నేచురల్‌ స్టార్‌ నాని, ‘మహానటి‘ బ్యూటీ కీర్తి సురేష్ నటించిన సినిమా ‘దసరా‘. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 30న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. కేవలం వారం రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది. నాని కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల చుట్టూ తిరిగిన ఈ సినిమా కథ, ప్రేక్షకులను అద్భుతంగా అలరించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విజయోత్సవ వేడుక కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు.


దర్శకుడికి గిఫ్టుగా లగ్జరీ బీఎండబ్ల్యూ కారు


ఈ సినిమా కనీవినీ ఎరుగని రీతిలో బ్లాక్ బస్టర్ కావడంతో నిర్మాత చెరుకూరి సుధాకర్‌ ఆనందంలో మునిగితేలుతున్నారు. తన చిత్ర చిత్రబృందాన్ని ఆయన అభినందించారు. అంతేకాదు, ఈ సినిమా ఘన విజయానికి కారణమైన  దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలకు లగ్జరీ బీఎండబ్ల్యూ కారును గిఫ్టుగా అందించారు. అంతేకాదు, ఈ సినిమా కోసం పని చేసిన వారికి ఒక్కొక్కరికి 10 గ్రాముల బంగారు నాణెలను అందించారు. నిర్మాత సర్ ప్రైజ్ పట్ల దర్శకుడితో పాటు చిత్ర బృందం సంతోషంలో మునిగిపోయింది.






ఆకట్టుకున్న నాని, సుమ డ్యాన్స్


ఇక ఈ విజయోవత్సవ సభలో నాని, సుమ చక్కటి స్టెప్పులు వేశారు. ‘దసరా’ సినిమాలో కీర్తి సురేష్ వేసిన బరాత్ స్టెప్పులను సుమ వేసేందుకు ప్రయత్నించారు. నానితో కలిసి ఆమె చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. చిత్ర బృందం సభ్యులు సైతం అదిరిపోయే డ్యాన్సులు వేశారు.


ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- నాని


సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడిన నానికి ‘దసరా’ బ్లాక్ బస్టర్ కు కారణం అయిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. “ఈ చిత్రాన్ని అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నాని లాంటి యాక్టర్‌ని రూ.100 కోట్ల వసూళ్ల పోస్టర్‌పై చూడాలనుందని దర్శకుడు శ్రీకాంత్‌, ఓ ఓ డైరెక్టర్ తో చెప్పారట. ఆయన కోరిక ఇప్పుడు నెరవేరింది. ‘దసరా’ సినిమాతో నాకు మరింత బలం వచ్చింది. మన డ్రీమ్ ను నిజం చేసుకునేందుకు చాలా కష్టపడుతుంటాం. చాలా మంది మనం సక్సెస్ కాకుండా వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు. ఎవరి మాట వినకండి. మీకు నచ్చినట్లు చేయండి. విజయం తప్పకుండా వస్తుంది. అందుకు ‘దసరా’ బెస్ట్ ఎగ్జాంఫుల్.  ఈ సినిమా సక్సెస్ వెనుక ఎంతో మంది శ్రమ ఉంది. మరెంతో మంది ఆశీర్వాదం ఉంది. వారందరికీ నా ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చారు నాని. అటు ‘దసరా’ సినిమాకు సపోర్టుగా నిలిచిన ప్రభాస్‌, మహేష్ బాబు, రాజమౌళి, సుకుమార్‌ తో పాటు పలువురు సినీ ప్రముఖులకు నాని విజయోత్సవ వేడుక వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.  


Read Also: అతిగా ఆలోచించకండి - విజయ్‌తో డేటింగ్‌పై రష్మిక సెటైర్స్, మరి ఈ సాక్ష్యాల సంగతేంటో!