‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్ వివేక్‌ అగ్నిహోత్రి స్వయంగా నిర్మిస్తూ, తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’. కొవిడ్‌ క్లిష్ట సమయంలో అలుపెరుగని కృషితో వ్యాక్సిన్‌ ను కనుగొన్న భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో నానా పటేకర్‌, 'కాంతారా' ఫేమ్ పల్లవీ జోషి, రైమాసేన్‌, అనుపమ్‌ ఖేర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు. సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 


వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేస్తూ ‘డియర్ ఫ్రెండ్స్.. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న మీ ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ సినిమా 2023 సెప్టెంబరు 28 శుభ దినాన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. మమ్మల్ని ఆశీర్వదించండి’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినిమా టీజర్‌ని కూడా రిలీజ్ చేశారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ, అదే సెప్టెంబరు 28వ తేదీన రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్‌’ ఫస్ట్ పార్ట్ సైతం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో 'సలార్' vs ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ వార్ కంఫర్మ్ అయింది.






Also Read:  అమ్మమ్మ తాతయ్యలతో కలిసి జాతీయ జెండా ఎగురవేసిన మెగా ప్రిన్సెస్ క్లిన్ కారా!


గతేడాది ప్రభాస్‌ నటించిన ‘రాధేశ్యామ్‌’ సినిమాకి పోటీగా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని ఒకే రోజు విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు వివేక్ అగ్నిహోత్రి. ఈ క్రమంలో ఇప్పుడు 'సలార్' పోటీగా తన 'వ్యాక్సిన్ వార్' మూవీని రిలీజ్ చేస్తానని దర్శకుడు అన్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అంతేకాదు కొంతమంది రాత్రి తాగి పొద్దున్న దేవుడు అని అంటున్నారని 'ఆదిపురుష్' ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసినట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో అతనిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. దీనిపై వివేక్ స్పందిస్తూ అవన్నీ తప్పుడు వార్తలని వివరణ ఇచ్చాడు. 


"నేను అనని మాటలు నాకు అంటగడతూ ఎవరు ఈ తప్పుడు వార్తలు వ్యాపింపజేస్తున్నారు? నేను ప్రభాస్ ను గౌరవిస్తాను. అతడో మెగా మెగా స్టార్.. మెగా మెగా బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. మేము ప్రజల సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాలు చేస్తున్నాం. మా మధ్య అసలు పోలికే లేదు. దయచేసి నన్ను వదిలేయండి" అని వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేసారు. దీంతో 'ది వ్యాక్సిన్ వార్' - 'సలార్' మధ్య పోటీ ఉండకపోవచ్చని అందరూ అనుకున్నారు. 


కానీ ఇప్పుడు 'ది వ్యాక్సిన్ వార్' రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ తో ప్రశాంత్ నీల్ 'సలార్' ను ఢీకొట్టబోతున్నానని వివేక్ రంజన్ అగ్నిహోత్రి ప్రకటించినట్లు అయింది. ఇదంతా చూస్తుంటే దర్శకుడు ముందే ఇలా ప్లాన్ చేసుకుని, ప్రభాస్ తో కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ఈసారి 'సలార్' దెబ్బకు ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వార్ లో గెలిచే అవకాశమే లేదని అంటున్నారు. అసలు 'వ్యాక్సిన్ వార్' ని తమ హీరో చిత్రానికి పోటీగా భావించడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో 'సలార్' Vs 'ది వ్యాక్సిన్ వార్' క్యాష్ కు సంబంధించి ఎలాంటి ఫ్యాన్ వార్స్ జరుగుతాయో చూడాలి.


Also Read: మాస్ కా దాస్ 'ఫ్యామిలీ ధమాకా' - హోస్ట్ అవతారమెత్తిన విశ్వక్ సేన్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial