Chiranjeevi about Social Media Influencers: తాజాగా మెగాస్టార్ చిరంజీవి, యంగ్ హీరో విజయ్ దేవరకొండ కలిసి తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ నిర్వహించిన ఒరిజిన్ డే అనే ఈవెంట్‌లో పాల్గొన్నారు. వీరిద్దరూ చీఫ్ గెస్టులుగా వచ్చినా కూడా ఒక ఒకరితో ఒకరు పర్సనల్ విషయాలను, ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటూ ఈవెంట్‌కు వచ్చిన వారిని ఎంటర్‌టైన్ చేశారు. ఫైనల్‌గా అలాంటి ఈవెంట్‌లో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందంటూ డిజిటల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిరు.


చాలా మారిపోయింది..


‘‘బ్లాక్ అండ్ వైట్ సినిమాల దగ్గర నుండి నా ఎంట్రీ ఉంది కాబట్టి నేను ఒకరకంగా అదృష్టవంతుడిని. అంతే కాకుండా గొప్పవాళ్లతో నటించాను. మోడర్న్ టైమ్స్‌లో కూడా ఉన్నాను. ఇప్పటికీ నేను కొనసాగుతున్నానంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. టెక్నాలజీ విషయంలో చిన్న తమాషా విషయం చెప్పాలి. రాజకీయాల్లో నేను 9 ఏళ్లు ఉన్నాను. ఆ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు సెట్‌లో మొదటి షాట్ తీస్తున్నప్పుడు క్లాప్ కొట్టలేదు. క్లాప్ ఎక్కడ అని అడిగితే.. క్లాప్ బోర్డ్స్ లేవండి, ముహూర్తం దగ్గర మాత్రమే పెడుతున్నాం అని చెప్పారు. అంతగా మారిపోయిందా, వావ్ అనుకున్నాను. ఖైదీ నెంబర్ 150 సమయానికే ఇంత మారిపోయింది అనుకున్నాను. కానీ అప్పటికి, ఇప్పటికి టెక్నాలజీ, దాని పట్ల అప్రోచ్ మరింత మారిపోయింది. ఇన్‌ఫ్లుయెన్సర్స్ వల్ల పూర్తి కథ మారిపోయింది’’ అంటూ ప్రతీ మార్పును దగ్గరుండి చూడడడం బాగుందని సంతోషం వ్యక్తం చేశారు చిరంజీవి.


చూస్తుంటే ముచ్చటేస్తుంది..


‘‘సోషల్ మీడియాకు నేను కూడా అడిక్ట్ అయిపోతున్నాను. ఏ పని చేసుకుంటున్నా కూడా మధ్యలో కొంచెం సమయం దొరికితే రీల్స్, మీమ్స్, టిక్‌టాక్, ఇన్‌స్టా చూసుకుంటూ ఉంటే తెలియకుండానే టైమ్ పాస్ అయిపోతుంది. ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తులు ఉన్నారు అని వాళ్లందరినీ చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. మీ టాలెంట్‌ను చూపించుకోవడానికి ఫోన్, టెక్నాలజీ అనేది విపరీతంగా ఉపయోగపడింది. ఇది మీకు డబ్బుతో పాటు ఫేమ్, గుర్తింపును కూడా తీసుకొచ్చింది. దీనిని కుటుంబానికి ఉపయోగపడేలా, ఆర్థికంగా బలపడేలా మార్చుకుంటూ.. సెలబ్రిటీలుగా కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అంతే కాకుండా పదిమందికి ఉపయోగపడేలా దీనిని వినియోగించుకుంటూ ముందుకు వెళ్లాలి’’ అంటూ సలహా ఇచ్చారు మెగాస్టార్.


అడిక్ట్ అయ్యేలా చేస్తున్నారు..


‘‘మీ కలలు, ప్రయత్నాలు ఆపొద్దు. మీ క్రియేటివిటీకి ఫుల్ స్టాప్ పెట్టొద్దు. కానీ దీని వల్ల మా ఇంట్లో గొడవలు కూడా జరుగుతున్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అని ఆడిటర్స్, లాయర్లు, అకౌంటెంట్స్ అందరితో కూర్చొని ఉన్నాను. ప్రజెంటేషన్ జరుగుతుంది. వాళ్లు టెక్నికల్‌గా మాట్లాడుతున్నారు. నాకేమో అంత ఎక్కలేదు. నేను ఫోన్‌లో తమిళనాడు కుకింగ్ వీడియోలు చూసుకుంటున్నాను. అక్కడ ఉన్నవాళ్లు నేను ఫోన్‌లో నోట్ చేసుకుంటున్నాను అనుకొని మీరేం నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. మీకలా అర్థమయ్యిందా అనుకున్నాను. ఏ పని కుదురుగా చేసుకోవడం లేదు. ఆఖరికి ఇంట్లో సంసారం కూడా పాడుచేస్తున్నారు. మీ ఇన్‌ఫ్లుయెన్స్ నాపై ఇంత ప్రభావం చూపిస్తోంది. నేను అడిక్ట్ అవ్వకుండా జాగ్రత్తపడుతున్నాను. కానీ నాలాంటి వాడిని కూడా అడిక్ట్ చేసే సత్తా మీకు ఉంది’’ అంటూ తన మాటలతో ఇన్‌ఫ్లుయెన్సర్లకు సపోర్ట్ అందించారు చిరు.


Also Read: అందరి ముందు ఆ నిర్మాత నాపై అరిచాడు, ఆరోజు భోజనం చేయబుద్ధి కాలేదు - చిరంజీవి