ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య పరిస్థితి ఉప్పు నిప్పు అన్నట్లు ఉంది. వారాహి యాత్రలో వైసీపీ మీద విమర్శలతో జనసేనాని చెలరేగుతున్నారు. ప్రతి విమర్శలతో వైసీపీ నేతలు సైతం బదులిస్తున్నారు. దాంతో వాతావరణం వేడెక్కుతోంది. ఈ తరుణంలో ఓ ఊరిలో కమ్యూనిటీ హాలుగా చిరు పేరును పెడుతున్నామని వైసీపీ ఎంపీ చెప్పడం విశేషమే. పూర్తి వివరాల్లోకి వెళితే...
మెగాస్టార్ చిరంజీవి కమ్యూనిటీ హాలు!
చక్రాయపాలేంలో నూనతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాలుకు చిరంజీవి పేరు పెడుతున్నట్లు వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి (Vallabhaneni Balasouri) ట్వీట్ చేశారు.
''2012-14 మధ్య కాలంలో గౌరవ మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో గుంటూరు జిల్లాలోని కొల్లిపర మండలం చక్రాయపాలేంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 25 లక్షలు మంజూరు చేశారు. అయితే, ఆ నిధులు సరిపోక పోవడంతో ఆ కమ్యూనిటీ హాల్ నిర్మాణం మధ్యలో ఆగిపోయిందని నాకు తెలిసింది. ఎప్పుడూ చక్రాయపాలేం గ్రామాన్ని నా సొంత ఊరుగా భావించే నేను... రూ. 40 లక్షలు వెచ్చించి, మిగిలిన కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని నాలుగు నెలల్లో పూర్తి చేస్తాం. ఆ కమ్యూనిటీ హాలుకు మెగాస్టార్ చిరంజీవి కమ్యూనిటీ హాల్ (Megastar Chiranjeevi Community Hall)గా నామకరణం చేస్తాం'' అని బాలశౌరి పేర్కొన్నారు.
ఒకవైపు కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్న తరుణంలో... ఆ పార్టీకి చెందిన ఎంపీ ఒకరు పవన్ అన్నయ్య, తెలుగు చిత్రసీమలోని అగ్ర కథానాయకులలో ఒకరైన చిరంజీవి మీద ఈ విధంగా అభిమానం చూపించడం విశేషమే. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే చాలా మంది నేతలు సైతం చిరంజీవి విషయానికి వచ్చేసరికి గౌరవ మర్యాదలు కనబరుస్తున్నారు.
Also Read : వాటీజ్ థిస్ బేబీ - విజయ్ దేవరకొండకు దూరంగా రష్మిక!
ఇటీవల పోసాని కృష్ణమురళి కూడా సంచలన విమర్శలు చేశారు. APFTDC ఛైర్మన్ గా ఉన్న ఆయన... పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులపై చేస్తున్న వ్యాఖ్యలకు చిరంజీవి అందరికీ ఫోన్లు చేస్తూ క్షమాపణలు చెప్తున్నారని అన్నారు.
ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... ఆగస్టు 11న 'భోళా శంకర్'తో థియేటర్లలో ఆయన సందడి చేయనున్నారు. ఆ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికి రెండు పాటలు ' భోళా మేనియా', 'జామ్ జామ్ జజ్జనక' విడుదల చేశారు.
'భోళా శంకర్' తర్వాత పెద్దమ్మాయి సుస్మిత కొణిదెల నిర్మాణ సంస్థ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించే సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నారు. ఆ సినిమాకు 'సోగ్గాడే చిన్ని నాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం', 'బంగార్రాజు' సినిమాల ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించనున్నారు. అందులో చిరంజీవి జోడీగా త్రిష నటించనున్నారని సమాచారం. సిద్ధూ జొన్నలగడ్డ, శ్రీ లీల మరో జోడిగా కనిపించనున్నారు.
Also Read : కాణిపాకం వినాయక స్వామి ఆశీస్సులు తీసుకున్న సాయి ధరమ్ తేజ్... ఆయన అపచారం చేశారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial