కోలీవుడ్ హీరో విశాల్ చాలా కాలంగా ఓ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. 2018 లో వచ్చిన 'అభిమన్యుడు' తర్వాత ఇప్పటివరకు ఈ హీరోకి మరో హిట్టు పడలేదు. ప్రస్తుతం విశాల్ ఏకంగా మూడు సినిమాలను సెట్స్ పై ఉంచాడు. అందులో 'మార్క్ ఆంటోనీ' సినిమా కూడా ఒకటి. రీసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో విశాల్ రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నారు. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్ ని అందుకొని సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు విశాల్.


తమిళంతో పాటు తెలుగులోనూ విశాల్ కి మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా యాక్షన్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఈ కోలీవుడ్ హీరో. కానీ గత కొంతకాలంగా విశాల్ నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. కానీ ఈసారి 'మార్క్ ఆంటోనీ'తో హిట్ దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. తాజాగా మూవీ యూనిట్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ప్రేక్షకులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెప్టెంబర్ 15న 'మార్క్ ఆంటోనీ' సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ని విడుదల చేయగా, ఆ పోస్టర్లో విశాల్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు.






సెప్టెంబర్ 15న పాన్ ఇండియా స్థాయిలో తమిళం తో పాటు హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. విశాల్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రంలో తెలుగు హీరోయిన్ రీతు వర్మ కథానాయికగా నటిస్తోంది. ఎస్ జె సూర్య, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మినీ స్టూడియోస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. కాగా విశాల్ చివరగా 'లాఠీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విశాల్ ఓ కానిస్టేబుల్ పాత్రను పోషించారు.


గత ఏడాది డిసెంబర్ 22న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోయింది. సినిమాలో విశాల్ నటన, యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నా.. స్టోరీ, స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం పరాజయాన్ని అందుకుంది. మరి విశాల్ కి 'మార్క్ ఆంటోనీ' సినిమాతో నైనా సక్సెస్ దక్కుతుందేమో చూడాలి. ఇక మార్క్ ఆంటోనితోపాటు హరి దర్శకత్వంలో ఓ సినిమా అలాగే 'డిటెక్టివ్' సీక్వెల్ లో నటిస్తున్నారు విశాల్. వీటిలో 'డిటెక్టివ్ సీక్వెల్' షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. స్వయంగా విశాల్ ఈ సీక్వెల్ కి దర్శకత్వం వహిస్తూ ఉండడం విశేషం.


Also Read : 'సైంధవ్'లో పాత్రలు ఇవే - ఆకట్టుకుంటున్న స్పెషల్ వీడియో!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial