Chiranjeevi: తాజాగా మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ కలిసి ఒక ఈవెంట్‌లో పాల్గొన్నారు. తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్‌కు సంబంధించిన ఈవెంట్‌లో వీరిద్దరూ చీఫ్ గెస్టులుగా సందడి చేశారు. అయితే ఆ ఈవెంట్‌లో కెరీర్ మొదట్లో మెగాస్టార్ ఎదుర్కున్న కష్టాలు ఏంటో చెప్పమని, వాటిని ఎలా డీల్ చేశారో అందరితో షేర్ చేసుకోమని కోరాడు విజయ్. అది విని చాలామంది ఇన్‌స్పైర్ అవుతారేమో అని అన్నాడు. దీంతో చిరంజీవి కూడా ఒక్కసారిగా తన కెరీర్ మొదట్లో ఎన్నో కష్టాలు ఎదుర్కున్నానని చెప్తూ.. తను నటించిన ‘న్యాయం కావాలి’ సినిమా సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.
షార్ట్ కట్స్ లేవు..
‘‘ఎవరి జీవితం కేక్ వాక్ కాదు. దేనికి కూడా షార్ట్ కట్స్ లేవు. చాలా కష్టాలు ఉంటాయి. ఎత్తుపల్లాలు, జయాపజయాలు, ఎగ్జైట్‌మెంట్, డిప్రెషన్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని వచ్చినవాడినే నేను. అవన్నీ నాకు కూడా జరిగాయి. నా మైండ్‌సెట్ ఎలా ఉందో తెలియాలంటే ఒకేఒక్క ఉదాహరణ చెప్పాలంటే.. న్యాయం కావాలి అనే సినిమా. ఆ సినిమాతో చాలా గ్యాప్ తర్వాత ఆ సినిమాతో శారద రీ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ఆవిడ ఒక డిఫెన్స్ లాయర్ పాత్రలో కనిపించారు. నా తరపున జగయ్య డిఫెన్స్ లాయర్‌గా చేశారు. రాధిక కూడా ఆ సీన్‌లో ఉంది. క్రాంతి కుమార్ ప్రొడ్యూసర్ అయినా కూడా పైన క్రేన్‌లో ఉండి ఆపరేట్ చేస్తున్నారు. దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు’’ అంటూ ‘న్యాయం కావాలి’ సినిమా షూటింగ్‌లో ఏం జరిగిందో చెప్పుకొచ్చారు చిరంజీవి.
గుండె పిండేసినట్టు అయ్యింది..
‘‘న్యాయం కావాలి సినిమాలో చివరిగా తీర్పునిచ్చే సీన్ షూట్ చేస్తున్నాం. అందరూ రెడీగా ఉన్నారు. నేను బయట ఉన్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి పిలిచాడు. లోపలికి వచ్చి బోన్‌లో నిలబడ్డాను. అందరి ముందు క్రాంతి కుమార్.. ‘ఏంటండి మిమ్మల్ని కూడా పిలవాలా? వచ్చి ఇక్కడ పడుండరా మీరు. అప్పుడే మీరేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నారా? ఉండండి. జగయ్య, శారదలాంటి పెద్ద పెద్ద యాక్టర్లు లేరా?’ అనేసరికి ఒక్కసారిగా గుండె పిండేసినట్టు అయ్యింది. ఇందులో నా తప్పేముంది నేను బయటే ఉన్నాను. ఎందుకిలా అరిచారు. పైగా క్రేన్ పైన ఉండి అరిచేసరికి ఆయన అరుపులు అందరికీ వినిపిస్తున్నాయి’’ అంటూ నిర్మాత తనతో దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని బయటపెట్టారు.
సూపర్ స్టార్ అయ్యి చూపిస్తా..
‘‘ఆరోజు మధ్యాహ్నం భోజనం చేయబుద్ధి కాలేదు. సాయంత్రం ఇంటికి వెళ్లాక క్రాంతి కుమార్ నాకు ఫోన్ చేశారు. నాకు సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. ఆయన స్ట్రెస్‌లో ఆయన ఉన్నాడు. ఆయన కోపాన్ని నా మీద చూపించుకున్నాడు. కానీ అది పద్ధతి కాదు. ఆ విషయం నన్ను ఎంత డిప్రెస్ చేస్తుంది, ఇంతమంది ముందు నేను ఎంత అవమానానికి గురవుతాను అనుకున్నాను. కానీ అవన్నీ పక్కన పెడితే.. ఒక్క మాట మాత్రం నా మైండ్‌లో ఉండిపోయింది. సూపర్ స్టార్ అనుకుంటున్నారా అని. అయ్యి చూపిస్తా. ఆ ఒక్క మాట మాత్రం నా మైండ్‌లో ఉండిపోయి కసి పెరిగిపోయింది. ఈ విషయాన్ని పట్టుకొని ఆయన మీద ప్రతీకారం తీర్చుకునే బదులు నా ఎదుగుదలకు అడుగులుగా వాడుకున్నాను. ఇలాంటివి చాలా జరిగాయి. నా అవమానాలను కూడా ఎదుగుదలగా మార్చుకున్నాను కాబట్టి నాకు ఎవరి మీద ద్వేషం లేదు’’ అని గర్వంగా చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.
Also Read: కొత్త దర్శకులతో పనిచేయనని తేల్చిచెప్పిన విజయ్ దేవరకొండ - ఎందుకంటే?