Dhruva Sarja Kids Naming Ceremony: 2024 జనవరి 22 అనేది భారతీయులకు గుర్తుండిపోయే రోజుగా మారిపోయింది. ఎందుకంటే అదే రోజు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరిగింది. దేశవ్యాప్తంగా ఆ రోజంతా అయోధ్యలో రామ మందిరం గురించి, అక్కడ జరుగుతున్న విశేషాల గురించి చూడడం, చర్చించుకోవడంతో నిండిపోయింది. ఇక అదే రోజు మంచిదని భావించి చాలామంది తమ స్పెషల్ కార్యక్రమాలను ప్లాన్ చేసుకున్నారు కూడా. అలా ప్లాన్ చేసుకున్నవారిలో కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా కూడా ఒకరు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభమయిన ముహూర్తానికే తన పిల్లలకు పేర్లు పెట్టాడు ధ్రువ.


ఇద్దరు పిల్లలు..


కన్నడలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ధ్రువ సర్జా. ధ్రువ, ప్రేరణల జంటకు 2022లో కుమార్తె జన్మించింది. ఇక 2023 సెప్టెంబర్‌లో కుమారుడు జన్మించాడు. తన పిల్లలకు సంబంధించిన స్పెషల్ మూమెంట్స్ అన్నీ ఎప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటాడు ధ్రువ. కానీ ఇప్పటివరకు వీరిద్దరికీ పేర్లు పెట్టలేదు. ఇక అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కంటే మంచి రోజు ఏముంటుంది అనుకున్నాడో ఏమో జనవరి 22న తన పిల్లలకు పేర్లు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ వేడుకకు తన మావయ్య అర్జున్ సర్జాతో పాటు బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌ను కూడా ముఖ్య అతిథులుగా ఆహ్వానించాడు. హనుమంతుడి భక్తుడైన ధ్రువ సర్జా.. తన పిల్లలకు కూడా దేవుడికి సంబంధించిన పేర్లే పెట్టాడు. 


పేర్ల వెనుక కారణాలు..


ధ్రువ సర్జా, ప్రేరణల జంటకు పుట్టిన కూతురికి రుద్రాక్షి అని, కుమారుడికి హయగ్రీవ అని పేర్లు పెట్టారు. రామాయణంలో ఒకానొక సందర్భంలో హనుమంతుడు.. పంచుముఖ ఆంజనేయ స్వామిగా అవతారం ఎత్తాడు. పంచముఖం అంటే అయిదు ముఖాలు. ఇందులో ఒకటి హనుమంతుడిది కాగా.. మరో నాలుగు - నరసింహ, వరాహం, హయగ్రీవ, గరుడ. ఇక పంచముఖి ఆంజనేయ స్వామికి సంబంధించిన అయిదు ముఖాల్లో ఒకటైన హయగ్రీవను తన కుమారుడికి పేరుగా పెట్టుకున్నాడు ధ్రువ. ఇక రుద్రాక్ష అంటే శివుడి గుర్తుగా తన భక్తులు ఎప్పుడూ మెడలో వేసుకునేది. అందుకే తన కూతురికి రుద్రాక్షి అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. 






అదే సమయానికి..


అయోధ్యలో రాముడికి మధ్యాహ్నం 12.20కు పూజలు జరిగగా.. అదే సమయంలో తన పిల్లలకు పేర్లు పెట్టానని ధ్రువ సర్జా బయటపెట్టాడు. త్వరలోనే కుటుంబంతో కలిసి అయోధ్యకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటామని తెలిపాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. 2021లో ‘పొగరు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధ్రువ.. ఆ తర్వాత నుండి స్క్రీన్‌పై కనిపించడం మానేశాడు. అందుకే తన ఫ్యాన్స్‌ను సంతోషపెట్టడం కోసం 2024లో రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. తను హీరోగా నటించిన ‘మార్టిన్’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. దాంతో పాటు నటిస్తున్న ‘కేడీ - ది డెవిల్’ అనే మూవీ ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. 


Also Read: ఆ పోస్టులతో రూ.కోటి సంపాదించే నటికి ఇన్‌స్టాగ్రామ్ షాక్, కారణం ఏంటో తెలుసా?