విశ్వక్ సేన్ (Vishwak Sen) కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన తాజా సినిమా 'దాస్ కా ధమ్కీ' (Das Ka Dhamki Movie). ఇందులో నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) కథానాయిక. 'పాగల్' తర్వాత విశ్వక్ సేన్ జోడీగా మరోసారి ఆమె నటించిన చిత్రమిది. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ సంస్థలపై విశ్వక్ సేన్, కరాటే రాజు నిర్మించారు. ఈ సినిమా మార్చి 22న థియేటర్లలో విడుదల అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... త్వరలో ఓటీటీలో విడుదల కానుంది.
'ఆహా'లో 'దాస్ కా ధమ్కీ' సందడి!
'దాస్ కా ధమ్కీ' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 'ఆహా' ఓటీటీ సొంతం చేసుకుంది. ఈ నెల 14న డిజిటల్ రిలీజ్ చేయనున్నట్లు ఓటీటీ ప్రతినిథులు పేర్కొన్నారు. ఆల్రెడీ 'ఓరి దేవుడా', 'అశోక వనంలో అర్జున కళ్యాణం'... 'ఆహా'లో విశ్వక్ సేన్ సినిమాలు రెండు ఉన్నాయి. ఇది మూడోది అన్నమాట.
'ఆహా'లో విశ్వక్ సేన్ అతిథిగా వచ్చిన టాక్ షోలు కూడా సూపర్ డూపర్ హిట్. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేసిన 'అన్‌స్టాపబుల్ 2'లో విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ వచ్చిన ఎపిసోడ్ సూపర్ హిట్ అయ్యింది. అలాగే, సుమ కనకాల హోస్ట్ చేసిన 'ఆల్ ఈజ్ వెల్' కూడా హిట్ అయ్యింది.
Also Read : రవితేజ - వరుణ్ ధావన్ - రానా - ఓ బాలీవుడ్ మల్టీస్టారర్!
'దాస్ కా ధమ్కీ' కథ ఏంటంటే?
కృష్ణదాస్ (విశ్వక్ సేన్) అనాథ. అతను ఓ స్టార్ హోటల్‌లో వెయిటర్. ఒక రోజు హోటల్‌కు వచ్చిన కీర్తీ (నివేదా పేతురాజ్)తో ప్రేమలో పడతాడు. వెయిటర్ అనే విషయం దాచి అబద్ధాలు ఆడతాడు. ఆమెతో తానొక పెద్ద ఫార్మా కంపెనీకి సీఈవో అని చెబుతాడు. ఓ రోజు కృష్ణదాస్ వెయిటర్ అనే నిజం కీర్తీకి తెలుస్తుంది. అప్పటి వరకు ఆమె కోసం చేసిన పనుల కారణంగా ఉద్యోగం పోతుంది. రెంట్ కట్టలేదని హౌస్ ఓనర్ సామాన్లు విసిరేస్తాడు. ఆల్మోస్ట్ రోడ్డు మీదకు వస్తున్న సమయంలో సిద్ధార్థ్ మల్హోత్రా (రావు రమేష్) వస్తాడు. తన అన్నయ్య కుమారుడు సంజయ్ రుద్ర (విశ్వక్ సేన్) క్యాన్సర్ చికిత్సకు ఓ డ్రగ్ కనిపెట్టాడని, రీసెర్చ్ మధ్యలో చనిపోయాడని చెబుతాడు. అతడిలా నటించమని చెబుతాడు. సంజయ్ రుద్ర ఇంటికి వెళ్లిన కృష్ణదాస్ షాక్ అవుతాడు. ఎందుకంటే... ఆ సంజయ్ రుద్ర ఎవరో కాదు, ఫార్మా కంపెనీ సీఈవో! అతడి స్థానంలోకి కృష్ణదాస్ వెళ్లిన తర్వాత ఏమైంది? కీర్తి తన అసలు పేరు డాలి అనే నిజాన్ని దాచి కృష్ణదాస్ వెంట ఎందుకు పడింది? కథ ఎన్ని మలుపులు తిరిగింది? అనేది వెండితెరపై చూడాలి.
'హైపర్' ఆది, 'రంగస్థలం' మహేష్, రావు రమేశ్, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు లియోన్ జేమ్స్, రామ్ మిర్యాల సంగీతం అందించారు. దినేష్ కె. బాబు, జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందించారు.
Also Read : నీ భార్యకు, నీకు సంబంధం ఏమిటో చెప్పగలవా? - విష్ణు వర్సెస్ మనోజ్ గొడవపై మోహన్ బాబు