కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీకి జరిగిన అవమానం గురించే ప్రస్తుతం ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. చాలామంది కామెడీ పేరుతో ఆయన కలర్ ను లేదా రూపాన్ని తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదంటూ మండిపడుతున్నారు. తాజాగా ప్రముఖ సింగల్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ విరుచుకుపడింది.
కమెడియన్ షోలో అట్లీకి అవమానం
అట్లీ గురించి సౌత్ నుంచి నార్త్ వరకు ఉన్న ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఫస్ట్ మూవీ 'రాజా రాణి'తోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు ఈ డైరెక్టర్. ఈ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా కల్ల్ట్ క్లాసిక్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత వరసగా విజయ్ హీరోగా మూడు సినిమాలు చేసి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. అనంతరం బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ 'జవాన్' తీసి ఆయనకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఆ టైంలో వరుస పరాజయాలతో ఉన్న షారుక్ ఖాన్ 'జవాన్'తో మళ్ళీ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు తమిళంలో హిట్ టాక్ తెచ్చుకున్న 'తేరి' సినిమాకు రీమేక్ గా 'బేబీ జాన్' అనే హిందీ సినిమాను చేస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తుండగా... డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
'బేబీ జాన్' మూవీ ప్రమోషన్స్ లో అట్లీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ పాపులర్ కామెడీ షో 'కపిల్ శర్మ' షోలో ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం పాల్గొంది. అయితే షోలో భాగంగా కపిల్ "మీరు స్టార్ హీరో దగ్గరకు కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా అట్లీ ఎక్కడ అని అడిగారా?" అని డైరెక్ట్ గా అట్లీనే ప్రశ్నించారు. దానికి అట్లీ ఏ మాత్రం బాధపడకుండా కపిల్ శర్మకు కూల్ గానే ఇచ్చి పడేశారు. "ఈ ప్రశ్న మీరు ఎందుకు వేసారో నాకు అర్థమైంది. కానీ నేను ముందుగా మురుగదాస్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. నేను నా ఫస్ట్ మూవీ కథతో ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు నా కథ విని ఓకే చేశారు. అంతేగాని ఆయన నా రూపాన్ని, నా కలర్ ని చూడలేదు. కాబట్టి ఈ ప్రపంచం మన ప్రతిభ గురించి మాట్లాడుతుంది, లుక్స్ గురించి కాదు. లుక్స్ ఇంపార్టెంట్ కాదు, మనసు ముఖ్యం" అంటూ చెప్పి కపిల్ శర్మ నోరు మూయించారు. నిజానికి ఇదంతా ఫన్నీ గానే జరిగింది. కానీ ఆ వీడియో బయటకు వచ్చాక కపిల్ శర్మను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
జాత్యహంకారం అంటూ చిన్మయి ఫైర్
తాజాగా ఈ వివాదంపై సింగర్ చిన్మయి స్పందిస్తూ "కామెడీ పేరుతో ఆయన చర్మం రంగు పై ఈ విపరీతమైన జాత్యహంకార హేళనను ఇక ఆపరా? కపిల్ శర్మ వంటి మంచి పాపులారిటీ ఉన్న వ్యక్తి ఇలా చెప్పడం డిసప్పాయింట్ చేసింది" అంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది చిన్మయి. అయితే అట్లీ లుక్ విషయంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. షారుఖ్ ఖాన్ తో అట్లీ 'జవాన్' సినిమా తీయబోతున్నాడు అనే వార్తలు వచ్చినప్పుడు కూడా, బ్లాక్ అండ్ వైట్ కలర్ అంటూ తెగ ట్రోల్ చేశారు నార్త్ ఆడియన్స్. కానీ 'జవాన్' సినిమాను చూశాక మళ్లీ అలాంటి కామెంట్స్ చేసే ధైర్యం ఎవ్వరూ చేయలేదు.
Read Also : Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!