'విక్రమ్' సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఇండియన్ 2'. స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు కమల్ బర్త్ డే స్పెషల్ గా వచ్చిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సరికొత్త పోస్టర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.
'ఇండియన్ 2' సినిమాలో సేనాపతి పాత్రలో కమల్ హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ, కమల్ మిలటరీ లుక్ లో ఉన్న ఫోటోని రిలీజ్ చేసారు. ఇందులో ఖాకీ డ్రెస్, జేబుకి జాతీయ జెండాతో ఇంటెన్స్ గా చూస్తున్నారు. కమల్ గెటప్, ఆ పాత్రలో ఇమిడిపోయిన తీరు ఆకట్టుకుంటుంది. ముసలివాడిగా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఎవరైనా వావ్ అనాల్సిందే. ప్రస్తుతం ఈ పోస్టర్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
Also Read: 'భగవంత్ కేసరి'కి గుడ్ బై చెప్పిన బాలీవుడ్ యాక్టర్!
1996లో కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్ గా 'ఇండియన్ 2' తెరకెక్కుతోంది. భారతీయ సైన్యంలో పనిచేసిన నిజాయితీపరుడైన సేనాపతి.. అవినీతి అధికారులకు, లంచాలు తీసుకునే బ్యూరోక్రాట్లకు ఎలా గుణపాఠం చెప్పాడనేది మొదటి భాగంలో చూపించారు. దాదాపు 26 ఏళ్ళ తర్వాత ట్రూ ఇండియన్ సేనాపతి మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఈసారి మరో లక్ష్యంతో రాబోతున్నాడని తాజా పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.
నిజానికి 'ఇండియన్ 2' సినిమా ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో అనేక వివాదాలు, కేసులు, ఎన్నో అడ్డంకులు ఈ చిత్రాన్ని చుట్టుముట్టాయి. అన్నీ ఓ కొలిక్కి రావడంతో గతేడాది తిరిగి సెట్స్ మీదకు తీసుకొచ్చారు. డైరెక్టర్ శంకర్ ఓవైపు రామ్ చరణ్ తో 'గేమ్ చేంజర్' మూవీ చేస్తూనే, మరోవైపు కమల్ హాసన్ సినిమా పనులు చూసుకుంటున్నారు. త్వరలోనే ఈ రెండు చిత్రాల విడుదల తేదీలపై క్లారిటీ రానుంది.
'ఇండియన్ 2' చిత్రంలో కమల్ హాసన్ తో పాటుగా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, బొమ్మరిల్లు సిద్ధార్థ్, బాబీ సింహా, సముద్రఖని, గుల్సాన్ గ్రోవర్, వెన్నెల కిషోర్, ప్రియా భవానీ శంకర్ తదితరులు నటిస్తున్నారు. పంజాబీ నటుడు, భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. రత్నవేలు - రవి వర్మన్ లు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ గైంట్ మూవీస్ బ్యానర్స్ పై సుభాస్కరన్ - ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Also Read: దేశభక్తిని చాటి చెప్పే తెలుగు సినిమా పాటలు ఇవే - ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial