నేచురల్ స్టార్ నాని, ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కింది. మార్చి 30న పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతికి విడుదలైన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలకు మించి తొలి రోజు కలెక్షన్లు సాధించింది. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా దూసుకుపోతోంది.


అభ్యంతరకర సీన్లు తొలగించాలంటూ అంగన్ వాడీల ఆందోళన


తాజాగా ఈ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. తమను కించపరిచేలా ఈ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని అంగన్ వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వెంటనే ఆ సీన్లను తొలగించడంతో పాటు సినిమా బృందం తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతకీ ఆ సినిమాలో అభ్యంతరకర సీన్లు ఏంటంటే?  కీర్తి సురేష్ ఈచిత్రంలో వెన్నెల అనే క్యారెక్టర్ చేసింది. ఆమె అంగన్ వాడీ కార్యకర్త. ఒకానొక సమయంలో తను పిల్లల కోసం ఇవ్వాల్సిన కోడిగుడ్లను అమ్ముకుంటుంది. అంతేకాదు, మరికొన్ని గుడ్లను తీసుకెళ్లి తమ కుటుంబ సభ్యులకు ఇస్తుంది. ఈ సన్నీవేశాల మీద అంగన్ వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల థియేటర్ల ముందు ధర్నాలు నిర్వహించారు. ‘దసరా’ సినిమాలోని ఆ సీన్లను తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెప్పారు.


విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు


‘దసరా’ సినిమా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వీర్లపల్లి అనే గ్రామం నేపథ్యంలో రూపొందించారు. ఈ చిత్రంపై విడుదలకు ముందు నుంచే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు, పాటకు సినిమాపై ఓ రేంజిలో క్రేజ్ తీసుకొచ్చాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 53 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఓవర్సీస్ లోనూ మిలియన్ డాలర్స్ క్రాస్ చేసింది. ఈ సినిమా లాంగ్ రన్ లో రెండు మిలియన్ డాలర్లు వసూళు చేసే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  






‘దసరా‘ కథేంటంటే?


తెలంగాణలో సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో ఉన్న వీర్లపల్లి అనే గ్రామంలో జరిగే కథ ఇది. ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి) వాళ్ల స్నేహితులతో కలిసి బొగ్గు రైళ్లు కొల్లగొడుతూ ఉంటారు. ధరణి, సూరిల చిన్నప్పటి స్నేహితురాలు వెన్నెల (కీర్తి సురేష్) వీర్లపల్లి లోనే అంగన్ వాడి టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. వెన్నెలని ధరణి ప్రేమిస్తాడు. కానీ సూరి కూడా ప్రేమించడంతో ధరణి త్యాగం చేస్తాడు. ఊర్లో ఉన్న సిల్క్ బార్ కారణంగా వీరి జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతాయి. చివరికి వీర్లపల్లిలో ఏం జరిగింది? ఈ కథలో రాజన్న (సాయి కుమార్), చిన్న నంబి (షైన్ టామ్ చాకో), శివన్న (సముద్ర ఖని) పాత్రలు ఏంటి? అనేవి తెలియాలంటే దసరా చూడాల్సిందే.


నాని సినీ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన ఈ సినిమాను,  ఎస్‌ఎల్‌వి సినిమాస్ నిర్మించింది. ఈ మాస్ యాక్షన్ డ్రామాలో ధీక్షిత్ శెట్టి, సాయి కుమార్, సముద్రఖని, షైన్ టామ్ చాకో, పూర్ణ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.


Read Also: నా మార్గదర్శి రామ్ చరణ్ - భర్త గురించి ఉపాసన ఎంత బాగా చెప్పిందో