Hi Nanna Release Date: సినిమా ప్రమోషన్స్ విషయంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు మేకర్స్. ఒక సినిమా ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లడం కోసం కొత్త కొత్త మార్గాలు కనిపెడుతున్నారు. అందులో ఒకటి పెయిడ్ ప్రీమియర్స్. మామూలుగా చాలావరకు సినిమాలు విడుదలయ్యే ముందు ప్రీమియర్ షోలు అనేవి ఏర్పాటు చేస్తాడు. కానీ దానికి వెళ్లడానికి కొందరికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అలా కాకుండా ప్రేక్షకులు కూడా ఈ ప్రీమియర్స్‌ను టికెట్ కొని చూడవచ్చు. దాన్నే పెయిడ్ ప్రీమియర్స్ అంటారు. అయితే నాని నటించిన అప్‌కమింగ్ మూవీ ‘హాయ్ నాన్న’కు కూడా అలాంటి పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుండగా.. ఈ విషయంపై నాని క్లారిటీ ఇచ్చాడు.


ట్విటర్‌లో ఫ్యాన్స్‌లో నాని ముచ్చట్లు..
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమాలన్నీ చాలావరకు మినిమమ్ గ్యారెంటీ హిట్లుగానే నిలుస్తాయి. ఫీల్ గుడ్ సినిమాలు మాత్రమే కాదు.. కమర్షియల్ సినిమాల్లో కూడా తనకు సూట్ అయ్యే కథలనే ఎంపిక చేసుకుంటాడు నాని. అలాగే తన అప్‌కమింగ్ మూవీ ‘హాయ్ నాన్న’లో కూడా ఒక సింగిల్ తండ్రి పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంతో శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ బాధ్యతలను నాని తన భుజంపై వేసుకున్నాడు. ఎక్కువగా ఇంటర్వ్యూలలో పాల్గొనడం మాత్రమే కాకుండా ప్రేక్షకులతో కూడా ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు ఈ నేచురల్ స్టార్. అందులో భాగంగానే తాజాగా ట్విటర్‌లో తన ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు. అప్పుడే పెయిడ్ ప్రీమియర్స్ గురించి క్లారిటీ కూడా ఇచ్చాడు.


ఉందా, ఊడిందా మీకు తెలిసిపోతుంది..
ట్విటర్‌లో హ్యాష్‌ట్యాగ్ నాని అని పెట్టి తన ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు నాని. అప్పుడే ఒక ఫ్యాన్.. ‘‘తెలంగాణ, ఏపీల్లో పెయిడ్ ప్రీమియర్స్ ఉండొచ్చు అంటున్నారు. నిజమేనా?’’ అని అడిగాడు. దానికి నాని.. ‘‘పెయిడ్ ప్రీమియర్స్ లేవు. ఏఎమ్‌బీలో డిసెంబర్ 6న సాయంత్రం కొంతమంది వ్యక్తులకు, మీడియాకు కొన్ని స్పెషల్ షోలు ఉంటాయి. 6వ తేదీ రాత్రికల్లా ఉందా, ఊడిందా మీకు తెలిసిపోతుంది. ఉండిపోతుంది ఎప్పటికీ అని నా ఫీలింగ్’’ అంటూ సినిమాపై తన నమ్మకాన్ని మరోసారి బయటపెట్టాడు ఈ హీరో. అంతే కాకుండా ‘‘సినిమా ఎక్కడైనా బోర్ కొడుతుందా?’’ అని మరొకరు అడగగా.. ‘‘మూడోసారి చూస్తున్నప్పుడు కూడా బోర్ కొట్టదు’’ అని అన్నాడు. నాని ఇస్తున్న ఈ కాన్ఫిడెంట్ సమాధానాలు చూస్తుంటే ‘హాయ్ నాన్న’ కచ్చితంగా హిట్ అవుతుందేమో అని చాలామంది ప్రేక్షకులు భావిస్తున్నారు.


తండ్రీకూతుళ్ల అనుబంధం..
శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ ‘హాయ్ నాన్న’లో నానికి జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇక నాని కూతురి పాత్రలో కియారా కనిపించింది. ఇప్పటికే విడుదలయిన టీజర్, ట్రైలర్‌లలో నాని, కియారా మధ్య చూపించే తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో అంతకు మించి ఉంటుందని నాని ఇప్పటికే మాటిచ్చాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ హెషబ్ అబ్దుల్ వాహబ్ అందించిన పాటలు ఇప్పటికే మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్ 7న ‘హాయ్ నాన్న’ థియేటర్లలో సందడి చేయనుంది. 


Also Read: ఫోన్ స్విచాఫ్ చేసుకొని వెళ్లిపోయారు - సంతోషం అవార్డ్స్‌లో ఏం జరిగిందో బయటపెట్టిన టీఎఫ్‌సీసీ