సినిమా రివ్యూ : మహావీరుడు 
రేటింగ్ : 2.5/5
నటీనటులు : శివకార్తికేయన్, అదితి శంకర్, సునీల్, యోగిబాబు, మిస్కిన్, సరిత తదితరులు
ఛాయాగ్రహణం : విధు అయ్యన్న 
సంగీతం : భరత్ శంకర్
నిర్మాత : అరుణ్ విశ్వ
తెలుగులో విడుదల : ఏషియన్ సినిమాస్
రచన, దర్శకత్వం : మడోన్ అశ్విన్
విడుదల తేదీ: జూలై 14, 2023


తమిళ కథానాయకుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటించిన 'రెమో', 'సీమ రాజా', 'వరుణ్ డాక్టర్', 'డాన్' సినిమాలు తెలుగులోనూ ఆయనకు విజయాలు అందించాయి. ఆయన నటించిన తాజా సినిమా 'మహావీరుడు' (Mahaveerudu Movie). ఇందులో శంకర్ కుమార్తె అదితి హీరోయిన్. సునీల్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా ఎలా ఉందంటే? 


కథ (Mahaveerudu Movie Story) : సత్య (శివ కార్తికేయన్) కార్టూనిస్ట్. అతను మహా భయస్తుడు. కానీ, 'మాహావీరుడు' పేరుతో కామిక్స్ రాస్తాడు. ప్రజలను ఓ వీరుడు రక్షించినట్టు కథలు చెబుతాడు. చివరకు, ఓ పరిస్థితిలో అతను మహావీరుడిగా మారాల్సి వస్తుంది. ప్రజలను రక్షించాల్సి వస్తుంది. అప్పుడు సత్య ఏం చేశాడు? పిరికితనంతో భయపడుతూ వెనకడుగు వేశాడా? లేదంటే ముందగుడు వేశాడా? 


హీరో క్యారెక్టర్ పక్కన పెట్టి... కథకు వస్తే, కుటుంబంతో కలిసి మురికివాడలో సత్య నివాసం ఉంటాడు. మురికివాడలో ప్రజలు అందర్నీ మంత్రి జయసూర్య (మిస్కిన్) ఖాళీ చేయించి, తాను కట్టించిన ప్రజాభవనం అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ ఇస్తాడు. చాలా నాసిరకంగా కట్టిన ఆ భవనం కూలిపోతుందని సత్యకు తెలుస్తుంది. అదీ ఓ అజ్ఞాత గొంతు, సత్యకు మాత్రమే వినిపించే గొంతు చెబుతుంది. అప్పుడు సత్య ఏం చేశాడు? అతడిని ఆ గొంతు ఎలా డైరెక్ట్ చేసింది? అతడి ప్రయాణంలో చంద్ర (అదితి శంకర్) పాత్ర ఏమిటి? చివరకు ఏం జరిగింది? అనేది సినిమా.


విశ్లేషణ (Mahaveerudu Movie Review) : ప్రజల కోసం పోరాటం చేసిన వీరుల కథలు ప్రేక్షకులకు కొత్త ఏమీ కాదు. ఓ పిరికివాడు, పిరికివాడిగా ఉంటూ... తాను ప్రజల కోసం పోరాటం చేయలేనని చేతులు ఎత్తేస్తే? ఓ గొంతు చేసే మాయ ఈ సినిమాకు కొత్తదనాన్ని తీసుకొచ్చింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి... సెటిల్డ్ కామెడీ తీయడంలో దర్శకుడు స్పెషలిస్ట్. శివకార్తికేయన్, యోగిబాబు మధ్య సీన్లు... శివకార్తికేయన్, రవితేజ వాయిస్ మధ్య సీన్లు వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులు నవ్వుతారు.   


హీరో క్యారెక్టరైజేషన్, ఆ కామెడీ సీన్లు 'మర్యాద రామన్న'లో సునీల్ పరిస్థితిని గుర్తు చేస్తాయి. కథ, ఆ హీరో క్యారెక్టర్ ప్రారంభమైన తీరు చూస్తే ముగింపు సులభంగా అర్థం అవుతుంది. అయితే, కథనంలో మాంచి కామెడీతో ఆసక్తి కలిగించారు. చివరి వరకు ఆ ఆసక్తి కొనసాగించడంలో దర్శకుడు విఫలమయ్యారు.


