ఉపాసన (Upasana)... రామ్ చరణ్ (Ram Charan) సతీమణి. అపోలో హాస్పిటల్స్ అధినేత ముద్దుల మనవరాలు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిసిన ఉపాసన, రామ్ చరణ్ ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెద్దలకు ఈ విషయాన్ని చెప్పారు. వారు కూడా వీరి పెళ్లికి ఓకే చెప్పారు. జూన్ 14, 2012లో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.


తెలుగు చిత్రసీమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన జోడీ ఒకటి.  ఆస్కార్ వేడుకలకు రామ్ చరణ్ తో పాటు ఉపాసన కూడా వెళ్లారు. అంతకు ముందు ఉక్రెయిన్ లో 'నాటు నాటు...' సాంగ్ షూటింగ్ చేసినప్పుడు కూడా భర్తతో పాటు అక్కడికి వెళ్లారు. తనకు అవసరమైన సమయాల్లో తనతో పాటు రామ్ చరణ్ ఉన్నాడని ఉపాసన చెప్పారు. 


చెర్రీ గురించి కీలక విషయాలు వెల్లడించిన ఉపాసన


తాజాగా చెర్రీ దంపతుల నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. పెళ్లయ్యాక 10 సంవత్సరాల తర్వాత వీరిద్దరు బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు చిరంజీవి ప్రకటించారు. ఈ వార్తతో మెగా అభిమానులు సంతోషంలో మునిగితేలారు. ఇక తాజాగా ‘RRR’ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో రామ్ చరణ్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తం అయ్యింది. ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అకాడమీ అవార్డు దక్కింది. ఈ పాటకు ఎన్టీఆర్ తో కలిసి చెర్రీ వేసిన స్టెప్పులు ప్రపంచ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాసన తాజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.  తన భర్త గురించి ఆమె చెప్పిన మాటలు అందరినీ అబ్బురపరిచాయి. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయ్యింది.


కష్ట సమయాల్లో ఒకరికొరు తోడుంటాం- ఉపాసన


“‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఉక్రెయిన్ లో చిత్రీకరించారు. ఆ పాట షూటింగ్ సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను. రామ్ నన్ను అక్కడే ఉంచడమని చెప్పడంతో ఉన్నాను. తనకు మానసికంగా సపోర్టు చేయడానికి అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆయనకు పాట చిత్రీకరణ సమయంలో వెనక ఉండి ధైర్యం చెప్పాను. నేను కష్ట సమయాల్లో ఉన్నప్పుడు తను నాకు ఎంతో అండగా ఉంటాడు.  నా విజయాల్లో తన పాత్ర ఎంతో ఉంటుంది. మేము కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నాం. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. ప్రేమలో ఎలా ఎదగాలో రామ్ నాకు నేర్పించాడు. నాకు తను ఎల్లప్పుడు మార్గదర్శిగా ఉంటారు. నాలో మానసిక ప్రశాంతతకు తను ఎంతో తోడ్పడుతారు. లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఆస్కార్  అవార్డుల వేడుక నా జీవితంలో మరుపు రాని క్షణంగా భావిస్తాను. ‘RRR’ ఫ్యామిలీతో కలిసి ఓ విహారయాత్ర ఎంజాయ్ చేసినట్లు ఫీలయ్యాను” అని ఉపాసన తెలిపారు.






Read Also: ‘నాటు నాటు’ పాటకు ఆలియా, రష్మిక స్టెప్పులు - దద్దరిల్లిన ఆడిటోరియం