అడుగుపెడతాడు. అక్కడే తనకు మరో నలుగురు ఫ్రెండ్స్ కలుస్తారు. వారికి కూడా లండన్ వెళ్లాలనే కోరిక ఉంటుంది. అందరూ కలిసి ఇంగ్లీష్ నేర్చుకొని లండన్ వెళ్లాలనుకుంటారు. అక్కడ వరకు ట్రైలర్ సాఫీగా, కామెడీగా సాగిపోయింది. కానీ లండన్ వెళ్లే క్రమంలో ఈ అయిదుగురు ఎలాంటి కష్టాలు పడతారు, అసలు అక్కడికి వెళ్లారా లేదా అనే పార్ట్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ‘డంకీ’ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. ఈ మూవీలో ‘పఠాన్’ రేంజ్ యాక్షన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. షారుఖ్‌తో పాటు మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసినట్టుగా అనిపిస్తోంది.


అన్ని ఎమోషన్స్ కలిపిన రైడ్..
రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన ‘డంకీ’ని షారుఖ్ తన సొంత బ్యానర్ అయిన రెడ్ చిల్లీ ఎంటర్‌టైన్మెంట్ ద్వారా నిర్మించారు. ఈ సినిమాకు షారుఖ్ భార్య గౌరీ ఖాన్ కూడా మరో నిర్మాతగా వ్యవహరించారు. ‘డంకీ’ ట్రైలర్‌ను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు షారుఖ్. ‘లల్టూ నుంచి నేను ఈ కథను మొదలుపెట్టాను. నా స్నేహితులతో కలిసి దీనిని నేనే పూర్తిచేస్తాను కూడా. రాజు సార్ విజన్ నుంచి మొదలయిన ప్రయాణాన్ని డంకీ ట్రైలర్ మీకు చూపిస్తుంది. ఇది మిమ్మల్ని ఫ్రెండ్‌షిప్, కామెడీ, జీవితంలోని ట్రాజెడీ, ఫ్యామిలీ, ఇల్లు.. ఇలా అన్నింటికీ సంబంధించిన ఒక రైడ్‌లో తీసుకెళ్తుంది. ఎదురుచూపులు ముగిశాయి. డంకీ డ్రాప్ 4 వచ్చేసింది’ అని క్యాప్షన్ కూడా పెట్టాడు. 2023 డిసెంబర్ 21న ‘డంకీ’ థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీ కూడా అప్పుడే రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. డాంకీ (డంకీ) గెలుస్తుందా? డైనోసార్ గెలుస్తుందా చూద్దామంటూ ఫ్యాన్స్ సవాళ్లు విసురుకుంటున్నారు.






Also Read: ‘హాయ్ నాన్న’ ఉందా, ఊడిందా అనేది ఆ రాత్రే తేలిపోతుంది - నాని కామెంట్స్