మడోన్ అశ్విన్ రచన, దర్శకత్వంలో విషయం ఉంది. కానీ... కథను విపులంగా, వివరంగా చెప్పాలని ప్రయత్నించడంతో నిడివి ఎక్కువైంది. హీరో పాత్రను పరిచయం చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. పతాక సన్నివేశాలను సైతం సాగదీశారు. సీక్వెల్ కోసం అన్నట్లు చివరి పదిహేను నిమిషాలు తీశారు. ప్రభుత్వం కట్టిస్తున్న ఇళ్లలో ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి? రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు? అని సందేశాన్ని దర్శకుడు అంతర్లీనంగా చెప్పాలని ప్రయత్నించారు. అందుకు, అభినందించాలి.


సినిమాకు మెయిన్ విలన్ లెంగ్త్. కథానాయకుడు భయస్తుడని చెప్పడానికి అన్ని సన్నివేశాలు అవసరం లేదు! అదే  విధంగా భయం వీడి మహావీరుడిగా మారడానికి కూడా! సింపుల్‌గా చెప్పాల్సిన సీన్లను కూడా సాగదీశారు. ప్రేక్షకులకు అర్థం అయ్యే సీన్లను విపులంగా చెప్పడం వాళ్ళ సహనానికి పరీక్ష పెట్టడమే. డిటైల్డ్ డైరెక్షన్ కారణంగా థియేటర్లలో ఎక్కువ సేపు కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది. తెలుగు ప్రేక్షకులకు పాటలు గుర్తు ఉండవు. నేపథ్య సంగీతం ఓకే. కెమెరా వర్క్ పర్లేదు. కానీ, క్లైమాక్స్ వీఎఫ్ఎక్స్ బాలేదు. 


నటీనటులు ఎలా చేశారు? : సామాన్య యువకుడిగా శివకార్తికేయన్ చక్కగా చేశారు. ఆయనకు ఇటువంటి క్యారెక్టర్లు చేయడం కొట్టిన పిండి. దాంతో ఈజీగా చేసేశారు. యాక్షన్ సీక్వెన్సుల్లో ఆయన కామెడీ టైమింగ్ నవ్విస్తుంది. రవితేజ స్క్రీన్ మీద కనిపించలేదు. కానీ, వాయిస్ ఇచ్చి ఓ కీలకమైన పాత్ర పోషించారు. ఆయన గొంతు కారణంగా తెలుగు ప్రేక్షకులకు కథ కనెక్ట్ అవుతుంది. కామెడీ వర్కవుట్ అయ్యింది.


అదితి శంకర్ పాత్ర నిడివి తక్కువ. ఉన్నంతలో చక్కగా చేశారు. తల్లి పాత్రలో సరిత, మంత్రిగా మిస్కిన్, మంత్రి దగ్గర సహాయకుడిగా సునీల్ పాత్రలకు న్యాయం చేశారు. 


Also Read : 'బేబీ' రివ్యూ : ఆనంద్, విరాజ్ - ఇద్దరిలో వైష్ణవి చైతన్య ఎవరి పిల్ల? లేడీ అర్జున్ రెడ్డి అనే సినిమానా?


చివరగా చెప్పేది ఏంటంటే? : 'మహావీరుడు'లో వినోదం బావుంది. అంతర్లీనంగా ఇచ్చిన సందేశమూ ఓకే. అయితే... నిడివి మాత్రం చాలా ఎక్కువైంది. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా కేవలం కామెడీ కోసం వెళితే నవ్వుకోవచ్చు.


Also Read నాయకుడు రివ్యూ: రెండు ఆలోచనల మధ్య యుద్ధం - ఫహాద్ ఫాజిల్, ఉదయనిధి స్టాలిన్ సినిమా ఎలా ఉంది?







ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial